AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon fruits: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడొద్దంటే.. ఈ పండ్లు కచ్చితంగా తినాల్సిందే!

వర్షాకాలం స్టార్ట్ అయిందంటే చాలూ చాలా మంది జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల భారీన పడుతుంటారు. ఎందుకంటే వర్షాకాలంలో చల్లని వాతావరణం కారణంగా బ్యాక్టీరియా, వైరస్‌లు గాలి, నీటిలో వేగంగా వ్యాపిస్తాయి. దీనికి తోడు ఈ కాలంలో రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అందువల్ల మనం త్వరగా వ్యాధుల భారీన పడుతాం. కాబట్టి వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కేవలం మందులపైనే ఆధారపడకుండా, సీజనల్ పండ్లను తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అదెలానో చూద్దాం.

Monsoon fruits: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడొద్దంటే.. ఈ పండ్లు కచ్చితంగా తినాల్సిందే!
Best Fruits For Rainy Season
Anand T
|

Updated on: Jul 12, 2026 | 6:30 AM

Share

వర్షాకాలం వచ్చిందంటే చాలు జ్వరం, జలుబు, గొంతు నొప్పి, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి వ్యాధులు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ సీజన్‌లో మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. తద్వారా త్వరగా మనం అనారోగ్యం బారీన పడుతాం. అయితే ఈ సమయంలో కేవలం మందులే కాకుండా, పౌష్టికాహారం, సీజనల్ పండ్లు, కూరగాయలు తినడం వల్ల మనం సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ముఖ్యంగా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఖనిజాలు సమృద్ధిగా ఉండే కొన్ని పండ్లు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

వర్షాకాలంలో తినాల్సిన పండ్లు ఇవే

నేరేడు పండు: నేరేడు పండ్లలో విటమిన్ సి, ఐరన్, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణక్రియకు సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహా తీసుకుని ఈ పండును తగిన పరిమాణంలో తినవచ్చు.

దానిమ్మ: సాధారణంగా దానిమ్మ పాలిఫెనాల్స్, విటమిన్ సి కి మంచి మూలం. ఇది శరీరంలో మంటను తగ్గించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, వైరల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

యాపిల్: ప్రతిరోజూ ఒక యాపిల్ తినడం వల్ల ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. వర్షాకాలంలో మందగించే జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కడుపు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది సహాయపడుతుంది.

జామకాయ : విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లలో జామకాయ ముఖ్యమైనది. నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి కలిగిన ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచడానికి, గొంతు ఇన్ఫెక్షన్లు, సాధారణ జలుబు ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

వర్షాకాలంలో పండ్లు తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వర్షాకాలంలో పండ్లు తినేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం మీరు తినే పండ్లను తొలుత ఉప్పు నీటితో లేదా ప్రవహించే నీటితో బాగా కడిగి తినండి. రోడ్డు పక్కన కట్ చేసి ఉంచిన పండ్లను తినకండి. కట్ చేసిన పండ్లను ఎక్కువ సమయం బయట పెట్టవద్దు. పిల్లలకు, వృద్ధులకు ఎప్పుడూ తాజా పండ్లనే ఇవ్వండి. జ్వరం, మధుమేహం లేదా అలర్జీ ఉన్నవారు వైద్యుల సలహా మేరకు ఆహారాన్ని ఎంచుకోవడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us