Papaya: బొప్పాయి.. కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే కాదు.. స్కిన్ కేర్ కోసం కూడా
బొప్పాయి సూపర్ ఫ్రూట్.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్స్, ఖనిజాలు దానిలో ఉంటాయి. అంతేకాదు... బొప్పాయి చర్మానికి మంచి మాయిశ్చరైజర్. సహజ చర్మ తేమను తిరిగి తేవడంలో ఇది సాయపడుతుంది. చర్మానికి బొప్పాయి పండు వల్ల కలిగే ప్రయోజనాల ఏంటో తెలుసుకుందాం పదండి...

బాగా పండిన బొప్పాయి మీ చర్మం, జుట్టు, రోగనిరోధక వ్యవస్థ మొత్తానికి మేలు చేస్తుంది. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడుతుంది. అలాగే కొన్ని సాధారణ సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. బొప్పాయి పండులో మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చే శక్తి ఉంది. అందుకే బొప్పాయి పండును ఫేస్ వాష్, ఫేస్ క్రీమ్, ఫేస్ ప్యాక్, బాడీ లోషన్ వంటి చర్మ సంబంధిత ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్‌ల బొప్పాయి గొప్ప మూలం. బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. బొప్పాయి మన శరీరంలోని అన్ని అవయవాలకు జీవితంలోని అన్ని దశలలో ప్రయోజనకరంగా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు పేర్కొన్నాయి. రుచికరమైన పండు, బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
2013లో చేసిన ఓ అధ్యయనం ప్రకారం, విటమిన్ ఎ, బి, సి అధికంగా ఉండే బొప్పాయి మనిషి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బొప్పాయి ప్రోటీయోలైటిక్ ఎంజైమ్‌లను, పపైన్, చైమోపాపైన్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.
1. మొటిమల నియంత్రణ:
బొప్పాయి పండ్లలో ఉండే పాపైన్, చైమోపాపైన్ అనే ప్రొటీయోలైటిక్ ఎంజైమ్‌లు కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. పపైన్ ఎంజైమ్‌లో ప్రొటీన్ కరిగిపోయే గుణాలు ఉన్నాయి, పపైన్ కలిగిన ఫ్రూట్స్ మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మ రంధ్రాలను మూసుకుపోయే డెడ్ స్కిన్ సెల్స్ ను బొప్పాయి క్లియర్ చేస్తుంది.
2. ముడుతలను నియంత్రిస్తుంది:
బొప్పాయిలో లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖం ముడుతలను తగ్గించడంలో సహాయపడతాయి. 2017 అధ్యయనం ప్రకారం, బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది మీ చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా ఉంచడంలో ఉపయోగపడతాయి.
3. చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది:
బొప్పాయిలో సహాయక ఎంజైములు, మొక్కల ఆధారిత యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం నుండి చనిపోయిన, దెబ్బతిన్న కణాలను, మలినాలను తొలగిస్తాయి. బొప్పాయి చర్మరంధ్రాలను శుభ్రపరచి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది చర్మం లోపలి పొరల్లోకి చొచ్చుకొనిపోయి మురికిని, అదనపు నూనెను పూర్తిగా తొలగించి, చక్కటి ఛాయను అందిస్తుంది.
4. చర్మ వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది:
బొప్పాయి.. చర్మంపై కాలిన గాయాలు ఇతర చర్మ వ్యాధులకు సహజ నివారణగా ఉపయోగించబడుతుంది. బొప్పాయి ఎంజైమ్‌లు చనిపోయిన చర్మ కణాలను ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. చర్మంలోని కాలుష్య కారకాలను తొలగిస్తాయి.
5. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది:
బొప్పాయి చర్మానికి మంచి మాయిశ్చరైజర్ కూడా. పొరలుగా ఉండే చర్మానికి చికిత్స చేయడంలో సహజ చర్మ తేమను తిరిగి తేవడంలో సహాయపడుతుంది. బొప్పాయి గుజ్జును మీ చర్మంపై క్రమం తప్పకుండా పూయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. దాని సహజ కాంతిని తిరిగి తీసుకురావడానికి సహాయపడుతుంది.
6. ముఖ వెంట్రుకలను తొలగిస్తుంది:
సాధారణ వ్యాక్సింగ్ లేదా థ్రెడింగ్‌కు బదులుగా బొప్పాయి పండు ఫేస్ ప్యాక్ చేయవచ్చు. బొప్పాయిలో ఎంజైములు ఉంటాయి. ఇది మీ ముఖ వెంట్రుకలను తొలగించడానికి బ్లీచ్ లాగా పనిచేస్తుంది.
7. డార్క్ స్పాట్స్ తొలగిస్తుంది:
బొప్పాయి మీ చర్మపు మచ్చలను తేలికపరచడానికి, టాన్ వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇందులోని పాపైన్ ఎంజైమ్ మొటిమల మచ్చలు లేదా నల్లబడిన మోచేతులు, మోకాళ్ల వంటి ముదురు చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




