Meal Maker Gravy Curry: నాన్ వెజ్ మర్చిపోవాల్సిందే.. మీల్ మేకర్ గ్రేవీ కర్రీని ఇలా చేస్తే రుచి అద్భుతం!
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా ఎప్పుడూ తినే కూరలే తిని బోర్ కొట్టినప్పుడు అందరికీ గుర్తొచ్చేది మీల్ మేకర్. అయితే సాధారణంగా చేసే పద్ధతిలో కాకుండా, ఈసారి చిక్కటి గ్రేవీతో హోటల్ స్టైల్‌లో ట్రై చేయండి. నాన్-వెజ్ వంటకాలను మించిన రుచితో మీ భోజనం అద్భుతంగా మారుతుంది. ఆ తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీల్ మేకర్ కర్రీ అనగానే ఏదో సాదాసీదా వంటకం అనుకోకండి. పెరుగు, నిమ్మరసం, ప్రత్యేకమైన మసాలాల కలయికతో తయారుచేసే ఈ గ్రేవీ కర్రీ అన్నం, చపాతీ, రోటీ ఇలా దేనిలోకైనా అదిరిపోయే కాంబినేషన్. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. మధ్యాహ్న భోజనం లేదా రాత్రి డిన్నర్‌లో ఏదైనా కొత్తగా తినాలనిపిస్తే మీల్ మేకర్ గ్రేవీ కర్రీ ఉత్తమ ఎంపిక. అధిక ప్రోటీన్లు ఉండే సోయా చంక్స్‌తో గ్రేవీ కూరను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అచ్చం హోటల్ స్టైల్‌లో ఉండే ఈ వంటకం తయారీ విధానం మీకోసం..
కావలసిన పదార్థాలు:
మీల్ మేకర్ – 1 కప్పు
నూనె – 7 టేబుల్ స్పూన్లు
అల్లంవెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
కారం – ఒకటిన్నర టేబుల్ స్పూన్
పుదీనా – కొద్దిగా
పెరుగు – 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం – 1 టీ స్పూన్
మసాలా దినుసులు – 1 టేబుల్ స్పూన్
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయలు – 2
పసుపు – అర టీ స్పూన్
పచ్చిమిర్చి – 4
టమోటాలు – 2
ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర – కొంచెం
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి కప్పు మీల్ మేకర్‌ను మూడు నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత నీటిని తీసివేసి వాటిని వేరుగా ఉంచాలి. ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసి ఉడికించిన మీల్ మేకర్‌ను మూడు నిమిషాల పాటు ఎర్రగా వేయించాలి.
వేయించిన మీల్ మేకర్‌ను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పుదీనా, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
మరోవైపు పాన్‌లో కొద్దిగా నూనె వేసి ధనియాలు, మసాలా దినుసులు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అదే పాన్‌లో మరికొంత నూనె పోసి పసుపు, పచ్చిమిర్చి, గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. మసాలా నుంచి నూనె వేరవుతున్న సమయంలో టమోటా ముక్కలు, పక్కన పెట్టిన మీల్ మేకర్ మిశ్రమాన్ని వేసి కలపాలి.
తర్వాత కప్పు నీళ్లు పోసి మూత పెట్టి ఆరు నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. చివరగా ధనియాల పొడి, కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. వేడివేడి అన్నం లేదా చపాతీలో తింటే ఈ కూర రుచి అమోఘంగా ఉంటుంది.
