Supreme Court: హైదరాబాద్‌లో ఆంక్షలు పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. ఈ-పాస్ సదుపాయం ఉందన్న ధర్మాసనం
తెలంగాణ రాష్ట్రంలో రవాణాపై ఆంక్షలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది.
Supreme Court Refuses Petition of Transport Restrictions: తెలంగాణ రాష్ట్రంలో రవాణాపై ఆంక్షలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రవేశించడానికి వీల్లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందని, ఇది సమానత్వపు హక్కుకు విఘాతం కల్గిస్తోందని ఆరోపిస్తూ ఓ న్యాయ విద్యార్థి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసు గురువారం జస్టిస్ ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
తెలంగాణలో ఈ-పాస్ ద్వారా రవాణాను నియంత్రించడాన్ని పిటిషనర్ సవాల్ చేయగా, ఆంక్షలు తాత్కాలికం అని జస్టిస్ ఇందిరా బెనర్జీ వ్యాఖ్యానించారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ గడువు ఇప్పటికే ముగిసిపోయిందని వ్యాఖ్యానించారు. ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్ హైదరాబాద్ నగరాన్ని పిటిషనర్ రాజధానిగా పేర్కొనడాన్ని తప్పుబడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5ను ప్రస్తావించడం సరికాదన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం నోటిఫికేషన్ జారీ అయిందని పేర్కొన్నారు. అందుకే ఈ-పాస్ వెసులుబాటును కల్పించారని జస్టిస్ ఇందిరా బెనర్జీ స్పష్టం చేశారు.
అయితే, రోగిని తీసుకుని ఆస్పత్రులకు వెళ్లాలంటే ఈ-పాస్ తీసుకోవాలని, ఢిల్లీ పరిసర ప్రాంతాలైన నోయిడా, ఘాజియాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చేవారికి కూడా ఈ-పాస్ విధానం అమలైందని జస్టిస్ ఇందిరా బెనర్జీ గుర్తుచేశారు. దీంతో న్యాయవాది రషీద్ ఆజం కల్పించుకుంటూ ఢిల్లీ వ్యవహారం వేరని, హైదరాబాద్ వ్యవహారం వేరని వివరించారు. ఢిల్లీ దేశ రాజధానిగా ఉందని, న్యాయవాదులు సైతం ఈ-పాస్ తీసుకుని ప్రయాణించాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ ఆంక్షలు తాత్కాలికమని, అలాంటివాటిపై విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతూ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.