Kerala Wayanad landslides: కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? వాటిని ముందే పసిగట్టలేమా? హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయలేమా?
కొండచరియలు విరిగిపడితే.. ఆ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలు ధ్వంసమవుతాయి. అక్కడుండేవారు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. మనిషి చందమామపై అడుగుపెట్టగలిగేంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి దారుణాలను ముందే ఊహించలేమా? దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోలేమా?

కళ్లు మూసి తెరిచేంతలో దారుణమైన ప్రకృతి బీభత్సం.. కళ్లముందే కొట్టుకుపోయిన వందలాది కుటుంబాలు.. నదిలో తేలుతున్న మృతదేహాలు.. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు. కేరళలో అంతులేని విషాదానికి ఇవి ఆనవాళ్లు. దేవభూమిగా పిలిచే గడ్డపై మరణమృదంగం మోగింది. ఏటా భారీ వర్షాలు మామూలే అయినా.. ఇలా కొండచరియలు విరిగిపడి వందలాదిమంది సజీవసమాధి కావడం.. కనీసం చివరి చూపుకైనా నోచుకోలేని పరిస్థితులు ఉండడం.. పగవాడికి కూడా రాకూడని పరిస్థితి ఇది. పశ్చిమకనుమల్లో జలప్రళయానికి అసలు కారణాలేమిటి?
అర్థరాత్రి వేళ ఆదమరిచి నిద్రపోతున్న వారి ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ దెబ్బకు ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్లు నేలమట్టమవ్వడం.. వాటి కింద వందలాదిమంది ఇరుక్కుపోవడం.. ఎటూ కదలలేక.. ప్రాణాలు కాపాడుకోలేక మృతి చెందిన సంఘటనలు కన్నీరు పెట్టిస్తాయి. కేరళలో ఆ విలయం అర్థరాత్రితో ఆగలేదు. తెల్లవారుజామున మళ్లీ మరోసారి బీభత్సం సృష్టించింది. దీని దెబ్బకు సహాయశిబిరంతోపాటు అక్కడున్న ఇళ్లు, షాపులు అన్నీ ధ్వంసమయ్యాయి. దేవభూమిలో.. వయనాడ్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో టీ, కాఫీ తోటల్లో పనిచేయడానికి అసోంతోపాటు పశ్చిమబెంగాల్ నుంచి వలస కూలీలు వస్తుంటారు. వారిలో 600 మంది ఆచూకీ కూడా కనుక్కోలేని పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి.

Kerala Wayanad Landslides 1
ఈ శతాబ్దంలోనే అంతులేని విషాద ఘటన మాత్రం 2018లోనే జరిగింది. ఆ 2018 నాటి ప్రకృతి విలయం తరువాత అంతటి బీభత్సం సృష్టించిన దారుణమైన ఘటన ఏదైనా ఉందీ అంటే అది ఇదే. 2018 లో వర్షాలు భీకరంగా కురవడంతో 483 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 14 లక్షల మందిని సహాయక శిబిరాలకు తరలించారు. కేరళ రాష్ట్రం బడ్జెట్ కు ఎంత కేటాయిస్తారో.. అంత మొత్తంలో ఆ ఏడాది నష్టం వాటిల్లింది. దీనిని బట్టి కేరళ ఎంత తీవ్రంగా నష్టపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక కేరళలో కొండచరియలు విరిగిపడడం కొత్త కాకపోయినా.. ఈ స్థాయిలో మృతుల సంఖ్య లేదనే చెప్పాలి. 2019లో ఇదే వయనాడ్ లోని పుత్తుమలలో 17 మందిని బలిగొన్నది కొండచరియలు విరిగిపడిన ఘటనే. 2021లో కొట్టాయం, ఇరుక్కి ఘటనలో 35 మంది, ప్రాణాలు కోల్పోయారు. 2022లో ఆకస్మిక వరదల వల్ల 18 మంది చనిపోయారు. ఇక్కడ ఇంకో సంఘటన గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. మన దేశంలో 2015 నుంచి 2022 వరకు అంటే ఆ ఏడేళ్ల మధ్య కొండ చరియలు విరిగిపడిన ఘటనలు అనేకం జరిగాయి. నెంబర్ చెప్పాలంటే.. 3,782. ఇందులో ఒక్క కేరళలోనే.. 2,239 ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిని బట్టి కేరళ రాష్ట్రం ఎంతటి పెను విషాదాలను ఎదుర్కొంటోందో అర్థమవుతుంది.

Kerala Wayanad Landslides 5
కొండలు అన్ని ప్రాంతాల్లోనూ ఉంటాయి. కానీ వాటిలో ఏటవాలుగా ఉండేవాటితో ప్రమాదం ఎక్కువని గుర్తించాలి. ఎందుకంటే.. భారీ వర్షాలు పడినప్పుడు వాటిపై ఉండే రాళ్లు, మట్టి కొట్టుకువస్తాయి. అలా అని వర్షాలు పడిన ప్రతీసారీ ఇలాగే జరుగుతుందని చెప్పలేం. కొన్ని ప్రాంతాల్లో ఇది అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భాలను జాగ్రత్తగా గమనించాలి. మరికొన్ని ప్రాంతాల్లో సడన్ గా ఇలాంటి పరిణామాలుంటాయి. అప్పుడు పరిస్థితి చేయిదాటిపోతుంది. కొండపై రాళ్లు, మట్టి వంటివి నిశ్చలంగానే ఉంటాయి. కానీ వర్షాలు, ఇతర ప్రకృతి ప్రకోపాల సమయంలో అవి కిందకు జారుతాయి. అలాంటప్పుడు వాటి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుందని శాస్త్రవేత్తలు అంటారు. ఇక్కడ ఒక్క విషయాన్ని మాత్రం గమనించాలి. భారీ వర్షాలతో పాటు భూకంపాలు, నీటి మట్టాల్లో మార్పులు చోటుచేసుకోవడం, కోతలకు గురైన ప్రాంతాలు.. ఇలాంటివాటి వల్ల కొండచరియలు విరిగిపడతాయి. అలాంటప్పుడు నష్టం ఎక్కువగా ఉంటుంది.

Kerala Wayanad Landslides 6
కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను మాత్రం ముందుగానే గుర్తించవచ్చు. అది ఎలా అంటే.. నిటారుగా ఉండే కొండప్రాంతాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే లోయల దిగువ భాగాల విషయంలోనూ కేర్ తీసుకోక తప్పదు. ఇక నీటిలో ఎక్కువకాలం ఉండే ప్రాంతాలపైనా కన్నేసి ఉంచాలి. కార్చిచ్చు వల్ల తగలబడిన ప్రాంతాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. వాగు ప్రవహించే మార్గంలోను, నదీ ప్రవాహ మార్గాల్లోనూ నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. ఎగువప్రాంతాల్లో ప్రకృతి విధ్వంసం వల్ల దాని రిజల్ట్.. ఈ మార్గాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఇలాంటి ప్రాంతాల్లో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. మరి కొండచరియలు విరిగిపడిన సందర్భాల్లో తప్పించుకోవడం సాధ్యం కాదా అంటే.. దీనికి సమాధానం.. అప్పుడున్న పరిస్థితులను బట్టి ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలకు ముందు కొన్ని సంకేతాలు ఉంటాయి. రాళ్లు దొర్లుతున్న శబ్దం వింటే వెంటనే అలెర్ట్ కావాలి. అలాగే చెట్లు పడిపోయిన సౌండ్ వచ్చినా జాగ్రత్తపడాల్సిందే. మీకు సమీప ప్రాంతాల్లోని జలవనరుల్లో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగినా, తగ్గినా, ఆ నీరు బురదలా మారినా.. అది ప్రమాద సంకేతమని గుర్తించాలి. వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటపడాలి. నిపుణులు చెబుతున్న ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం మంచిది.
ఒకవేళ హఠాత్తుగా కొండచరియలు విరిగిపడితే.. అప్పుడు కొన్ని చర్యల ద్వారా ప్రాణాలు కాపాడుకునే అవకాశముంది. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ఇలాంటి ఘటనల గురించి రీసెర్చ్ చేసింది. ఆస్తి నష్టానికి సంబంధించిన కొన్ని ఘటనలను కూడా పరిశీలించారు. ఇలాంటి ప్రమాద సమయంలో ఎగువ ప్రాంతాలకు వెళ్లడం మంచిదన్నారు. అలాగే శిథిలాలలో ఇరుక్కున్నవారు శబ్దాలు చేయడం ద్వారా.. సహాయకబృందాలకు సంకేతాలు అందుతాయి. అప్పుడు వారిని కాపాడడం ఈజీ అవుతుందన్నారు. నిజానికి కొండచరియలు విరిగిపడినప్పుడు.. రాళ్లు, మట్టి పెళ్లలు చాలా వేగంగా పడతాయి. మనిషి పరిగెట్టినా వాటి వేగాన్ని అందుకోలేడు. పైగా ఈ చర్య ఒక్కసారితో ఆగదు.. కొన్ని రోజుల పాటు కొనసాగవచ్చు. నిజానికి ఇలాంటి ఘటనల్లో ఎక్కువమంది ఊపిరాడకపోవడం వల్ల, రాళ్ల మధ్య కాని, బురదలో కాని ఇరుక్కుపోవడం వల్ల మరణిస్తారు. ఆ సమయంలో వారికి తప్పించుకునే పరిస్థితులు చాలా తక్కువ. అందుకే.. ఇలాంటి ఘటనలకు సంబంధించిన హెచ్చరికలు వచ్చినప్పుడే.. సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించే వ్యవస్థను బలోపేతం చేయాలి. అప్పుడే ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించడానికి అవకాశముంటుంది.
కొండచరియలు విరిగిపడడంతో ఆ విషాదం ఆగదు. ఈ ఘటన తరువాత అక్కడ అపరిశుభ్ర వాతావరణం ఉంటుంది. అది వ్యాధులకు కారణమవుతుంది. పైగా కరెంట్ వైర్లు తెగిపడి ఉంటాయి. షాక్ కొట్టే ప్రమాదముంటుంది. తాగునీటికి సమస్యలు తప్పవు. మురుగునీటి వ్యవస్థ దెబ్బతినడం, పారిశుధ్యం లేకపోవడంతో ఇబ్బందులు ఉంటాయి. ఆస్తి, ప్రాణనష్టం వల్ల కుటుంబాలకు కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా నలిగిపోతాయి. అందుకే ఇలాంటి విషాదం తరువాత.. ఆ ప్రాంతాల్లో బాధితులకు కచ్చితంగా సపోర్ట్ అవసరం. వారికి చేయూతనివ్వాలి. వారిలో ధైర్యాన్ని నింపాలి. ఆర్థికంగా అండగా ఉండాలి. ఓ రకంగా వారు మరో జీవితాన్ని ప్రారంభించినట్టే. అందుకే వారికి అన్ని విధాలా సాయం అవసరం. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు బాధితులకు సాయం చేయడం.. తరువాత కొన్నాళ్లకు ఈ సంఘటనను అందరూ మర్చిపోవడం జరుగుతోంది. కానీ ఇకపై అలాంటివాటికి ఆస్కారం లేకుండా చేయాలి. ఒక ఘటన నుంచి నేర్చుకున్న పాఠాలు.. మళ్లీ అలాంటి దారుణాలు జరగకుండా గుణపాఠాలుగా ఉపయోగపడాలి. ఇలాంటివాటికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి.. చిత్తశుద్ధితో అమలుచేయాలి.

Kerala Wayanad Landslides 4
కొండచరియలు విరిగిపడితే.. ఆ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలు ధ్వంసమవుతాయి. అక్కడుండేవారు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. మనిషి చందమామపై అడుగుపెట్టగలిగేంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి దారుణాలను ముందే ఊహించలేమా? దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోలేమా? నిజానికి కొండచరియలు విరిగిపడితే.. ఆ కొండలపై ఉండేవన్నీ కొట్టుకువస్తాయి. బండరాళ్లతోపాటు మట్టిపెళ్లలు కూడా పెను విధ్వంసానికి కారణమవుతాయి. ప్రపంచంలో చాలామంది ఇలాంటివాటివల్లే ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ రాళ్లమధ్య, మట్టిపెళ్లల మధ్య ఇరుక్కుపోయినా, బురదలో కూరుకుపోయినా వాటి నుంచి బయటపడడం చాలా కష్టం. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఇలాంటి ప్రకృతి బీభత్సాలు తప్పవని శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరికలు పెడచెవిన పెట్టడానికి వీల్లేదనడానికి కేరళ ఘటనే ఉదాహరణ. ఇలాంటి దారుణమైన ఘటనల నుంచి తప్పించుకునే మార్గం లేదా? ప్రపంచంలో ఏ దేశంలోనూ దీనికి సంబంధించిన టెక్నాలజీని అభివృద్ధి చేయలేదా? అసలు.. కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? వాటిలో రకాలు కూడా ఉన్నాయా? అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారు? సాధారణ ప్రజలు వాటిని ఎలా పాటించాలి? ప్రభుత్వాలు దీనికోసం ప్రజలను ఎలా సిద్ధం చేయాలి? వారికి ఎలాంటి సౌకర్యాలను కల్పించాలి? ఇలా ఎన్నో ప్రశ్నలు.

Kerala Wayanad Landslides 3
కేరళలో ప్రకృతి విలయానికి, అరేబియా సముద్రం వేడెక్కడానికి సంబంధమేంటి? ఈ రెండింటికీ మధ్య కచ్చితంగా బంధముందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అరేబియా సముద్రంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల.. మేఘాల వ్యవస్థ దట్టంగా మారుతోంది. దీనివల్ల.. తక్కువ సమయంలో భారీ వర్షాలు కురుస్తాయి. ఇవి కొండచరియలు విరిగిపడడానికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆగ్నేయ అరేబియా ప్రాంతంలో వేడి పెరుగుతోంది. దీని ఎఫెక్ట్ కేరళతో పాటు ఆ ప్రాంతంపై పడుతోంది. దీనివల్ల అక్కడి ఉష్ణోగ్రతలపై ప్రభావం తప్పడం లేదు. ఇది అక్కడి వాతావరణాన్ని అస్థిరంగా మారుస్తోంది. ఈ పరిస్థితులే.. అ ప్రాంతంలో దట్టమైన మేఘాలు ఏర్పడేలా చేస్తున్నాయి. ఇలాంటి క్లౌడ్స్ ను శాస్త్రవేత్తలు కూడా ముందుగానే గుర్తించారు. కానీ ఇది ఇంతటి విషాదానికి కారణమవుతుందని అంచనా వేయలేకపోయారు. దీంతో ఈ విధ్వంసం తప్పలేదు. ఒకవేళ ఇలాంటి వాటిని ముందే గుర్తించే వీలుంటే.. ఇలాంటి పెను విషాదం చోటుచేసుకునేది కాదు. ఇంతమంది ప్రాణాలు పోయేవి కాదు. కానీ ఇలాంటి దుర్ఘటన మళ్లీ జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

Kerala Wayanad Landslides 2
నిజానికి కేరళకు ఉన్న భౌగోళిక పరిస్థితులను బట్టి అక్కడ ప్రకృతి బీభత్సాల చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అలాగే ఆ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఎంత మేర ఉంది.. దానికి ఏమేర, ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి అన్నదానిపైనా రీసెర్చ్ జరగాలి. అలాంటి ఘటనలు జరగడానికి ముందు వాటి గురించి వార్నింగ్ ఇచ్చే వ్యవస్థ కూడా ఉండాలి. వర్షాలు ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో పడతాయో అంచనా వేసే వ్యవస్థ మన దగ్గర ఉంది. ఏ రోజు ఎంత మేర ఎండ కాస్తుందో ముందే చెప్పగలుగుతున్నాం. దీనివల్లే వాతావరణ హెచ్చరికలు చేయగలుగుతున్నాం. ఆ మేరకు జాగ్రత్తలు తీసుకుని.. రాబోయే ముప్పు నుంచి తప్పించుకుంటున్నాం. అదే తరహాలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఏమేరకు ఉందో ముందే తెలుసుకునే టెక్నాలజీని రూపొందించుకోవాలి. వర్షం కురిసిన ప్రతీసారీ ఇలాంటి దారుణ ఘటనలు జరగవు. కానీ ఇలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉండడం వల్ల ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి, తప్పించడానికి చాలా అవకాశముంటుంది. ఇది అనుకున్నంత సులభం కాకపోయినా.. ప్రయత్నమైతే జరగాలి. అప్పుడే ఇలాంటి విషాదాలకు అడ్డుకట్ట పడుతుంది.