Andhra News: అయ్యో ఎంత ఘోరం.. నిద్రలోనే సజీవ దహనమైన అక్కాచెల్లెళ్లు
ఈ విషాద ఘటన స్థానికులను కలచివేసింది. సజీవ దహనమైన అక్కాచెల్లెళ్ళను చూసి గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు. ఘటనా స్థలాన్ని బాపట్ల డిఎస్పీ రామాంజనేయులు పరిశీలించారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలను ఆడిగితెలుసుకున్నారు... ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని డీఎస్పి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలోని పర్చూరులో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఓ ఇంట్లో మంటలు చెలరేగి అక్కా చెల్లెళ్ళు సజీవ దహనం అయ్యారు. గ్రామంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పర్చూరు రామాలయం వీధిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దాసరి వెంకటేశ్వర్లుకు చెందిన ఇంట్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే తేరుకున్న తల్లి లక్ష్మీరాజ్యం కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇంట్లో మంటల్లో చిక్కుకున్న తన ఇద్దరు కుమార్తెలను కాపాడటానికి తల్లి చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో అగ్నిప్రమాదంలో చిక్కుకుని కదలలేని స్థితిలో వికలాంగురాలిగా ఉన్న అక్క దాసరి నాగమణి (34), చెల్లెలు దాసరి మాధవి లత (30) సజీవ దహనమయ్యారు. కళ్ళ ముందే ఇద్దరు కూతుళ్ళు సజీవ దహనం అవుతుండటంతో తల్లి తల్లడిల్లిపోయింది. గుండెలవిసేలా రోదించింది.
సమాచారం అందుకున్న చీరాల ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే మృతి చెందిన అక్కాచెల్లెళ్ళ మృతదేహాలను బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం పర్చూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుమార్తెలను కాపాడుకోబోయి తీవ్ర గాయాలపాలైన తల్లి లక్ష్మీరాజ్యంను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ విషాద ఘటన స్థానికులను కలచివేసింది. సజీవ దహనమైన అక్కాచెల్లెళ్ళను చూసి గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు. ఘటనా స్థలాన్ని బాపట్ల డిఎస్పీ రామాంజనేయులు పరిశీలించారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలను ఆడిగితెలుసుకున్నారు… ప్రమాదంపై దర్యాప్తు చేపట్టామని డీఎస్పి తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందని ప్రాథమికంగా చెబుతున్నారని, అయితే దోమల కాయిల్స్ వల్ల ఏమైనా మంటలు వ్యాపించాయా..? అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నామని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..