Swiggy 2025: మనోళ్ల బిర్యానీ పిచ్చి.. నిమిషానికి ఎన్ని ఆర్డర్లు వస్తున్నాయో తెలిస్తే షాక్ అవుతారు!
దేశంలో ఎన్ని రకాల వంటకాలు ఉన్నా, భారతీయుల మొదటి ఓటు మాత్రం బిర్యానీకే. నిమిషానికి వందల సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయంటే ఈ వంటకానికి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ 'స్విగ్గీ' విడుదల చేసిన 2025 వార్షిక నివేదికలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

నిమిషానికి 194 ఆర్డర్లు ఆన్‌లైన్ ఆర్డర్లలో వినియోగదారులు తమ ఫేవరెట్ వంటకంగా బిర్యానీని ఎంచుకున్నారు. ప్రతి నిమిషానికి సగటున 194 ఆర్డర్లు వస్తున్నట్లు అంచనా. ఇందులో చికెన్ బిర్యానీ 5.77 కోట్ల ఆర్డర్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో బర్గర్లు (4.42 కోట్లు), పిజ్జాలు (4.01 కోట్లు), దోశలు (2.62 కోట్లు) ఉన్నాయి. మధ్యాహ్నం భోజనం కంటే రాత్రి సమయంలోనే ప్రజలు ఎక్కువగా ఆర్డర్లు చేసుకుంటున్నట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.
ప్రాంతీయ వంటకాలకు ప్రాధాన్యం స్థానిక వంటకాలను ఇష్టపడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పర్వత ప్రాంత వంటకాలకు 9 రెట్లు ఆదరణ పెరగడంతో పాటు మలబారీ, రాజస్థానీ, మాల్వానీ వంటకాల ఆర్డర్లు రెట్టింపు అయ్యాయి. విదేశీ రుచులైన మెక్సికన్ (1.6 కోట్లు), టిబెటన్ (1.2 కోట్లు), కొరియన్ (47 లక్షలు) వంటకాలకు కూడా మంచి డిమాండ్ కనిపిస్తోంది.
ఆసక్తికరమైన ఆర్డర్లు హైదరాబాద్‌కు చెందిన ఒక కస్టమర్ 47 వేల రూపాయల విలువైన 65 బాక్సుల డ్రైఫ్రూట్ బిస్కట్లను ఆర్డర్ చేసి వార్తల్లో నిలిచారు. ముంబయికి చెందిన మరో వినియోగదారుడు ఈ ఏడాది ఏకంగా 3 వేల సార్లు ఆర్డర్ చేశారు. అంటే రోజుకు సగటున 9 సార్లు ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. దేశంలోనే ఇదే అత్యధికమని స్విగ్గీ పేర్కొంది.
చిరుతిళ్లపై మక్కువ.. ఐస్‌క్రీమ్‌ల జోరు!
కేవలం ప్రధాన భోజనం మాత్రమే కాదు, భారతీయులు చిరుతిళ్లు (స్నాక్స్) ఆర్డర్ చేయడంలోనూ వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా రాత్రి 10 గంటల తర్వాత ఐస్‌క్రీమ్‌లు, కేకులు, గులాబ్ జామూన్ వంటి స్వీట్ల కోసం ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయట. గతేడాదితో పోలిస్తే ఈసారి డెజర్ట్ విభాగంలో 25 శాతం వృద్ధి నమోదైనట్లు స్విగ్గీ వెల్లడించింది. అలాగే పని ఒత్తిడిలో ఉన్నవారు ఇన్స్టంట్ కాఫీ, టీలను ఆర్డర్ చేయడం కూడా పెరిగింది. ఆరోగ్య స్పృహ ఉన్నవారు ‘హెల్తీ ఫుడ్’ విభాగంలో సలాడ్లు, జ్యూస్‌లను ఎక్కువగా ఎంచుకుంటున్నట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.
పండుగ వేళల్లో ఆర్డర్ల వెల్లువ
క్రికెట్ మ్యాచ్‌లు ఉన్న రోజుల్లోనూ, దీపావళి, కొత్త సంవత్సరం వంటి పండుగ వేళల్లో స్విగ్గీ యాప్ రికార్డు స్థాయి ఆర్డర్లను అందుకుంటోంది. మ్యాచ్ సమయంలో ప్రతి సెకనుకు వందల సంఖ్యలో చిరుతిళ్లు, కూల్ డ్రింక్స్ డెలివరీ అవుతున్నట్లు సంస్థ పేర్కొంది. క్విక్ కామర్స్ విభాగమైన ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్’ ద్వారా కేవలం నిమిషాల వ్యవధిలోనే నిత్యావసరాలు, పండ్లు, కూరగాయలను ఆర్డర్ చేసే ధోరణి మెట్రో నగరాల్లో భారీగా పెరిగింది. దేశవ్యాప్తంగా డెలివరీ బాయ్స్ లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వినియోగదారుల ఆకలి తీరుస్తూ ఈ ఫుడ్ విప్లవంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
