AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sagar By Election: మార్చిలో నాగార్జునసాగర్‌కు ఉప ఎన్నిక?.. పార్టీ శ్రేణులకు గులాబీ దళపతి చెప్పిందదేనా..?

టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాణ్మరణంతో ఖాళీ అయిన నాగార్జునసార్ నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానానికి మార్చిలో ఉప ఎన్నిక జరగనుందా?

Sagar By Election: మార్చిలో నాగార్జునసాగర్‌కు ఉప ఎన్నిక?.. పార్టీ శ్రేణులకు గులాబీ దళపతి చెప్పిందదేనా..?
Shiva Prajapati
|

Updated on: Dec 16, 2020 | 10:19 AM

Share

టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాణ్మరణంతో ఖాళీ అయిన నాగార్జునసార్ నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానానికి మార్చిలో ఉప ఎన్నిక జరగనుందా? తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగే ఉపఎన్నికతో పాటే సాగర్‌కు కూడా ఉప ఎన్నిక పెడతారా? ఎన్నికలం సంఘం ఆమేరకు కసరత్తు చేస్తుందా? రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నేతలు ఏం చేస్తున్నారు? ఉపఎన్నికపై గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్.. టీఆర్ఎస్ శ్రేణులకు ఎలాంటి ఉపదేశం ఇచ్చారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ కథనంలో చూద్దాం.

టీఆర్ఎస్ నేత, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గుండెపోటుతో అకాలమరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. మరోవైపు తిరుపతి పార్లమెంట్ సభ్యుడు దుర్గప్రసాదరావు కూడా సెప్టెంబర్‌లో అనారోగ్యం కారణంగా చనిపోయారు. దాంతో ఆ స్థానం కూడా ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాలకు కలిపి ఉప ఎన్నికల నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తిరుపతి పార్లమెంట్ స్థానానికి మార్చిలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఈ ఎన్నికతో పాటే సాగర్‌కు కూడా ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.

అయితే మార్చిలో సాగర్‌కు ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పెద్దలు అప్రమత్తమయ్యారు. ఉపఎన్నిక కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే ఒక సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మరో సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు సహా సాగర్ నియోజకవర్గ శ్రేణులకు ఆయన కీలక సూచనలు చేశారు. మార్చిలో సాగర్‌ ఉపఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని, నేతలు, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సాగర్ నియోజకవర్గ శ్రేణులంతా ఎన్నికల మూడ్‌లోనే ఉండాలని ఆదేశించారు. ఇందులో భాగంగా సాగర్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతల వరుస పర్యటనలు ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. ఇదిలాఉంటే.. సాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరఫున నోముల కుటుంబానికి కానీ, రెడ్డి సామాజికవర్గానికి కానీ టికెట్ కేటాయించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.