AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Diet: లేట్ నైట్ భోజనంతో ఇన్ని రకాల వ్యాధులా?.. ఇలా తింటే మీరు ఇంచు కూడా బరువు పెరగరు

త్వరగా భోజనం ముగించేయడం వల్ల మన శరీరం సహజ ప్రక్రియకు అనుగుణంగా సాగుతుందని దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు నొక్కి చెప్తున్నాయి. సెల్ మెటబాలిజంలో ప్రచురించబడిన 2022 అధ్యయనంలో ఆలస్యంగా తినేవారిలో కేలరీలు నెమ్మదిగా బర్న్ అవుతాయని, కొవ్వు జీవక్రియకు అంతరాయం కలుగుతుందని తేలింది. ఇది కొవ్వు నిల్వను ప్రోత్సహిస్తుంది. లేట్ నైట్ భోజనం కూడా ఆకలి హార్మోన్లలో మార్పుతో ముడిపడి ఉంటుంది. దీని వలన మీరు త్వరగా బరువు పెరగిపోవడం, దీర్ఘకాలిక జబ్బుల బారిన పడే ప్రమాదాలున్నాయని పరిశోధకులు చెప్తున్నారు.

Healthy Diet: లేట్ నైట్ భోజనంతో ఇన్ని రకాల వ్యాధులా?.. ఇలా తింటే మీరు ఇంచు కూడా బరువు పెరగరు
Late Night Meal Side Effects
Bhavani
|

Updated on: Feb 26, 2025 | 3:57 PM

Share

ఆరోగ్యంగా ఉండేందుకు కొందరు రకరకాల వ్యాయామాలతో పాటు డైట్స్ పాటిస్తుంటారు. అందులో భాగంగా ఆలస్యంగా భోజనం చేయడం లేదా రాత్రిపూట అల్పాహారం మాత్రమే తీసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి అలవాట్లు మీ శరీర సహజ ప్రక్రియలను దెబ్బతీస్తాయి. దీనివల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. అంతేకాదు బరువు పెరగడంతో పాటు గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మీ జీవన శైలి అలవాట్లే మీ ఆరోగ్య పరిస్థితిని, భవిష్యత్తులో మీకొచ్చే జబ్బులను నిర్ణయిస్తుంది. అందులో సరైన సమయానికి భోజనం చేయడం కూడా ఒకటి. అసలు రోజులో ఏ సమయంలో తినాలి? ఎంత మేరకు తినాలి వంటి విషయాలు చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇప్పటినుంచే మీ ఆహారపు సమయాల మీద శ్రద్ధ పెట్టాలంటున్నారు వైద్య నిపుణులు..

రాత్రి భోజనానికి ఏది మంచి సమయం..

2024లో జరిపిన పరిశోధనల ప్రకారం.. రాత్రి భోజనం త్వరగా ముగించేవారిలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని వెల్లడైంది. రక్తంలో చక్కెర నియంత్రణ, జీవక్రియ పనితీరు కూడా మెరుగ్గా ఉందని తేల్చారు. లేటుగా, అస్తవ్యస్తమైన సమయాల్లో భోజనం చేసే వారి కంటే వీరు బరువును బాగా నియంత్రించుకోవచ్చని తేలింది. సాయంత్రం 6 లేదా 7 గంటలలోపు డిన్నర్ ముగించేవారు ఇతరుల కంటే యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంటున్నారని ఈ పరిశోధనలో వెల్లడైంది.

లేటుగా తిని పడుకుంటున్నారా..?

రాత్రి 7 గంటలలోపు రాత్రి భోజనం ముగించడం ఆరోగ్యకరమైనదిగా నిపుణుల సూచిస్తున్నారు. అయితే, ఇది కుటుంబం, మనం చేసే పనివేళలు వంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఆడవారు అందరి కంటే చివరగా రాత్రి భోజనం ముగిస్తుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల శారీరకంగానే కాదు జీవక్రియల పరంగా కూడా ఎన్నో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రాత్రి త్వరగా భోజనం చేయడం కుదరని వారు వారు తీసుకునే ఫుడ్ లో కేలరీలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే రాత్రి మనం రెస్ట్ తీసుకునే సమయం. ఉదయం పూట శ్రమించే పనుల వల్ల ఎక్కువ కేలరీలు శరీరానికి అవసరం అవుతాయి. కానీ, రాత్రి కొద్దిపాటి కేలరీలు కలిగిన భోజనం తీసుకోవడం బెటర్ అంటున్నారు. తృణధాన్యాలు, పిండి పదార్థాలు కలిగిన కూరగాయలు, నాన్-స్టార్చ్ కూరగాయలు, లీన్ ప్రోటీన్లు కలిగినవి భోజనంలో భాగం చేసుకోవాలి.

భోజనానికి ముందు ఈ అలవాట్లు వద్దు..

చాలా మంది భోజన సమయానికి ముందు అతిథులు రావడం వల్లనే మరే ఇతర కారణాల వల్లనే స్నాక్స్ తీసుకుంటుంటారు. ఇది ఎక్కువ కాలం కొనసాగితే మీ ఆహారపు అలవాట్లపై తీవ్ర నష్టం కలిగిస్తుంది. మీరు భోజన సమయానికి ముందు చిరుతిండ్లు మానుకోవాలి. లేదంటే అవి మీరు తినే సమయంలో ఆకలిని తగ్గించేస్తాయి. శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలను అందకుండా చేస్తాయి. భోజనానికి బదులుగా టిఫిన్లతో కడుపు నింపుకోవడం కూడా సరికాదు. అన్ని రకాలు పోషకాలైన కూరగాయలు, పప్పులతో కూడిన భోజనం చేయడం ఎంతో అవసరం.

పడుకునే ముందు వీటి జోలికి వెళ్లొద్దు..

పడుకునే ముందు తీసుకునే ఆహారం మీ మొత్తం ఆరోగ్యాన్ని, నిద్రను ప్రభావితం చేస్తుంది. కెఫిన్ కలిగిన ఆహారాలను, చాక్లెట్లు, టీ, సోడా కలిసినవి తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని ఎన్నో రకాలుగా డ్యామేజ్ చేస్తాయి. వీటితో పాటు వేయించిన ఆహారాలు, మసాలాలు, ఫాస్ట్ ఫుడ్స్ వంటివి కూడా మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని గుర్తుంచుకోండి.