AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashes Controversy : చుక్కా ముక్కా ఉంటే చాలు.. కప్పు గెలవకపోయినా పర్లేదు.. ఇంగ్లాండ్ టీమ్ కొత్త పాలసీ!

Ashes Controversy : ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ 2025-26 సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు ఘోర పరాజయాల కంటే ఇప్పుడు ఆ జట్టు ఆటగాళ్ల ప్రవర్తన హాట్ టాపిక్‌గా మారింది. వరుసగా మూడు టెస్టుల్లో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయిన బాధలో ఉండాల్సిన ఆంగ్ల ఆటగాళ్లు, విందులు-వినోదాల్లో మునిగితేలారనే వార్తలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి.

Ashes Controversy : చుక్కా ముక్కా ఉంటే చాలు.. కప్పు గెలవకపోయినా పర్లేదు.. ఇంగ్లాండ్ టీమ్ కొత్త పాలసీ!
Ben Duckett Drunk Video
Rakesh
|

Updated on: Dec 24, 2025 | 9:35 AM

Share

Ashes Controversy : ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ 2025-26 సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు ఘోర పరాజయాల కంటే ఇప్పుడు ఆ జట్టు ఆటగాళ్ల ప్రవర్తన హాట్ టాపిక్‌గా మారింది. వరుసగా మూడు టెస్టుల్లో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయిన బాధలో ఉండాల్సిన ఆంగ్ల ఆటగాళ్లు, విందులు-వినోదాల్లో మునిగితేలారనే వార్తలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. సిరీస్ మధ్యలో దొరికిన విరామ సమయంలో ఆటగాళ్లు ఏకంగా 6 రోజుల పాటు మడతపెట్టి మందు కొట్టారనే ఆరోపణలు రావడంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది.

ఈ యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో వరుసగా ఓడిపోయి ఇప్పటికే 3-0తో సిరీస్‌ను ఆసీస్‌కు సమర్పించుకుంది. అయితే బ్రిస్బేన్ టెస్టులో ఓటమి తర్వాత అడిలైడ్ టెస్టుకు ముందు దొరికిన 9 రోజుల విరామంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు క్వీన్స్‌లాండ్‌లోని నూసా అనే పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. అక్కడ రిలాక్స్ అవ్వాల్సింది పోయి, వరుసగా 6 రోజుల పాటు విపరీతంగా మద్యం సేవించారని బ్రిటిష్ మీడియా కోడై కూస్తోంది. ఇది కేవలం విరామంలా కాకుండా బ్యాచిలర్ పార్టీ లాగా సాగిందని విమర్శలు వస్తున్నాయి.

కేవలం ఆరోపణలే కాకుండా, ఓపెనర్ బెన్ డకెట్ ఫుల్లుగా తాగి తూలుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఆ వీడియోలో డకెట్ తన హోటల్‌కు ఎలా వెళ్లాలో కూడా తెలియనంత మత్తులో ఉన్నట్లు కనిపిస్తోంది. మరో యువ ప్లేయర్ జాకబ్ బెథెల్ కూడా క్లబ్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. సిరీస్ చేజారిన క్లిష్ట సమయంలో ఆటగాళ్లు ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడంపై ఇంగ్లీష్ అభిమానులు మండిపడుతున్నారు.

ఈ వ్యవహారంపై ఇంగ్లాండ్ క్రికెట్ డైరెక్టర్ రాబ్ కీ స్పందించారు. “అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఆటగాళ్లు ఇలా అతిగా మద్యం సేవించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. భోజనం చేసేటప్పుడు ఒక గ్లాసు వైన్ తీసుకోవడంలో తప్పులేదు కానీ, ఇది మరీ మితిమీరినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై మేము పూర్తిస్థాయిలో అంతర్గత విచారణ జరుపుతాము” అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే వైట్ బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్, బెథెల్ గతంలో న్యూజిలాండ్ టూర్ లో కూడా ఇలాగే దొరికిపోయి వార్నింగ్ తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఆస్ట్రేలియా ఇప్పటికే మొదటి మూడు టెస్టులను గెలుచుకుని యాషెస్ ట్రోఫీని తనవద్దే ఉంచుకుంది. కేవలం 11 రోజుల్లోనే ఈ సిరీస్ ఫలితం తేలిపోవడం ఇంగ్లాండ్ చరిత్రలోనే ఒక అవమానకరమైన రికార్డు. ఇప్పుడు ఆటగాళ్ల క్రమశిక్షణారాహిత్యం తోడవడంతో హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యూహాలపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మెల్‌బోర్న్ వేదికగా జరిగే బాక్సింగ్ డే టెస్టుకు ముందే ఈ వివాదం జట్టును ఆత్మరక్షణలో పడేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..