Tight Fitting Cloths: ఫ్యాషన్ కోసం స్కిన్ టైట్ దుస్తులు ధరిస్తున్నారా..? వాటితో కలిగే సమస్యలేమిటో తెలిస్తే షాక్ కావాల్సిందే..
అందం కోసం వేసుకునే టైట్ దుస్తులు చర్మంపై ఒత్తిడి తెస్తాయి, అవి రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి. అంతేకాక నరాల దెబ్బతినడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సంతానోత్పత్తిని..
ఫ్యాషన్ అనేది ఒకరి వ్యక్తిగత అభిరుచులతో పాటు, మార్కెట్‌లో అప్పటికప్పుడు మారే ట్రెండ్‌లతో ముడిపడి ఉంటుంది. ఒకప్పటి జీవనశైలిలో అబ్బాయిలు బెల్ బాటమ్ ప్యాంట్లు, బూట్ కట్ జీన్స్ వేసుకునే వారు. ఆ తర్వాతి కాలంలో టైట్ జీన్స్, షార్ట్స్ వేసుకుంటున్నారు. అలాగే ఒకప్పటి కాలంలో అమ్మాయిలు అయితే నిండుగా లంగా ఓణీలు, గాగ్రాలు వేసుకునే వారు. రానురాను వాటి సైజ్ తగ్గిస్తూ మినీ స్కర్టులు, షార్టులు, టైట్ జీన్స్, లెగ్గింగ్స్ వేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే ప్రస్తుతం ఆడ, మగ అందరూ ఒకేరకమైన ఫ్యాషన్ ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా చర్మానికి అతుక్కుపోయేలా టైట్ దుస్తులు వేసుకుంటున్నారు. స్విమ్మింగ్ లేదా సైక్లింగ్ వంటి కార్యకలాపాల సమయంలో కూడా బిగుతుగా ఉండే దుస్తులను ఎంచుకుంటున్నారు. ఇలా బిగుతైన వస్త్రాలు లేదా టైట్ ఫిట్టింగ్ డ్రెస్‌లను ధరించడం వలన మీ శరీరాకృతి స్పష్టంగా ప్రదర్శించుకున్నా, కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
అందం కోసం వేసుకునే టైట్ దుస్తులు చర్మంపై ఒత్తిడి తెస్తాయి, అవి రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి. అంతేకాక నరాల దెబ్బతినడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సంతానోత్పత్తిని ప్రభావితం చేసే కారకాల్లో బిగుతైన దుస్తులు ధరించడం కూడా ఒక కారకం. DNA స్కిన్ క్లినిక్ చీఫ్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బిగుతైన దుస్తులు(Skin Tight Clothing) ధరించడం వలన అనేక రకాల ఆరోగ్య సమస్యలు, దీర్ఘ కాల ప్రభావాలు ఉంటాయన్నారు. మరి స్కిన్ టైట్ డ్రెస్‌ల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
చికాకు, ఒళ్లు నొప్పులు: బిగుతుగా ఉన్న దుస్తులు చర్మంపై రుద్దుతూ ఉండడం వల్ల దురద, చికాకు ఏర్పడుతుంది, ముఖ్యంగా చర్మం లోపలి తొడలు, అండర్ ఆర్మ్స్ వంటి వాటితో కలిపి రుద్దే ప్రదేశాలలో ఈ సమస్య ఇబ్బందికరంగా ఉంటుంది.
ఫంగల్ ఇన్ఫెక్షన్లు: సింథటిక్ ఫైబర్‌లతో తయారు చేసిన బిగుతైన దుస్తులు గాలి చొరబాటుకు కూడా ఆస్కారం ఇవ్వవు. దీంతో ఆయా భాగాలలో ఫంగల్ పెరుగుదలకు అనువైన వెచ్చని, తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. ఇది దురద లేదా అథ్లెట్స్ ఫుట్ వంటి ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.
మొటిమలు, దద్దుర్లు: బిగుతుగా ఉండే దుస్తులు చర్మానికి అతుక్కొని ఉండటం వలన అవి చెమట, నూనెలను బంధిస్తాయి. ఇది చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. ఫలితంగా చర్మంపై దద్దుర్లు, మొటిమలు ఏర్పడటానికి కారణమవుతుంది.
రక్త ప్రసరణ: టైట్ బెల్ట్ ప్యాంటులు, స్కర్టులు ధరించడం వల్ల చర్మం సున్నితత్వం కోల్పోతుంది, ఇది ఆ భాగంలో రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. ఎరుపుదనంతో కూడా మార్క్స్ కూడా ఏర్పడతాయి. కార్సెట్‌లు, బ్లౌజ్‌లు వంటి ఇతర బిగుతైన దుస్తులు ధరించినప్పుడు రక్త ప్రసరణలో ఇబ్బందులు ఉంటాయి.
డాక్టర్ ప్రియాంక రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే.. స్టైల్, ఫ్యాషన్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా వదులైన, సౌకర్యవంతమైన దుస్తులను ధరించడం చాలా ముఖ్యం. సింథటిక్ దుస్తులకు బదులుగా కాటన్ వంటి సహజ ఫైబర్‌లతో తయారు చేసిన దుస్తులను ధరించడం మేలు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..