అమ్మాయికి పెళ్లి సంబంధం చూసి వస్తున్నారు.. ఇంతలోనే, ఊహించని ఘటన..
కూతురికి పెళ్లి సంబంధం చూసి ఆనందంగా ఇంటికి తిరిగి వస్తున్న కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం విషాదంలోకి నెట్టింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో కారు ఆటోను వెనుక నుంచి ఢీకొనడంతో కోటేశ్వరరావు (35) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు ఆంధ్రప్రదేశ్లోని జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామానికి చెందినవారు.

పెళ్లి సంబంధం చూసి ఆనందంగా ఇంటికి తిరిగి వస్తున్న కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామానికి చెందిన నరసింహ నాయక్ తన కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో కూతురికి పెళ్లి సంబంధం చూసేందుకు తన కుటుంబ సభ్యులు, కజిన్ బ్రదర్ వెంకటేశ్వర రావుతో కలిసి నరసింహ ఆటోలో కూసుమంచికి వెళ్లారు. అక్కడ పెళ్లి సంబంధం చూసి ఆనందంగా స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట వద్ద జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన స్కార్పియో కారు ఆటోను వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న ఆరుగురిలో కోటేశ్వరరావు (35) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్కార్పియో డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ ప్రమాదంపై కోదాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
అప్పటి వరకు పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ వస్తున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ప్రమాదానికి గురికావడంతో బంధువులు, గ్రామస్థులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
