Lifestyle: పురుషులతో పోల్చితే మహిళల్లోనే తలనొప్పి అధికం.. కారణమేంటో తెలుసా.?
మహిళల్లో తలనొప్పి ఎక్కువగా రుతుక్రమ సమయంలో వస్తుంది. ఈ సమయంలో శరీరంలో జరిగే హార్మోన్ల మార్పు కారణంగా తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే గర్భవతిగా ఉన్నప్పుడు, మెనోపాస్ దశలోనూ శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉంటుందని...
తలనొప్పి సర్వసాధారణమైన ఆరోగ్య సమస్య. మనలో ప్రతీ ఒక్కరం ఏదో ఒక సమయంలో ఈ సమస్య ఎదుర్కొనే ఉంటాం. అయితే దీర్ఘకాలంగా తలనొప్పి వేధించడం మాత్రం లైట్ తీసుకునే అంశం కాదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో తలనొప్పులు ప్రమాదకరమైన జబ్బులకు సంకేతం కావొచ్చని చెబుతున్నారు. ఇక తలనొప్పి మహిళలు, పురుషుల్లోనూ కనిపించే సమస్య అయినప్పటికీ.. మహిళల్లో మరీ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ తలనొప్పి సమస్య మహిళల్లోనే ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మహిళల్లో తలనొప్పి ఎక్కువగా రుతుక్రమ సమయంలో వస్తుంది. ఈ సమయంలో శరీరంలో జరిగే హార్మోన్ల మార్పు కారణంగా తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే గర్భవతిగా ఉన్నప్పుడు, మెనోపాస్ దశలోనూ శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉంటుందని, ఈ కారణంగానే తలనొప్పి వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు చెబుతుంటారు. శరీంలో ఈస్ట్రోజన్ తగ్గిన సమయంలో తలనొప్పి వచ్చే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే చిన్నతనంలో మహిళలతో పోల్చితే పురుషుల్లో ఎక్కువగా తలనొప్పి సమస్య వేధిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే వయసు పెరిగే కొద్దీ పురుషుల్లో మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుందని తెలిపారు. ఎందుకంటే పురుషుల శరీరంలో హార్మోన్లు యుక్త వయసుకు వచ్చిన అనంతరం స్థిరంగా ఉంటాయి. పెద్దగా హెచ్చుతగ్గులు ఉండవు. ఈ కారణంగానే వారిలో తలనొప్పి వచ్చే అవకాశం తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో మాత్రం హార్మోన్ల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండడం వల్ల తలనొప్పి సమస్య ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఇక ఒత్తిడి కూడా తలనొప్పికి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడితో పాటు ఆందోళన ద్వారా కూడా తలనొప్పి మరింత పెరిగే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్యలు కూడా తలనొప్పికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. తలనొప్పి సమస్యను సరైన నిద్ర, యోగా మెడిటేషన్ వంటి వాటితో చెక్ పెట్టొచ్చని సూచిస్తున్నారు. అంతేకానీ ఇలా తలనొప్పి రాగానే అలా పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం మాత్రం ఏమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..