రాత్రి పడుకునే ముందు ఈ యోగాసాలు చేయండి.. క్షణాల్లో హాయిగా గాఢ నిద్రలోకి జారుకోండి!
ఆధునిక జీవనశైలి, తీవ్రమైన పని ఒత్తిడి, మానసిక ఆందోళన మరియు స్క్రీన్ టైమ్ పెరిగిపోవడం వల్ల నేటితరం అనుభవిస్తున్న ప్రధాన సమస్య నిద్రలేమి . రాత్రింబవళ్లు పడకపై అటుఇటు దొర్లుతూ నిద్రకోసం తపించేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శరీరానికి సుఖ నిద్ర లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అయితే, రాత్రి పడుకునే ముందు కొన్ని తేలికపాటి యోగాసనాలు, స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల ఈ సమస్యకు సులువుగా చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి యోగా చాలా ప్రయోజనకరమైనది. ప్రతిరోజూ యోగా సాధన చేయడం వల్ల శరీరానికి, మనసుకు రెండింటికీ మేలు జరుగుతుంది. యోగాను ఉదయం పూట చేయడం ఉత్తమమని చాలామంది అనుకుంటారు. కానీ, ఇది నిజం కాదు. రోజంతా పని చేసి అలసిపోయిన తర్వాత, సాయంత్రం చేసే కొన్ని వ్యాయామాలు శరీరాన్ని, మనసును రిలాక్స్ చేయడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. రోజంతా పని చేసిన తర్వాత మీకు కూడా రాత్రిపూట అలసటగా అనిపిస్తే, రాత్రి పడుకునే ముందు కొన్ని యోగాసనాలు వేయాలి. ఇవి శరీరాన్ని రిలాక్స్ చేయడమే కాకుండా, మనసును కూడా ప్రశాంతపరుస్తాయి. రాత్రి పడుకునే ముందు ఏ వ్యాయామాలు చేయాలో ఇప్పుడు చూద్దాం..
రాత్రి పడుకునే ముందు చేయాల్సిన బెస్ట్ యోగాసనాలు, వ్యాయామాలు ఇవే!
భాలాసనం :
మోకాళ్లపై కూర్చుని ముందుకు వంగి, నొసటిని నేలకు ఆనించి చేతులను ముందుకు చాచే ఈ ఆసనం వెన్నుపాము, భుజాలు, తుంటి భాగాల్లోని ఒత్తిడిని తొలగిస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచి, శ్వాసక్రియను క్రమబద్ధీకరిస్తుంది.
విపరీత కరణి :
గోడకు ఆనుకుని వెల్లకిలా పడుకుని కాళ్లను పైకి నిటారుగా పెట్టే ఈ ముద్ర రోజంతా నిలబడటం లేదా కూర్చోవడం వల్ల కాళ్లలో వచ్చే అలసటను తగ్గిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరిచి నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది.
మార్జర్యాసనం :
నాలుగు కాళ్ల స్థితిలో ఉండి వెన్నుముకను పైకి, కిందకు నెమ్మదిగా కదిలించే ఈ వ్యాయామం వెన్నులోని నొప్పులను, జకడతను సడలిస్తుంది. రోజంతా కుర్చీలకే పరిమితమయ్యే ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగకరం.
సుప్త బద్ధకోణాసనం :
వెల్లకిలా పడుకుని పాదాల అరికాళ్లను ఒకదానికొకటి తాకించి మోకాళ్లను పక్కకు పరచడం ద్వారా తుంటి, తొడల కండరాలు సడలి, శరీరం రిలాక్స్ అవుతుంది.
శవాసనం :
పడకపై ప్రశాంతంగా వెల్లకిలా పడుకుని దీర్ఘశ్వాస తీసుకోవడం వల్ల మెదడు శబ్దాలు, ఆలోచనల నుంచి విశ్రాంతి పొందుతుంది. ఇది గాఢ నిద్రకు చక్కటి బాట వేస్తుంది.
ముఖ్యమైన సూచనలు:
పడుకునే ముందు హెవీ కార్డియో వ్యాయామాలు, కఠినమైన వర్కౌట్లు చేయకూడదు. కేవలం శ్వాసపై దృష్టి పెడుతూ చేసే మైల్డ్ స్ట్రెచింగ్స్ మాత్రమే చేయాలి. రాత్రి పడుకోవడానికి 10-15 నిమిషాల ముందు ఈ వ్యాయామాలను అలవాటు చేసుకుంటే మానసిక ప్రశాంతతతో పాటు నాణ్యమైన నిద్ర మీ సొంతమవుతుంది.




