AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఓయో, హోటల్స్‌కు వెళ్తున్నారా.. ఇకపై ఇవి తప్పకుండా గుర్తించుకోండి

నగరంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని పలు హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లు, ఓయో రూమ్స్‌లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. హోటల్ యాజమాన్యాలు ప్రతి గెస్ట్ నుంచి తప్పనిసరిగా ఐడీలు, గుర్తింపు పత్రాలు తీసుకుంటున్నారా లేదా అనే విషయాన్ని అధికారులు పరిశీలించారు.

Hyderabad: ఓయో, హోటల్స్‌కు వెళ్తున్నారా.. ఇకపై ఇవి తప్పకుండా గుర్తించుకోండి
Hyderabad Security Crackdown
Sravan Kumar B
| Edited By: |

Updated on: Jun 06, 2026 | 7:08 PM

Share

హైదరాబాద్‌ నగరంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా హైదరాబాద్‌ సీపీ సజ్జనార్ నగరంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. సీపీ సజ్జనార్ ఆదేశాలతో శుక్రవారం రాత్రి నగర వ్యాప్తంగా హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లు, ఓయో రూమ్స్‌లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో పోలీసు అధికారులు పలు ప్రాంతాల్లో ఉన్న హోటల్స్ సందర్శించి అక్కడి నిర్వహణ విధానం, అతిథుల నమోదు ప్రక్రియ, గుర్తింపు పత్రాల ధృవీకరణ, సీసీ కెమెరాల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.

సీపీ సజ్జనార్ సైతం స్వయంగా కొన్ని హోటళ్లను సందర్శించి హోటల్ యాజమాన్యాలు ప్రతి గెస్ట్ నుంచి తప్పనిసరిగా ఐడీలు, గుర్తింపు పత్రాలు తీసుకుంటున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. అతిథుల వివరాలు రిజిస్టర్లలో, ఆన్‌లైన్ వ్యవస్థల్లో సక్రమంగా నమోదు చేస్తున్నారా అనే అంశాన్ని కూడా తనిఖీ చేశారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు బస చేస్తున్నారా, నిబంధనలకు విరుద్ధంగా గదులు కేటాయిస్తున్నారా అనే కోణంలో కూడా పరిశీలనలు చేపట్టారు. హోటళ్లు, లాడ్జీలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనే విషయాన్ని పోలీసులు పరిశీలించారు.

రికార్డింగ్ నిల్వ వ్యవధి, ప్రవేశ ద్వారాలు, కారిడార్లు, పార్కింగ్ ప్రాంతాల్లో నిఘా వ్యవస్థల పనితీరును తనిఖీ చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించని సంస్థలకు అవసరమైన సూచనలు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. నగరంలో నేరాల నియంత్రణ, పరారీలో ఉన్న నిందితుల గుర్తింపు, అక్రమ కార్యకలాపాల నిరోధం, ప్రజల భద్రత కోసం ఇటువంటి ఆకస్మిక తనిఖీలు కీలకమని పోలీసులు పేర్కొన్నారు. హోటళ్లు, లాడ్జీలు నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ప్రతి అతిథి వివరాలను ధృవీకరించిన తర్వాతే గదులు కేటాయించాలని సూచించారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. నగర భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, హోటల్ యాజమాన్యాలు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఈ ఆకస్మిక తనిఖీలతో నగరంలోని హోటల్, లాడ్జింగ్ రంగంలో అప్రమత్తత పెరిగింది. భద్రతా నిబంధనల అమలుపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us