నేటి సాయంత్రం జానకమ్మ అంత్యక్రియలు.. ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు
Singer S Janaki Death: దక్షిణాది గానకోకిల, ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి అంత్యక్రియలు నేడు (ఆదివారం) సాయంత్రం మైసూరు బోగాది సమీపంలోని కణియర హుండి గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ప్రజల సందర్శనార్థం ఆమె పార్ధివ దేహాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు మైసూరులోని మహారాజా కళాశాల మైదానంలో ఉంచనున్నారు. అనంతరం అధికారిక గౌరవాలతో అంతిమయాత్ర నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరపనున్నారు. వేలాది మధుర గీతాలతో సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన జానకమ్మకు అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.

దక్షిణాది గానకోకిల ఎస్ జానకి (88) కార్డియాక్ అరెస్ట్‌తో శనివారం రాత్రి 7.30 గంటలకు మృతి చెందారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూల్ (బహుళ అవయవ వైఫల్యం)తో జానకమ్మ గుండెపోటుకు గురయ్యారు. గతేడాది ఒక్కగానొక్క కుమారుడు మురళీకృష్ణ మరణంతో జానకమ్మ తీవ్రంగా మానసిక కుంగుబాటుకు గురయ్యారు. బయట ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని మౌనాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో శనివారం ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మైసూరులోని అపోలో ఆస్పత్రిలో ఐసీయూలో చేర్పించారు. ఆ సమయంలో జానకమ్మతోపాటు కోడలు ఉమా, మనమరాలు అప్సరా కూడా ఉన్నారు. జానకమ్మ మరణంతో యావత్ సంగీత ప్రియులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. తన సుమధుర కంఠంతో ఆబాలగోపాలాన్ని ఓలలాడించిన జానకమ్మ మరణం తీరనిలోటు. అయినా ఆమె ఆలపించిన వేలాది పాటల రూపంలో చిరస్మరణీయంగా ఉంటారు. ఆమె అంత్యక్రియలు ఈ రోజు (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు మైసూరు బోగాది సమీపంలోని కణియర హుండి గ్రామంలోని ఫామ్‌హౌజ్‌లో జరగనున్నాయి. అయితే ప్రజల సందర్శనార్థం ఆమె పార్ధివ దేహాన్ని ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మైసూరులోని మహారాజ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఉంచుతారు. ప్రభుత్వ లాంఛనాలతో నేటి సాయంత్రం జానకమ్మ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
భర్త, కొడుకు మృతితో ఒంటరై..
ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె పాత తాలూకాలోని నిజాంపట్నం మండలం పల్లపట్లలో 938 ఏప్రిల్ 23న సత్యవతి, శ్రీరామమూర్తి దంపతులకు జన్మించారు. తండ్రి శ్రీరామమూర్తి ఆయుర్వేద వైద్యుడు. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో నాలుగో సంతానం జానకి. చదువంటే ఇష్టంలేని జానకి.. రేడియోలో పాటలు వింటూ కాలక్షేపం చేసేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె కుటుంబం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో, తర్వాత రాజమండ్రిలో ఉన్నారు. కూతురికి పాటలపై ఉన్న ఆసక్తిని గమనించిన తల్లి సత్యవతి, రాజమండ్రిలో నాదస్వర విద్వాన్ గాడవల్లి పైడిస్వామి దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించినా.. ఆమెకు మాత్రం ప్రత్యేకంగా సినిమా పాటలంటేనే ఎక్కువగా ఇష్టపడేవారు. అయితే ప్రత్యేకంగా శాస్త్రీయ సంగీతం మాత్రం ఎవరి వద్దా నేర్చుకోలేదు. ఆ తర్వాత రాంప్రసాద్‌తో ఆమెకు 1959లో వివాహమైంది. జానకమ్మ రెమ్యూనరేషన్, రాయల్టీలు, పాటల ఒప్పందాలు అన్నీ ఆయనే స్వయంగా చూసుకునే వారు. వీరికి ఒకే ఒక్క కుమారుడు మురళీ కృష్ణ. కోడలు ఉమ నర్తకి. అయితే 1997లో గుండెపోటుతో భర్త మృతి చెందారు.
వేల పాటలు.. వందల అవార్డులు..
ఆమె తన కెరీర్‌లో తెలుగు, తమిళంతోపాటు కన్నడం, మలయాళం, హిందీ, పంజాబి, ఒరియా, తుళు, కొంకణి, బడగ, సింహళం, ఇంగ్లిష్, సంస్కృతం, జర్మన్, జపాన్ వంటి 20 భాషల్లో 48 వేలకు పైగా పాటలు ఆలపించారు. ఇందులో 17 వేలకు పైగా సినిమా పాటలు ఉన్నాయి. ప్రైవేటు రికార్డులు, త్యాగరాజ కృతులు, మీరా భజన్లు మిగిలినవి. ఇక జానకమ్మ జీవితంలో ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకున్నారు. 13 సార్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, ఆరుసార్లు తమిళనాడు ప్రభుత్వ అవార్డులు, మరో ఆరుసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవార్డులు, 12 నంది అవార్డులు, 4 జాతీయ పురస్కారాలు, ఏడు సార్లు ఉత్తమ గాయనీగా అవార్డులు, ఒడిశా ప్రభుత్వ అవార్డులు లభించాయి. అయితే ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని మాత్రం ఆమె తిరస్కరించడం యావత్ సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక 2017 నుంచి పూర్తిగా పాటలకు రిటైర్‌మెంట్ తీసుకున్నారు. జానకమ్మ.. గత ఆరేళ్లుగా మైసూరు బన్నూరు రోడ్డులోని ఫార్మ్‌హౌజ్‌లో నివసిస్తున్నారు. నవీన్, పవన్ అనే వ్యక్తులు ఆమెకు తోడునీడగా ఉంటూ సేవలు అందిస్తూ వచ్చారు. భర్త, కుమారుడు మరణాలతో మానసికంగా కుంగిపోయిన జానకి పలు ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. నేటి సాయంత్రం జరగనున్న జానకమ్మ అంతిమ సంస్కారాలకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ, సంగీత రంగ ప్రముఖులు హాజరుకానున్నారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానం ఎప్పటికీ చిరస్మరణీయం.. అమరం..
