అమెరికాలో అధికారం చేపట్టిన దగ్గర నుంచి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అదే కోవలో బర్త్ టూరిజానికి చెక్ పెడుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులు విదేశీయులు అయినప్పటికీ.. అమెరికాలో పుట్టిన ప్రతీ బిడ్డకు ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. ఇక ఈ నిబంధన ఎప్పటినుంచో ఉంది.
ఈ క్రమంలోనే తమకు పుట్టబోయే బిడ్డకు అగ్రరాజ్య పౌరసత్వం రావాలన్న ఉద్దేశంతో వందలాది మంది గర్భిణీ స్త్రీలు ప్రతీ ఏటా ప్రసవం కోసం పర్యాటక వీసా మీద అమెరికా పయనం అవుతారు. ఇక ఇది ఓ పెద్ద వ్యాపారంలా మారిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బర్త్ టూరిజానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
గర్భిణీలు ఇకపై టూరిజం వీసాతో రాకుండా ఉండేందుకు కఠినతరమైన నిబంధనలను అమలులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ కొత్త రూల్స్ శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. అయితే ప్రసవం కోసం వస్తున్నామని.. అంతేకాకుండా వైద్య పరీక్షల నిమిత్తం అవసరమైయ్యే డబ్బులు కూడా తమ వద్ద ఉన్నాయని చూపించిన వారికి మాత్రం ఈ నిబంధనలు వర్తించవని తెలుస్తోంది. అటు వివిధ వ్యాధులకు చికిత్స కోసం వచ్చినవారిని కూడా పరిగణించాల్సి ఉంది. కాగా, ఈ కొత్త నిబంధనలను అమలు చేయడం అంత సులభం కాదని.. ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయని వీసా నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

