Vaccine Global Tenders: వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు రాష్ట్రాల ప్రయత్నాలు.. గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు ప్రణాళికలు
దేశంలో కరోనా మహమ్మారి ప్రతాపానికి.. అన్ని రాష్ట్రాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్నాయి. రోజు రోజుకూ పరిస్థితి మరింత చేజారిపోతోంది.
Vaccine Global Tenders: దేశంలో కరోనా మహమ్మారి ప్రతాపానికి.. అన్ని రాష్ట్రాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్నాయి. రోజు రోజుకూ పరిస్థితి మరింత చేజారిపోతోంది. రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు సరిపోవడం లేదు. ఆక్సిజన్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వ్యాక్సిన్ కొరతలు తీవ్రంగా వేధిస్తున్నాయి.
కేంద్రం నుంచి సరిపడా డోసులు రావడం లేదు. మొదటి డోసు తీసుకుని రెండో డోసు కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో రాష్ట్రాలే ముందడుగు వేసి.. గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్నాటక, ఒడిశా, యూపీ, మహారాష్ట్ర గ్లోబల్ టెండర్లు పిలుస్తామని ఇప్పటికే ప్రకటించాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్లోబల్ టెండర్లు పిలిస్తే అంతర్జాతీయ సంస్థలన్నీ పాల్గొనే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. తమ వ్యాక్సిన్ ధరలను టెండర్లలో ప్రకటిస్తాయి టీకా కంపెనీలు. ధర, వ్యాక్సిన్ లభ్యత, స్టోరేజి విధానాలు, మౌలిక వసతులను బేరీజు వేసుకుని టీకా కొనుగోలుపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటాయి. గ్లోబల్ టెండర్లతో మరికొన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి.
ఈ క్రమంలో వ్యాక్సిన్ ఫార్ములాను మరికొన్ని కంపెనీలకు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కేవలం రెండు కంపెనీల్లోనే వ్యాక్సిన్ తయారు కావడంతో.. డిమాండ్‌కు సరిపడా టీకాలు అందడం లేదని అభిప్రాయపడ్డారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ అంశంలో నిర్ణయం తీసుకుని.. ఫార్ములాను ఇతర సంస్థలకు కూడా బదిలీ చేయాలంటూ కేంద్రానికి సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు.
దేశంలో ఇప్పటి వరకు 3 వ్యాక్సిన్ల వినియోగానికి మాత్రమే డీసీజీఐ అనుమతి తెలిపింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌తో పాటు గత నెలలో స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌కు అనుమతిచ్చింది కేంద్రం. వీటితో పాటు అమెరికా, యూకే, యురోపియన్ యూనియన్, జపాన్ దేశాల్లో అనుమతులు పొందిన వ్యాక్సిన్లకు ఫాస్ట్-ట్రాక్ అనుమతులు ఇచ్చేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది.
విదేశీ వ్యాక్సిన్లు తీసుకున్న మొదటి 100 మందిని 7 రోజులు పరిశీలించి, ఆ తర్వాత పూర్తి స్థాయి వినియోగానికి అనుమతిస్తామని వెల్లడించింది. MRNA టెక్నాలజీ ఉన్న విదేశీ వ్యాక్సిన్లకు.. దేశంలో కొన్ని ప్రతికూలతలు ఉన్నట్టు తేలింది. మరోవైపు గ్రామీణ ప్రాంతాలకు వ్యాక్సిన్ సరఫరా చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిర్ధిష్ట ఉష్ణోగ్రతలోనే వ్యాక్సిన్ తరలించాల్సి ఉంటుంది. అయితే దేశంలో తగినన్ని మౌళిక సమదుపాయాలు లేకపోవడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిస్తోంది.
భారత్‌లో మరికొన్ని వ్యాక్సిన్లు వివిధ దశల్లో క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటున్నాయి. ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ దశలో జైకోవ్-డీ వ్యాక్సిన్.. ఫేజ్-2 దశలో బయోలాజికల్-ఈ కి చెందిన కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయి. ఫేజ్-1 దశలో బీబీవీ-154 ముక్కు ద్వారా అందించే వ్యాక్సిన్.. ఫేజ్-2, ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ దశలో కోవోవాక్స్ టీకాలు ఉన్నాయి.
Read Also… Telangana Lockdown: ఈ-పాస్ ఉంటేనే రవాణాకు అనుమతి.. ఎలా తీసుకోవాలో తెలుసా..? వివరాలు..