Neem Soap: ఇంట్లోనే వేప ఆకుతో సబ్బుని తయారుచేసుకోండి ఇలా.. వర్షాకాలంలో చర్మ సమస్యలకు చెక్ పెట్టండి..
ఇంట్లో మీరే వేప సబ్బులను తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న వేప సబ్బు మీ చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను దూరం చేస్తుంది. ఈ రోజు వేప సబ్బు తయారీ గురించి తెలుసుకుందాం..
Neem Soap: వేపలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వేప ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మీ చర్మానికి కూడా ఒక వరం. వర్షాకాలంలో చర్మంపై మొటిమలు, దురద, దద్దుర్లు వంటి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యల నుంచి వేప ఉపశమనాన్ని ఇస్తుంది. వేప ఆకులను నీళ్లలో వేసి మరిగించి స్నానం చేయడం వల్ల చర్మపై ఏర్పడే అలర్జీలు కూడా తొలగిపోతాయి. అయితే ఈ నీటిని రోజూ తయారు చేసుకోవడం ఇబ్బంది. అటువంటి పరిస్థితిలో.. మీరు స్నానం చేసేటప్పుడు వేప సబ్బును ఉపయోగించవచ్చు. మార్కెట్‌లో వేప సబ్బు పేరుతో విక్రయించే సబ్బులపై నమ్మకం ఉండడం లేదు. కనుక ఇంట్లో మీరే వేప సబ్బులను తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న వేప సబ్బు మీ చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను దూరం చేస్తుంది. ఈ రోజు వేప సబ్బు తయారీ గురించి తెలుసుకుందాం..
సబ్బు తయారీకి కావలసిన పదార్థాలు వేప ఆకులు, గ్లిజరిన్ సబ్బు, విటమిన్ ఇ క్యాప్సూల్, నీరు, సబ్బు తయారీకి ఒక అచ్చు తీసుకోండి, అచ్చు లేకపోతే కాగితం కప్పు లేదా చిన్న గిన్నె తీసుకోండి.
ఎలా తయారు చేయాలంటే: ముందుగా వేప ఆకులను నీటితో శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. మీకు గ్రైండ్ చేయడంలో ఇబ్బంది ఉంటే, అవసరాన్ని బట్టి వేపాకుల్లో నీరు వేసి చాలా మెత్తగా పేస్ట్ చేయండి. ఒక గిన్నెలో లేదా ఏదైనా పాత్రలో తయారు చేసిన పేస్ట్‌నువేసుకోండి. అనంతరం గ్లిజరిన్ కలిగిన సబ్బుని చిన్న ముక్కలుగా కట్ చేయండి.. ఇప్పుడు ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో నీళ్లు పోసి ఆ నీటిని వేడి చేయాలి. నీళ్లు కాస్త వేడి అయ్యాక అందులో ఖాళీ గిన్నె పెట్టి ఆ గిన్నెలో సబ్బు ముక్కలు వేయాలి. వేడితో, సబ్బు ముక్కలు కరగడం ప్రారంభమవుతాయి. అవి పూర్తిగా కరిగిన తర్వాత.. వేప ఆకుల పేస్ట్ జోడించండి. విటమిన్ ఇ క్యాప్సూల్‌ని కట్ చేసి అందులో వేసి కాసేపు వేడెక్కనివ్వండి. దీని తరువాత, మీరు ఈ ద్రవాన్ని కాగితం కప్పులో, సాదా చిన్న గిన్నెలో లేదా అచ్చులో వేసుకోండి. అంతేకాదు మీకు నచ్చిన సబ్బు ఆకారం ఉన్న అచ్చుల్లో మిశ్రమాన్ని వేయండి. బాగా గడ్డకట్టిన తర్వాత, కత్తి సహాయంతో బయటకు తీసుకోవాలి. ఈ వేప సబ్బును క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా.. చర్మానికి సంబంధించిన అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. . TV9 తెలుగు వీటిని ధృవీకరించలేదు. నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించండి.)