AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్పెషల్ ఫ్లైట్‌లో పవన్‌కల్యాణ్ చక్కర్లు.. ఖర్చు భరించేదెవరంటే!

పవర్ స్టార్‌గా సినిమాల్లో, పవన్ కళ్యాణ్‌గా రాజకీయాల్లో ద్విపాత్రాభినయం చేస్తున్న జనసేన అధినేత గత వారం రోజులుగా ప్రత్యేక విమానంలో చక్కర్లు కొడుతున్నారు. హైదరాబాద్, విజయవాడ మధ్య ప్రతీ రోజు ప్రత్యేక విమానంలో పవన్ కల్యాణ్ రోమింగ్ చేస్తున్నారు. అక్కడ రాజకీయాలు.. ఇక్కడ సినిమా షూటింగ్‌లో ఆయన పాల్గొంటున్నారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టిన జనసేనాని.. పార్టీ అంతర్గత సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రతీ రోజు మంగళగిరిలో పార్టీ […]

స్పెషల్ ఫ్లైట్‌లో పవన్‌కల్యాణ్ చక్కర్లు.. ఖర్చు భరించేదెవరంటే!
Rajesh Sharma
| Edited By: |

Updated on: Jan 28, 2020 | 1:13 PM

Share

పవర్ స్టార్‌గా సినిమాల్లో, పవన్ కళ్యాణ్‌గా రాజకీయాల్లో ద్విపాత్రాభినయం చేస్తున్న జనసేన అధినేత గత వారం రోజులుగా ప్రత్యేక విమానంలో చక్కర్లు కొడుతున్నారు. హైదరాబాద్, విజయవాడ మధ్య ప్రతీ రోజు ప్రత్యేక విమానంలో పవన్ కల్యాణ్ రోమింగ్ చేస్తున్నారు. అక్కడ రాజకీయాలు.. ఇక్కడ సినిమా షూటింగ్‌లో ఆయన పాల్గొంటున్నారు.

ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టిన జనసేనాని.. పార్టీ అంతర్గత సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రతీ రోజు మంగళగిరిలో పార్టీ సమావేశాలు.. హైదరాబాద్‌లో సినిమా షూటింగ్.. ఇలా రెండు రంగాల్లో సమాంతరంగా పనిచేస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేక విమానాన్ని వినియోగిస్తున్నారు. మొన్న గణతంత్ర దినోత్సవానికి ముందు నుంచే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ టు విజయవాడ చక్కర్లు కొడుతున్నారు.

ఫ్యాన్స్ కోరిక మేరకో లేక పార్టీ ఫండ్ కోసమో లేక వ్యక్తి గత అవసరాల కోసమో తెలియదు గానీ.. పవన్ కల్యాణ్.. దిల్ రాజు బ్యానర్‌లో లాయర్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జనవరి 20 ప్రారంభమైంది. అదే రోజు అటు అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆరోజు ఉదయాన్నే హైదరాబాద్‌లో ముహూర్తం షాట్‌లో మెరిసిన పవర్ స్టార్ ఆ వెంటనే ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్ళి రాజధాని రైతులకు అండగా నిలబడ్డారు. అమరావతి ప్రాంతంలో జనవరి 20న ప్రర్యటించాలని పవన్ కల్యాణ్ అనుకున్నప్పటికీ ఏపీ పోలీసులు ఆయన్ని పార్టీ కార్యాలయంలోనే నిర్బంధించినంత పని చేశారు.

ఒక పక్క సినిమా షూటింగ్, మరో పక్క రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టడం కోసం పవన్ కల్యాణ్ విజయవాడ-హైదరాబాద్ మధ్య ప్రతీ రోజు తిరగాల్సి వస్తుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి స్పెషల్ ఫ్లైట్‌లో గన్నవరం చేరుకుంటున్నారు. వీలును బట్టి మంగళగిరి జనసేన కార్యాలయానికిగాని, బెంజ్ సర్కిల్ దగ్గరున్న కార్యాలయానికి వెళ్లి పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటున్నారు. సాయంత్రానికి అన్ని పనులు ముగించుకుని తిరిగి 3 నుండి 4 గంటల మధ్యలో గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకుని హైద్రాబాద్ చేరుకుంటున్నారు. ఇలా రోజు ప్రత్యేక విమానంలో పవన్ చక్కర్లు కొడుతున్నారు. సినీ, రాజకీయ రంగాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తూ తమ అధినేత కష్టపడుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

అయితే.. తన సొంత డబ్బులతో రాజకీయం చేస్తున్నానని గతంలో ప్రకటించిన పవన్ కల్యాణ్.. ఇలా ప్రతీ రోజు విజయవాడ, హైదరాబాద్ మధ్య ప్రత్యేక విమానంలో తిరిగేందుకు ఖర్చులు ఎవరు భరిస్తున్నారన్నది ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న. దీనికి పవన్ కల్యాణ్ కార్యాలయం అధికారికంగా ఏమీ చెప్పనప్పటికీ.. తాను నటిస్తున్న సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజే.. పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానం ఖర్చులను భరిస్తున్నారని టాలీవుడ్ వర్గాలంటున్నాయి. భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మిస్తున్న దిల్ రాజు.. లాయర్ సాబ్ సినిమాకు ఇస్తున్న ప్రాధాన్యతతోపాటు.. పవన్ కల్యాణ్‌కు వున్న ఫ్యాన్ ఫాలొయింగ్‌ని దృష్టిలో పెట్టుకునే ప్రత్యేక విమానాన్ని సమకూరుస్తున్నారని అనుకుంటున్నారు.