Deloitte: డెలాయిట్ గుడ్ న్యూస్.. భారత్‌లో 50 వేల నియామకాలపై కీలక ప్రకటన
కృత్రిమ మేధస్సు వల్ల ఉద్యోగాలు తగ్గవని డెలాయిట్ స్పష్టం చేసింది. నైపుణ్యాలను పెంచుకుంటే కొత్త అవకాశాలు లభిస్తాయని నితిన్ కిని తెలిపారు. భారత్‌లో 50 వేల నియామకాల ప్రణాళిక యథాతథంగా కొనసాగుతుందని వెల్లడించారు. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి ...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఉద్యోగాలు పోతాయి అనే భయం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. అయితే ఈ భయాలకు చెక్ పెడుతూ ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ సౌత్ ఆసియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నితిన్ కిని స్పష్టమైన సందేశం ఇచ్చారు. కృత్రిమ మేధస్సు వల్ల భారీ స్థాయిలో ఉద్యోగాలు కోల్పోవడం జరగదని, అసలు ఫోకస్ నైపుణ్యాల పెంపు మీదే ఉండాలని ఆయన అన్నారు. “జాబ్స్ పోవడం కాదు.. వాటి స్వరూపం మారుతుంది” ఆయన క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చారు. కొత్త టెక్నాలజీతో కలిసి పనిచేసే స్కిల్స్ పెంచుకుంటే, పెద్ద స్థాయి వ్యాపార సమస్యలను పరిష్కరించే అవకాశాలు వస్తాయని ఆయన తెలిపారు. కృత్రిమ మేధస్సును ఉద్యోగులను తగ్గించే సాధనంగా కాకుండా, పనితీరును మెరుగుపరచే పద్ధతిగా చూడాలని సూచించారు.
భారత్‌లో 50,000 మంది నిపుణులను నియమించాలనే డెలాయిట్ ప్రణాళికలో ఎలాంటి మార్పు లేదని కినీ స్పష్టం చేశారు. ఇది సంస్థ దీర్ఘకాల వ్యూహంలో భాగమని చెప్పారు. ఇప్పటికే 30,000 మంది ఉద్యోగులకు కృత్రిమ మేధస్సుపై శిక్షణ ఇవ్వగా, మరో 20,000 మంది సంస్థ అంతర్గత వేదికలపై పని చేసేలా మారుతున్నారు. డెలాయిట్ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు మూడో వంతు భారత్‌లోనే ఉందని కినీ పేర్కొన్నారు. దీంతో దేశం సంస్థకు కీలక కేంద్రంగా మారిందని స్పష్టం చేశారు. అంతేకాదు, భారత్‌లో ‘క్వాంటం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ స్థాపనకు కూడా సంస్థ సిద్ధమవుతోంది. ప్రతి ఏడాది సంస్థ తన ఆదాయంలో సుమారు 9 శాతం సామర్థ్యాల పెంపు, నూతన ఆవిష్కరణల కోసం ఖర్చు చేస్తోందని తెలిపారు. దీని ద్వారా ఆధునిక సాంకేతిక సామర్థ్యాలను పెంచడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు.
భారత ప్రభుత్వ సంస్థలు, పెద్ద కంపెనీలు కృత్రిమ మేధస్సును పూర్తిగా అమలు చేయడంలో ఇంకా వెనుకంజ వేస్తున్నాయని కినీ తెలిపారు. దీనికి ప్రధాన కారణాలు సమాచార భద్రతపై ఉన్న ఆందోళనలు, ఖర్చులు ఎంతవరకు పెరుగుతాయో తెలియని అనిశ్చితి అని చెప్పారు. సంస్థల సమాచారం అంటే వారి మేధో సంపత్తి కావడంతో అది బయటకు వెళ్లకూడదనే భయం ఉందని, అలాగే వినియోగం పెరిగే కొద్దీ ఖర్చులు ఎలా మారతాయో స్పష్టత లేకపోవడంతో జంకుతున్నారని వివరించారు. భారత్ కృత్రిమ మేధస్సులో ముందంజలో ఉండాలా.. లేక సైబర్ భద్రతలో బలపడాలా.. అనే ప్రశ్నకు కినీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “ఒకదానిని ఎంచుకోవాల్సిన అవసరం లేదు… రెండింటినీ సాధించాలి” అని స్పష్టం చేశారు.
కృత్రిమ మేధస్సు యుగంలో భయం కాదు.. మార్పే కీలకం. నైపుణ్యాలను పెంచుకుంటే అవకాశాలు రెట్టింపు అవుతాయి. భారత్‌కు ఇది సాంకేతిక రంగంలో మరో పెద్ద అవకాశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Nitin Kini
