AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharma Kesuma : అవుట్ అవ్వడం ఇతని డిక్షనరీలోనే లేదు.. సెంచరీ కొట్టాడా? నాటౌట్ గా వచ్చాడా? అంతే!

Dharma Kesuma : ఇండోనేషియా క్రికెట్ అనగానే మనకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు.. కానీ ఆ దేశంలో ఒక బాహుబలి లాంటి బ్యాటర్ ఉన్నాడు. అతడే ధర్మా కేసుమా. ఇండోనేషియా క్రికెట్ చరిత్రలో సెంచరీలు అంటే కేవలం ఇతని పేరు మాత్రమే వినిపిస్తుంది.

Dharma Kesuma : అవుట్ అవ్వడం ఇతని డిక్షనరీలోనే లేదు.. సెంచరీ కొట్టాడా? నాటౌట్ గా వచ్చాడా? అంతే!
Dharma Kesuma
Rakesh
|

Updated on: Dec 24, 2025 | 8:24 AM

Share

Dharma Kesuma : ఇండోనేషియా క్రికెట్ అనగానే మనకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు.. కానీ ఆ దేశంలో ఒక బాహుబలి లాంటి బ్యాటర్ ఉన్నాడు. అతడే ధర్మా కేసుమా. ఇండోనేషియా క్రికెట్ చరిత్రలో సెంచరీలు అంటే కేవలం ఇతని పేరు మాత్రమే వినిపిస్తుంది. తాజాగా కంబోడియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మరోసారి సెంచరీతో విరుచుకుపడి తన దేశానికి ఒంటరి చేత్తో విజయాన్ని అందించాడు. డిసెంబర్ 23న బాలి వేదికగా ఇండోనేషియా, కంబోడియా మధ్య టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన 26 ఏళ్ల ధర్మా కేసుమా ఆరంభం నుంచే కంబోడియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 63 బంతుల్లోనే ఫోర్‌తో తన సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తం 68 బంతులు ఆడిన ధర్మా, 110 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు ఉన్నాయి. ధర్మా మెరుపులతో ఇండోనేషియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

ఇండోనేషియా క్రికెట్ టీమ్ లిస్టులో సెంచరీ చేసిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారా అంటే అది ధర్మా కేసుమా ఒక్కడే. ఇప్పటివరకు ఆ దేశం తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో నమోదైన మూడు సెంచరీలు కూడా ఇతని బ్యాట్ నుంచి వచ్చినవే కావడం విశేషం. కేవలం రెండేళ్ల కెరీర్‌లోనే మూడు సెంచరీలు బాదిన ధర్మా, ఆ జట్టుకు వెన్నెముకలా మారాడు. నవంబర్ 2024లో మయన్మార్‌పై మొదటి సెంచరీ (117*) చేసిన ధర్మా, ఆ తర్వాత ఫిలిప్పీన్స్‌పై రెండో సెంచరీ (115*) బాదాడు. ఇప్పుడు కంబోడియాపై మూడో సెంచరీతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

ధర్మా కేసుమా సెంచరీల విషయంలో ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ ఉంది. అంతర్జాతీయ టీ20ల్లో అతను సెంచరీ చేసిన మూడు సార్లూ అవుట్ కాకుండా నాటౌట్‌గానే పెవిలియన్ చేరాడు. అంటే సెంచరీ మార్కు దాటాక అతడిని అవుట్ చేయడం ప్రత్యర్థి బౌలర్లకు అసాధ్యంగా మారింది. కేవలం 13 నెలల వ్యవధిలోనే మూడు సెంచరీలు చేయడం అంటే అది చిన్న విషయం కాదు. తన సొంత గడ్డ బాలి అతనికి బాగా కలిసివస్తున్నట్లుంది, ఎందుకంటే ఈ మూడు సెంచరీలు కూడా బాలిలోనే నమోదయ్యాయి.

166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంబోడియా జట్టు, ధర్మా కేసుమా ఒక్కడే చేసిన 110 పరుగుల స్కోరును కూడా దాటలేకపోయింది. ఇండోనేషియా బౌలర్ల ధాటికి కంబోడియా 16 ఓవర్లలోనే 107 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఇండోనేషియా 60 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. కంబోడియా జట్టు మొత్తంగా చేసిన స్కోరు (107) కంటే ధర్మా ఒక్కడే చేసిన స్కోరు (110) ఎక్కువగా ఉండటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం ఇండోనేషియాలో ధర్మా కేసుమా పేరు మారుమోగిపోతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..