Egg Recipe: నోరూరించే మసాలా ఎగ్ కర్రీ.. తింటే వారెవ్వా అనక మానరు
ఎంత పనిలో ఉన్నా చిటికెలో చేయగల రెసిపీ ఏదైనా ఉంది అంటే అది కోడి గుడ్డే. దీంతో ఎలా వండినా ఏదో ఒక రుచితో తినగలిగేలా వంట రెడీ అయిపోతుంది. అయితే ఎప్పుడూ చేసుకున్నట్టుగా కాకుండా దీంతో ఓసారి ఇలా మసాలా ఎగ్ ఫ్రై ట్రై చేయండి. ఇది మీ నాలుకు తుప్పు వదిలే రుచితో రావడం గ్యారెంటీ..

గుడ్డుతో అనేక వంటకాలు చేస్తారు. చాలా మంది దీంతో అనేక రెసిపీలను ట్రై చేస్తుంటారు. అయితే, తక్కువ మసాలాలతో శనగపిండి లేదా వేయించిన శనగల పొడితో చేస్తే మరింత రుచిగా ఉంటుందీ కూర. ఎగ్ ఫ్రైని ఓ సారి ఇలా ట్రై చేసి చూస్తే ఎప్పుడూ ఇదే వెరైటీ చేసుకుని తింటారు. అంతలా దీని టేస్ట్ ఇంటిల్లిపాదికీ నచ్చేస్తుంది. మరి ఈ మసాలా ఎగ్ కర్రీని ఎలా తయారు చేయాలి.. అందుకు కావలసిన పదార్థాలేమిటో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
నూనె – 2 టేబుల్ స్పూన్లు ఆవాలు – పావు స్పూను మినపప్పు – పావు స్పూను జీలకర్ర – పావు స్పూను వెల్లుల్లి రెబ్బలు – 10 (చిన్నగా తరిగినవి) అల్లం – అర ఇంచు (చిన్నగా తరిగినది) పచ్చిమిర్చి – 2 కరివేపాకు – ఒక రెమ్మ పెద్ద ఉల్లిపాయ – 1 (పొడుగ్గా తరిగినది) పసుపు పొడి – పావు స్పూను కారం పొడి – ఒక స్పూను ధనియాల పొడి – ఒక స్పూను జీలకర్ర పొడి – ఒక స్పూను ఉప్పు – తగినంత గుడ్లు – 4 మిరియాల పొడి – అర స్పూను వేయించిన శనగల పొడి లేదా శనగపిండి – 1 కప్పు (నీటిలో కలపాలి) గరం మసాలా పొడి – అర స్పూను కొత్తిమీర – కొద్దిగా
తయారీ విధానం:
బాండీలో నూనె వేడి చేయాలి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత పసుపు పొడి, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలా పచ్చి వాసన పోయాక, అర గ్లాసు నీళ్లు పోసి బాగా మరిగించాలి. గ్రేవీ చిక్కగా అయ్యాక గుడ్లు పగలగొట్టి వేయాలి. గుడ్లను ఒకేసారి కాకుండా బాండీలో ఒకవైపు వేస్తే కూర చూడటానికి బాగుంటుంది. గుడ్ల పైన మిరియాల పొడి, జీలకర్ర పొడి చల్లి మూత పెట్టి చిన్న మంటపై ఉడికించాలి. వేయించిన శనగల పొడి లేదా శనగపిండిని కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. గుడ్లు ఉడికిన తర్వాత, ఈ శనగల పిండి మిశ్రమాన్ని బాండీ చుట్టూ పోసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. చివరగా గరం మసాలా పొడి, తరిగిన కొత్తిమీర చల్లితే టేస్టీ గుడ్డు కూర రెడీ! ఇది చాలా రుచిగా ఉంటుంది.
