Dishti Bomma: నర దృష్టి, చెడు చూపును తరిమికొట్టే దిష్టిబొమ్మ ఎవరో తెలుసా..? సాక్షాత్తూ శివుడికే కోపం తెప్పించి..
Dishti Bomma History: ఇంటి ముందు వేలాడదీసే దిష్టిబొమ్మ వెనుక ఒక ఆసక్తికరమైన పౌరాణిక కథ ఉంది. శివుడి మూడో కన్ను నుంచి ఆవిర్భవించిన కీర్తిముఖుడు తన ఆజ్ఞకు లోబడి తన శరీరాన్నే తానే భక్షించడంతో, అతని భక్తికి మెచ్చిన పరమశివుడు ఇళ్లు, దేవాలయాల ద్వారాల వద్ద అతని రూపాన్ని ఏర్పాటు చేసుకుంటే చెడు చూపు, నరదృష్టి దరిచేరవని వరమిచ్చాడని పురాణాలు చెబుతున్నాయి.

చిన్న ఇల్లు అయినా.. పెద్ద ఇల్లు అయినా.. ఇంకా భారీ బహుళ అంతస్తుల భవనం అయినా సరే.. ఇంటి ముందు లేదా పైభాగంలో భయానకమైన రాక్షసుడి ముఖంతో కూడిన ‘దిష్టిబొమ్మ’ను వేలాడదీయడం మనం తరచూ చూస్తుంటాం. నరదృష్టి, చెడు చూపు లేదా ప్రతికూల శక్తులు ఇంటిపై పడకుండా ఉండేందుకే ఇలాంటి దిష్టిబొమ్మను పెడతారని మనందరికీ తెలుసు. అయితే ఆ బొమ్మ ఎవరిది? దీన్ని ఇంటి ముందు ఏర్పాటు చేసుకోవాలని ఎవరు చెప్పారు? దాని వెనుక ఉన్న పౌరాణిక చరిత్ర ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం..
దిష్టిబొమ్మ వెనుక పౌరాణిక కథ ..
పురాణాల ప్రకారం.. బ్రహ్మదేవుడు ఇచ్చిన ఒక వరంతో జలంధరుడు అనే శక్తివంతమైన రాక్షసుడు మూడు లోకాలను తన ఆధీనంలోకి తీసుకొచ్చి దేవతలకు రాజు అయిన ఇంద్రుడుని సైతం భయపెట్టాడని పేర్కొంటారు పండితులు.. ఇలా తపస్సు చేసి పొందిన వరాల గర్వంతో జలంధరుడు దేవుళ్లను, మానవులను తీవ్రంగా వేధించేవాడు. దీంతో ప్రజలు, దేవుళ్ళు తీవ్ర ఆందోళన చెంది చివరకు నారదుడి వద్దకు సలహా కోసం వెళతారు. అయితే నారదుడు అప్పుడు జలంధరుడు దగ్గరికి వెళ్లి.. నువ్వు ఎన్ని గెలిచినా శివుడు దగ్గర పేడ పురుగుతో సమానం అని చెబుతాడు. ఎందుకంటే శివుడి వద్ద పార్వతి దేవి ఉంటుందని.. ఆమెను ఎవరు ఓడించలేరు అని అంటారు. దీంతో జలంధరుడికి మరింత అహంకారం పెరిగి పార్వతీ కూడా నాదే అని అంటాడు. ఈ క్రమంలోనే శివుని వద్ద ఉన్న పార్వతీదేవిని సైతం దక్కించుకోవాలని భావించాడు. ఈ సందేశాన్ని శివుడి వద్దకు చేరవేసేందుకు రాహువును రాయబారిగా పంపాడు. రాహువు చెప్పిన మాటలు విన్న పరమశివుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. శివుడు తన మూడో కన్ను తెరవగా, ఆ అగ్నిజ్వాలల నుంచి భయంకరమైన ఆకారంతో ఒక రాక్షసుడు జన్మించాడు. ఆ రాక్షసుడు వెంటనే రాహువును తినడానికి పూనుకోగా.. రాహువు భయపడి శివుడిని శరణువేడాడు. శివుడు శాంతించి రాహువుకు ప్రాణభిక్ష పెట్టాడు.
అయితే.. రాహువును విడిచిపెట్టిన ఆ నూతన రాక్షసుడికి తీవ్రమైన ఆకలి వేసింది. తాను ఎవరిని తినాలో చెప్పాలని శివుడిని అర్ధించాడు. శివుడు అతడి ఆకలి, తీవ్రతను చూసి “నీ శరీరాన్ని నువ్వే తిను” అని సెలవిచ్చాడు. ఆ మాట పాటించిన ఆ రాక్షసుడు తన కాళ్లు, చేతులు, పొట్ట.. ఇలా శరీరం మొత్తాన్ని తనే తినేశాడు. చివరికి కేవలం అతడి తల (ముఖం) మాత్రమే మిగిలింది. అతడి ఆజ్ఞాపాలనకు, అంకితభావానికి మెచ్చిన శివుడు అతడికి ‘కీర్తిముఖుడు’ అని నామకరణం చేశాడు.
అంతేకాకుండా, ఎవరైతే తమ ఇళ్లు, దేవాలయాల ద్వారాల వద్ద కీర్తిముఖుడి రూపాన్ని అమర్చుకుంటారో, వారిపై ఏలాంటి చెడు చూపు, నరదృష్టి పడదని శివుడు అభయమిచ్చాడు. ఆ పౌరాణిక విశ్వాసం ఆధారంగానే నేటికీ మన సమాజంలో నూతన గృహనిర్మాణ సమయాల్లోనూ, ఇళ్ల ముందు కీర్తిముఖుడి (దిష్టిబొమ్మ) బొమ్మను లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుంటారని.. వాస్తు శాస్త్ర నిపుణులు, పండితులు చెబుతున్నారు.
ఇలా అప్పటినుంచి ప్రతి ఇంటి ముందు కీర్తిముఖుడి తలను దిష్టిబొమ్మలాగా తగిలించుకుంటారని.. ఇది ఉన్న ఏ ఇంటికి నరదృష్టి లేదా ఇతర చెడు చూపు పడకుండా ఉంటుందని పేర్కొంటున్నారు. అందుకే.. ఇల్లును ప్రారంభించే వారు, పూర్తి చేసిన వారు ఈ దిష్టిబొమ్మను తప్పకుండా ఏర్పాటు చేసుకుంటారు.
(Disclaimer: ఈ కథనంలోని వివరాలు స్థానిక స్థలపురాణాలు, భక్తుల విశ్వాసాలు, అందుబాటులో ఉన్న సాంప్రదాయ సమాచార ఆధారంగా అందించబడ్డాయి. వీటిని శాస్త్రీయంగా లేదా అధికారికంగా నిర్ధారించిన అంశాలుగా పరిగణించరాదు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ ఈ సమాచారం అందించబడింది.)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
