Mango Mutton Masala Curry: ఆంధ్రా స్టైల్లో.. మజా మజా మటన్ మామిడి మసాలా కర్రీ! ఇలా చేశారంటే ఆహా అనాల్సిందే..
మటన్.. చాలా మంది ఇష్టం తినే మాంసాహారాల్లో ఇది ఒకటి. అయితే రోజూలా కాకుండా కొంచెం వెరైటీగా మటన్ వండేస్తే ఇంట్లో అందరి ప్రశంసలు మీకే. ఈ కాలంలో దొరికే మామిడి కాయలతో మటన్ మామిడి మసాలా కర్రీ వండేద్దాం.. ఇందుకు కావల్సిన పదార్ధాలు, వండే విధానం ఈ కింద మీ కోసం సిద్ధం చేశాం..

చాలా మందికి మాంసాహారాల్లో మటన్ చాలా ఇష్టం. మటన్ ఫ్రై నుంచి బిర్యానీ వరకూ లొట్టలేసుకు తింటుంటారు. అయితే ఎప్పుడూ ఒకే స్టైల్లో కాకుండా మటన్ కర్రీని కాస్తా డిఫ్రెంట్‌గా చేశారంటే రుచితో పాటు.. మీ ఇంట్లో అందరి ప్రశంసలు మీకే దక్కుతాయి. వేసవిలో వచ్చే మామిడి కాయలతో మటన్ మామిడి మసాలా వంటకం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావలసిన పదార్ధాలు
- మెత్తగా ఉడికించిన మటన్ – అరకేజీ
- పచ్చి మామిడికాయ – ఒకటి (కొంచెం పెద్ద సైజ్)
- ఆయిల్ – పావు కప్పు
- పచ్చిమిర్చి – రెండు
- ఉల్లిపాయ తరుగు – కప్పు
- ఉప్పు – రుచికి సరిపడా
- అల్లంవెల్లుల్లి పేస్టు – రెండు టేబుల్ స్పూన్లు
- కారం – రెండు టేబుల్ స్పూన్లు
- గరం మసాలా – టీస్పూను
- పసుపు – అరటీస్పూను
- కొత్తిమీర తరుగు – పావు కప్పు
మటన్ మెత్తగా ఉండకాలంటే..
ముఖ్యంగా మటన్‌తో ఏ వెరైటీ చేయడానికైనా ముందుగా దానిని బాగా శుభ్రం చేసి మెత్తగా ఉడికించాలి. లేదంటే మీరు వంట ఎంత బాగా చేసినా ప్రయోజనం ఉండదు. మటన్‌ని కడిగిన తర్వాత నీళ్లన్నీ పోయేలా గట్టిగా పిండాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా గళ్లుప్పు వేసి బాగా కలిపి ఒక గంట తర్వాత ఉడికించాలి. మాంసం ఉప్పును బాగా పీల్చుకొని మృదువుగా మారడమే కాకుండా మెత్తగా ఉంటుంది. లేదంటే మటన్ ముక్కల్లో వెనిగర్ లేదా నిమ్మరసం కాస్త కలిపి వంట చేసినా మెత్తగా ఉడికి.. ముక్కలు మృదువుగా మారుతాయి. వీటిలో ఉండే ఆమ్లత్వమే ఇందుకు కారణం. అంతేకాదు.. ఇవి కూరకు మంచి రుచిని కూడా అందిస్తాయి.
తయారీ విధానం ఇలా..
ముందుగా మటన్ మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మామిడికాయ తొక్కతీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. స్టవ్ మీద కలాయి గిన్నెపెట్టి, ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి ఈ ఆయిల్‌లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేసి దోరగా వేయించాలి. ఇవన్నీ వేగాక అల్లం వెల్లుల్లి పేస్టువేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి∙ ఇప్పుడు మెత్తగా ఉడికించిన మటన్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. ఆ తరువాత కారం, గరం మసాలా, పసుపు వేసి.. గరిటెతో తిప్పి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత కూరకు సరిపడా నీళ్లు, మామిడికాయ ముక్కలను వేసి మూతపెట్టి సన్నని మంటపై మగ్గనివ్వాలి. మామిడికాయ ముక్కలు మెత్తబడిన తరువాత కొత్తిమీర చల్లి దించేస్తే సరి. ఘుమఘుమలాడే మటన్ మామిడి మసాలా కర్రీ రెడీ. దీనిని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది సామీ..!
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








