Health Tips: ఇవి రోజూ నాలుగు తింటే అస్సలు అలసిపోరు.. ఎల్లప్పుడూ శక్తివంతంగా ఉండాలంటే ఇలా చేయండి..
అయితే రోజూ 57 గ్రాముల బాదం పప్పు తీసుకొని దానితో పాటు వ్యాయామం కూడా చేసే వారిలో ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అత్యంత వేగంగా అందుతున్నాయని నిపుణులు కొనుగొన్నారు.
ప్రకృతి అందించే ప్రతీ ఆహారం ఆరోగ్యాన్ని ఇచ్చేదే. పండ్లు, ఆకుకూరలు ఇలా ఏదైనా.. మనిషి మంచి కోరేదే. వాటిల్లో బాదంపప్పు కూడా ఒకటి. సాధారణంగా శరీరానికి మంచి చేసేవి నోటికి అంతగా రుచిగా ఉండవు అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఈ బాదం పప్పు విషయంలో మాత్రం ఈ రూల్ వర్తించదు. ఎందుకంటే బాదం నాలుకకు ఎంత రుచిగా ఉంటుందో.. శరీరానికి అంత ఆరోగ్యాన్ని ఇస్తుంది. దీనిని రోజూ తినడం ద్వారా గుండె ఆరోగ్యంతో చర్మ సౌందర్యం, చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోవడం వంటివి జరుగుతాయని మనందరికీ తెలుసు. అయితే రోజూ 57 గ్రాముల బాదం పప్పు తీసుకొని దానితో పాటు వ్యాయామం కూడా చేసే వారిలో ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అత్యంత వేగంగా అందుతున్నాయని నిపుణులు కొనుగొన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
పోషకాల నిధి..
రోజూ వ్యాయామం చేసే వారు.. క్రమం తప్పకుండా బాదంపప్పు తింటే వారిలో ఆరోగ్యకరమైన కొవ్వులు వేగంగా వృద్ధి చెందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మహిళలు, పురుషులు ఇరువురిలోనూ ఇది జరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. ప్రతి రోజూ 57 గ్రాముల బాదం పప్పు తీసుకుంటూ.. క్రమం తప్పకుండా ఒక నెల పాటు వ్యాయామం చేస్తే.. వారి రక్తంలోని 12,13-డైహైడ్రాక్సీ-9Z-ఆక్టాడెసెనోయిక్ యాసిడ్ (12,13-DiHOME) వేగంగా వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు.
పరిశోధన ఎలా సాగిందంటే..
నార్త్ కరోలినా రీసెర్చ్ క్యాంపస్‌లోని అప్పలాచియన్ స్టేట్ యూనివర్శిటీ హ్యూమన్ పెర్ఫార్మెన్స్ లాబొరేటరీకి చెందిన నిపుణుల బృందం.. కొందరు వాలంటీర్లపై అధ్యయనం చేసింది. వారిలో కొందరికి రోజూ వ్యాయమంతోపాటు 57 గ్రాముల బాదంపప్పు తినిపించారు. మరికొందరితో కేవలం వ్యాయామంతో సాధారణ ఆహారాన్ని మాత్రమే అందించారు. దీని ఫలితాలను విశ్లేషించినప్పుడు బాదంపప్పు తిని వ్యాయామం చేసి వారిలో మిగిలిన వారితో పొల్చితే 12,13-DiHOME బాగా ప్రయోజనకరంగా ఉన్నట్లు గుర్తించారు. బాదం తిన్న వారిలో అలసట, శక్తి వినియోగం తగ్గినట్లు వివరించారు. కండరాల పటుత్వం పెరిగినట్లు నిర్ధారించారు.
ఇవి బాదం పప్పు ప్రత్యేకతలు..
బాదంపప్పులు ప్రత్యేకమైన, సంక్లిష్టమైన పోషకాలు, పాలీఫెనాల్ మిశ్రమాన్ని అందజేస్తాయని ఈ ట్రయల్స్ ద్వారా నిపుణులు గుర్తించారు. వీటితో పాటు దీనిలో అధిక మొత్తంలో ఉండే ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ, ఖనిజాలు, ఫైబర్ శరీర వ్యవస్థలను అదుపులో ఉంచేందుకు సాయపడతాయని వివరించారు. ఫలితంగా మన ఆరోగ్యానికి మేలుచేస్తాయని స్పష్టం చేశారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..