Vaccination: ప్రయివేట్ ఆసుపత్రుల నుంచి వ్యాక్సిన్ వెనక్కి తీసుకుంటున్న తెలంగాణా ప్రభుత్వం

కరోనా తాకిడిని తట్టుకునేందుకు ముఖ్యమైన ఆయుధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చెబుతున్నారు. అయితే, చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ప్రస్తుతం వేధిస్తోంది.

Vaccination: ప్రయివేట్ ఆసుపత్రుల నుంచి వ్యాక్సిన్ వెనక్కి తీసుకుంటున్న తెలంగాణా ప్రభుత్వం
Follow us
KVD Varma

|

Updated on: Apr 30, 2021 | 9:49 PM

Vaccination: కరోనా తాకిడిని తట్టుకునేందుకు ముఖ్యమైన ఆయుధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చెబుతున్నారు. అయితే, చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ప్రస్తుతం వేధిస్తోంది. ఈ నేపధ్యంలో ఆయా రాష్ట్రాలు వాక్సినేషన్ విషయంలో చాలా ఏమరపాటుగా వ్యవహరిస్తున్నాయి. మరోవైపు మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ, అందుకు తగ్గట్టుగా వ్యాక్సిన్ సరఫరా లేదు. ఇప్పటికే వేలాదిమంది వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణా సర్కారు ఈరోజు సంచలన నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో ప్రైవేటు హాస్పిటళ్లకు కరోనా వ్యాక్సిన్ డోసులను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కేవలం ఈ రోజు వరకూ అందుబాటులో ఉన్న డోసులను మాత్రమే వాడుకొనేందుకు అనుమతించారు. మిగిలిన వ్యాక్సిన్ డోసులను వారి నుంచి సేకరించాలని మెడికల్ ఆఫీసర్లు, ఫార్మాసిస్ట్‌లకు హెల్త్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. , మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందని కేంద్రప్రభుత్వం ప్రకటించినప్పటికీ, దీనిపై ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. 45 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ ఇవ్వడం అప్పుడే సాధ్యం కాదని గురువారం మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఈ నేపధ్యంలో ప్రయివేట్ ఆసుపత్రుల నుంచి వ్యాక్సిన్ వెనక్కి తీసుకోవడం విషయం పై అయోమయం నెలకొందని చెప్పొచ్చు.

అయితే, రాష్ట్రంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా వేస్తామంటూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ, దీనికి సంబంధించి తదుపరి చర్యలు ఏమిటనేది తెలియడం లేదు. బహుశా పూర్తిగా ప్రభుత్వమే వ్యాక్సినేషన్ చేయాలని భావిస్తూ.. ప్రయివేటు ఆసుపత్రుల నుంచి వ్యాక్సిన్ వెనక్కి తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా మే 1 నుంచి అందరికీ వ్యాక్సినేషన్ అమలు అయ్యేది కష్ట సాధ్యం లానే పరిస్థితి కనిపిస్తోంది. వ్యాక్సిన్ వేయించుకొనేందుకు ప్రస్తుతం నమోదు ప్రక్రియ నడుస్తున్నా కచ్చితమైన స్లాట్ మాత్రం కేటాయించడం లేదు. వ్యాక్సిన్ డోసులు రాష్ట్రంలో అవసరం ఉన్న స్థాయిలో సరఫరా అయితేనే అందరికీ పంపిణీ ప్రక్రియ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Allegations: ఈటెల రాజేందర్ పై భూ ఆక్రమణల ఆరోపణలు.. నిజమే అంటున్న మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి!

Telangana Night Curfew: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నైట్‌ కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు.. ఎప్పటి వరకు అంటే..