Hyderabad: హైదరాబాద్‌లో కొత్త మోసం.. చికెన్ సెంటర్ల యజమానులే టార్గెట్! జాగ్రత్త మరీ
ప్రజలను మోసం చేసేందుకు కేటుగాళ్లు రోజురోజుకూ కొత్త మార్గాలు వెతుకుతున్నారు. బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్, ఉద్యోగాలు, సోషల్ మీడియా, ట్రేడింగ్ స్కామ్‌ల తర్వాత ఇప్పుడు ప్రభుత్వ అధికారుల పేర్లను వాడుకుని దందా మొదలుపెట్టారు. తాజాగా నగరాల్లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ను మాట్లాడుతున్నా.. అంటూ ఫోన్ కాల్స్ చేసి డబ్బులు వసూలు చేసే కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా చికెన్ సెంటర్లు, చిన్న హోటళ్లు, బేకరీలు, ఫుడ్ వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠాలు బెదిరింపులకు దిగుతున్నాయి.

ఇటీవలి కాలంలో ఆహార భద్రతా అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, జ్యూస్ సెంటర్లు, చికెన్ షాపులు వంటి ఆహార వ్యాపార కేంద్రాలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాణ్యత లేని ఆహార పదార్థాలు, అపరిశుభ్ర వాతావరణం, గడువు ముగిసిన వస్తువుల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన కేటుగాళ్లు అధికారుల పేరుతో రంగంలోకి దిగారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లమంటూ ఫోన్ చేసే మోసగాళ్లు.. మీ షాపుపై ఫిర్యాదులు వచ్చాయని, తనిఖీలు చేయబోతున్నామని, లైసెన్స్ సమస్యలు ఉన్నాయని చెబుతూ భయపెడుతున్నారు.
కేసులు నమోదు చేస్తామని, షాపును సీజ్ చేస్తామని హెచ్చరిస్తూ వెంటనే డబ్బులు పంపాలని ఒత్తిడి తెస్తున్నారు. కొందరికి గూగుల్ పే, ఫోన్‌పే, స్కానర్ కోడ్‌లు పంపించి నగదు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మోసానికి భయపడి కొందరు వ్యాపారులు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించిన ఘటనలు కూడా వెలుగుచూశాయి.
అధికారులు ఏం చెబుతున్నారు
ఆహార భద్రతా శాఖ అధికారుల స్పష్టమైన సూచన ఏమిటంటే.. తనిఖీలు నిర్వహించే అధికారులు ముందుగా ఫోన్ చేసి సమాచారం ఇవ్వరు. నేరుగా వ్యాపార కేంద్రాలకు వెళ్లి తనిఖీలు చేస్తారు. అలాగే లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్లు లేదా ఇతర అధికారిక ప్రక్రియల పేరుతో వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు పంపాలని ఎప్పుడూ అడగరు. గూగుల్ పే, ఫోన్‌పే, యూపీఐ స్కానర్ ద్వారా చెల్లింపులు కోరితే వాటిని నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు.
వాటిని నమ్మకండి
ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పేరుతో వచ్చే అనుమానాస్పద కాల్స్‌ను నమ్మవద్దు. వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు పంపవద్దు. కాల్ చేసిన వ్యక్తి వివరాలు, ఫోన్ నంబర్‌ను భద్రపరచాలి. వెంటనే స్థానిక పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. అధికారిక శాఖల ద్వారా మాత్రమే సమాచారం ధృవీకరించుకోవాలి.
వ్యాపారులు జాగ్రత్త
ప్రభుత్వ శాఖల పేర్లు, అధికారుల హోదాలను అడ్డం పెట్టుకుని జరుగుతున్న మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ ఆధారంగా డబ్బులు చెల్లించడం వల్ల భారీ నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి కొత్త తరహా మోసాల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
