Allegations: ఈటెల రాజేందర్ పై భూ ఆక్రమణల ఆరోపణలు.. నిజమే అంటున్న మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి!
తెలంగాణా ఆరోగ్యశాఖామంత్రి ఈటెల రాజేందర్ భారీ భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం లోని కొన్ని గ్రామాలకు చెందిన కొందరు బలహీన వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక లేఖ రాశారు.
Allegations: తెలంగాణా ఆరోగ్యశాఖామంత్రి ఈటెల రాజేందర్ భారీ భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచంపేట్ అలాగే, హకీంపేట్ గ్రామాలకు చెందిన కొందరు బలహీన వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో వారు ప్రభుత్వం 1994లో తమకు సర్వ్ నెంబర్ 130/5, 130/9, 130/10 లలో ఒక్కో కుటుంబానికీ 1 ఎకరం 20 కుంటల చొప్పున, అలాగే సర్వే నెంబర్ 64/6 లో మూడు ఎకరాలు ఒకరికి కేటాయించినట్టు తెలిపారు. కొన్ని రోజులుగా ఈటెల రాజేందర్ తమను బెదిరిస్తున్నారని చెప్పారు. ఆ అసైన్డ్ భూములను త్వరలో ప్రభుత్వం తిరిగి స్వాధీన పరుచుకుంటుంది అని చెప్పి బెదిరిస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అక్కడ దాదాపు 100 ఎకరాల అసైన్డ్ భూమిని ఈటెల రాజేందర్ ఆయన అనుచరులు ఆక్రమించుకున్నారని.. అక్కడ వారు ఒక పెద్ద పౌల్ట్రీ పరిశ్రమ పెట్టేందుకు ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు కొనసాగిస్తున్నరంటూ తీవ్ర ఆరోపణలను ఆ లేఖలో చేశారు.
ఈ నేపధ్యంలో మంత్రి ఈటల రాజేందర్‌పై వస్తున్న ఆరోపణలపై అప్పటి అధికారి ధర్మారెడ్డి స్పందించారు. అప్పట్లో మంత్రి తనను అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయాలని కోరారని చెప్పి సంచలనం సృష్టించారు. అచ్చంపేట వద్ద మంత్రికి కోళ్ల ఫారంలు ఉన్నాయనీ, వాటి కోసమే భూమిని రెగ్యులరైజ్ చేయాలని కోరారనీ ధర్మారెడ్డి చెబుతున్నారు. అయితే, కలెక్టర్ స్థాయిలో అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయడం సాధ్యం అయ్యే పని కాదని తాను చెప్పానని ఆయన తెలిపారు.
ఇక మరో అధికారి అడిషనల్ కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ అక్కడ 25 ఎకరాల భూమిని వ్వాలని తనను రాజేందర్ సంప్రదించారని చెబుతున్నారు. తాను వెళ్లి ఆభూములను పరిశీలించానని ఆయన చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు అసైన్డ్ లాండ్ ఇవ్వడం కుదరదని తాను చెప్పానన్నారు. అలాగే ప్రస్తుతం ఈ భూమి ఈటెల ఆధీనంలోనే ఉందని ఆయన వివరించారు.
మొత్తమ్మీద వ్యవహారం చూస్తే, ఈటెల ఈ విషయంలో గట్టిగానే ఇరుక్కున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఆయనపై ప్రజలు ఆరోపణలతో ముఖ్యమంత్రికి లేఖ రాయడం.. దానిపై అధికారులు కూడా సానుకూలంగా స్పందించడం కచ్చితంగా మంత్రిని ఇరకాటంలో పెట్టే విషయాలే. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకూ మంత్రి ఈటెల రాజేంద్ర స్పందించలేదు.
సమగ్ర దర్యాప్తుకు ముఖ్యమంత్రి ఆదేశం..
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని భూములు కబ్జాకు గురయ్యాయనే విషయంలో తనకు అందిన ఫిర్యాదును పురస్కరించుకుని వెంటనే దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి రిపోర్టు అందచేయాల్సిందిగా సిఎస్ సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుదేల్చాల్సిందిగా విజిలెన్స్ డిజి పూర్ణచందర్ రావు ని సిఎం అదేశించారు. సత్వరమే ఇందుకు సంబంధించి ప్రాధమిక నివేదికను అందజేసి అనంతరం సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజేయాల్సిందిగా సిఎం ఆదేశాలు జారీ చేశారు.