టెర్మినేటర్ సీన్ రిపీట్.. కరిగిన లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు! కారణం ఏంటంటే..
హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ టెర్మినేటర్ 2 లో క్లైమాక్స్ సన్నివేశంలో రోబో కరిగిపోతున్న వేడి లోహంలోకి మునుగుతూ ఆఖరిసారిగా తన బొటనవేలిని పైకి చూపిస్తూ థంబ్‌స్ అప్ సైన్ ఇస్తుంది. సరిగ్గా అలాంటి సన్నివేశమే నిజ ప్రపంచంలోనూ ఆవిష్కృతమైంది. ప్రపంచ ప్రసిద్ధ రోబోటిక్స్ స్టార్టప్ కంపెనీ ఫిగర్ ఏఐ తమ పాత వర్షన్ F.02 హ్యూమనాయిడ్ రోబోల ఫ్లీట్‌ను రిటైర్ చేస్తూ చేసిన పని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ ష్వాజ్నెగర్ నటించిన టెర్మినేటర్ 2 సినిమాలో రోబో కరిగిన లోహంలో మునిగిపోయే సెంటిమెంటల్ సీన్ గుర్తుందా? సరిగ్గా అలాంటి ఘటనే నిజ జీవితంలో జరిగింది. ప్రముఖ రోబోటిక్స్ సంస్థ ఫిగర్ ఏఐ తమ పాత మోడల్ F.02 హ్యూమనాయిడ్ రోబోలను రిటైర్ చేయడానికి ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. ఈ రోబోలు ఏకంగా కరిగిన లోహం ఉన్న భారీ ఫర్నేస్‌లోకి దానంతట అవే దూకి కరిగిపోయాయి. టెర్మినేటర్ నటుడు ఆర్నాల్డ్ ఇచ్చిన సలహా మేరకే కంపెనీ సిఈఓ ఈ నిర్ణయం తీసుకున్నారు. అసలేం జరిగింది..?
ఆర్నాల్డ్ సలహా.. టెర్మినేటర్ శైలి విడ్కోలు:
బిఎమ్‌డబ్ల్యూ వంటి దిగ్గజ ఫ్యాక్టరీలలో సుదీర్ఘకాలం విజయవంతంగా పనిచేసిన F.02 రోబోల సేవా కాలాన్ని ముగించాలని కంపెనీ భావించింది. ఈ క్రమంలో పాత రోబోలకు ఎలాంటి వీడ్కోలు ఇస్తే బాగుంటుందని కంపెనీ సీఈఓ బ్రెట్ అడ్కాక్ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను అడిగారు. దానికి టెర్మినేటర్ స్టార్ ఆర్నాల్డ్ ష్వాజ్నెగర్ స్పందిస్తూ.. వాటిని కరిగించేయండి అని సరదాగా సలహా ఇచ్చారు. దాంతో కంపెనీ ఆర్నాల్డ్ మాటను సీరియస్‌గా తీసుకుని నిజంగానే రోబోలను ఫిన్‌లాండ్‌లోని ఒక స్టీల్ ప్లాంట్‌కు తరలించి, సుమారు 75 టన్నుల కరిగిన లోహం ఉన్న ఫర్నేస్‌లోకి స్వయంప్రతిపత్తితో దూకేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చి కరిగించివేసింది.
అసలు కారణం టెక్నాలజీ చోరీ భయమేనా?
రోబోలను ఇలా విచిత్రంగా కరిగించివేయడం వెనుక ఒక ప్రధానమైన సాంకేతిక కారణం ఉందట. F.02 రోబోలను పక్కన పడేస్తే లేదా స్క్రాప్‌గా అమ్మేస్తే.. వాటిలోని కీలకమైన మోటార్లు, సెన్సార్లు, రోబోటిక్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి అత్యంత రక్షిత సాంకేతికత ఇతరులకు చిక్కే ప్రమాదం ఉందట. అలాగే ఒకే ఒక్క రోబోను పార్టు పార్టుగా ఊడదీయడానికి ఇంజనీర్ల సమయం చాలా వృథా అవుతుంది. అందుకే తమ నూతన వర్షన్ F.03, F.04 లపై దృష్టి పెట్టడానికి, పాత సాంకేతికత బయటకు పొక్కకుండా ఉండేందుకు కంపెనీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
కరిగిపోయిన ఆ రోబోల స్టీల్ లోహాన్ని అమెరికాకు తరలించి, ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్ జ్ఞాపకార్థ జ్ఞాపికలుగా మార్చి విక్రయించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. రియల్ లైఫ్‌లో సరిగ్గా సినిమా శైలిలో జరిగిన ఈ ఘటన నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.




