AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Droupadi Murmu: ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా తినరు.. యోగా, ధ్యానం మరవరు.. ముర్ము లైఫ్‌స్టైల్‌ ఏంటంటే?

Droupadi Murmu Lifestyle: భారతదేశ ప్రథమ పౌరురాలిగా,15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము (Droupadi Murmu) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తద్వారా ఈ అత్యున్నత పదవిని అధిరోహించిన రెండో మహిళగా, మొట్ట మొదటి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు. .

Droupadi Murmu: ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా తినరు.. యోగా, ధ్యానం  మరవరు.. ముర్ము లైఫ్‌స్టైల్‌ ఏంటంటే?
Droupadi Murmu
Basha Shek
|

Updated on: Jul 26, 2022 | 4:02 PM

Share

Droupadi Murmu Lifestyle: భారతదేశ ప్రథమ పౌరురాలిగా,15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము (Droupadi Murmu) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తద్వారా ఈ అత్యున్నత పదవిని అధిరోహించిన రెండో మహిళగా, మొట్ట మొదటి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు. ముర్ము కంటే ముందు ప్రతిభా పాటిల్ మాత్రమే రాష్ట్రపతి పదవిని చేపట్టారు. ఇక ద్రౌపది ముర్ము వ్యక్తిగత వివరాల్లోకి వెళితే .. ఒడిశాలోని మయూర్‌ భంజ్‌ జిల్లాలోని ఒక గిరిజన కుటుంబంలో 20 జూన్ 1958 జన్మించారామె. ఉపాధ్యాయురాలిగా కెరీర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి చేరారు. కౌన్సిలర్ పదవి నుంచి గవర్నర్‌ దాకా ఎదిగారు. అయితే ఎన్ని పదవులు చేపట్టినా సాదాసీదాగా జీవించడానికి మాత్రమే ఆమె ఇష్టపడతారు. మరి మన రాష్ట్రపతి జీవనశైలి (Life Style) ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం రండి.

సమయపాలనలో నిక్కచ్చిగా..

ద్రౌపది ముర్ము ఉపాధ్యాయురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. దీంతో క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడం ఆమె దినచర్యలో భాగమైంది. సమయపాలన కచ్చితంగా పాటిస్తారు. ఎక్కువగా శివుడిని ఆరాధిస్తారు. ఎక్కడికెళ్లినా ముర్ము చేతిలో రెండు పుస్తకాలు కచ్చితంగా ఉంటాయి. అందులో ఒకటిది శివునిది కాగా మరొకటి ట్రాన్స్‌లేషన్‌ బుక్‌. విరామం దొరికినప్పుడల్లా ఈ రెండు పుస్తకాలను చదువుతూ ఉంటారామె.

ఇవి కూడా చదవండి

యోగా, నడక, ధ్యానం..

ద్రౌపది ముర్ము చాలా క్రమబద్ధమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. ప్రతిరోజూ ఉదయం 03:30 గంటలకు నిద్ర మేల్కొంటారు. వ్యాయామంలో భాగంగా కొద్ది సేపు నడుస్తారు. ఆ తర్వాత యోగా, ధ్యానం చేస్తారు. వ్యక్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వీటిని మాత్రం కచ్చితంగా పాటిస్తారామె. ఇక తన జీవితాన్ని సింపుల్‌గా లీడ్‌ చేయడానికి ముర్ము ఇష్టపడతారు. అందులో భాగంగానే ప్రమాణ స్వీకారం సమయంలో సంతాలీ చీర, సాదాసీదా చెప్పులు ధరించి కనిపించారు. ఆమె పూర్తిగా శాఖాహారి. ఆహారంలో ఉల్లిపాయలు, వెల్లుల్లిని కూడా చేర్చుకోదు. ఆమెకు ఇష్టమైన స్వీట్ చెన్నా పోడా. ఇది ఒడిశాలో స్పెషల్‌ స్వీట్.

డిప్రెషన్ నుంచి బయటపడేందుకు

కాగా ముర్ము జీవితం పూలపాన్పేమీ కాదు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. 2010-2014 ల మధ్య కాలంలో ఆమె భర్త, తన ఇద్దరు కుమారులను కోల్పోయారు. ఫలితంగా ఆమె డిప్రెషన్‌ బారిన పడ్డారు. అయితే మనోధైర్యం మాత్రం కోల్పోలేదు. భగవంతుడిపై విశ్వాసముంచి నిత్యం ధ్యానించారు. తద్వారా నిరాశ నిస్పృహల నుంచి బయటపడ్డారు. ఇద్దరు పిల్లలు, భర్త చనిపోయిన తర్వాత తన ఇంటిని పాఠశాలగా మార్చారు. ఏటా కచ్చితంగా ఒకసారైనా ఈ పాఠశాలను సందర్శించి అక్కడ చదువుకుంటున్న పిల్లలతో సరదాగా గడుపుతుంది.

వివిధ హోదాల్లో..

ముర్ము ఉపాధ్యాయురాలిగా తన వృత్తిని ప్రారంభించారు. ఆ తర్వాత బీజేపీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. 1997లో రాయరంగపూర్ నగర్ పంచాయతీ కౌన్సిలర్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. బీజేపీ షెడ్యూల్డ్ తెగల మోర్చా ఉపాధ్యక్షురాలిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఒడిశాలో, ఆమె 2000 నుండి 2002 వరకు స్వతంత్ర హోదాలో వాణిజ్య, రవాణా మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా 2002 నుండి 2004 వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఇక 2015 నుండి 2021 వరకు జార్ఖండ్ గవర్నర్‌గా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలిగా అత్యున్నత పీఠం అధిరోహించారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..