AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bonalu – Bakrid Festivals: పశు రవాణాపై తెలంగాణ డీజీపీ కీలక ఆదేశాలు

బోనాలు, బక్రీద్ పండుగలను ప్రశాంతంగా నిర్వహించాలని తెలంగాణ డి.జి.పి M. మహేందర్ రెడ్డి చెప్పారు. సరైన అనుమతి పత్రాలు ఉంటేనే పశు రవాణాకు అనుమతులు ఉంటాయని..

Bonalu - Bakrid Festivals: పశు రవాణాపై తెలంగాణ డీజీపీ కీలక ఆదేశాలు
Ts Dgp
Venkata Narayana
|

Updated on: Jul 05, 2021 | 6:21 PM

Share

Bonalu – Bakrid: బోనాలు, బక్రీద్ పండుగలను ప్రశాంతంగా నిర్వహించాలని తెలంగాణ డి.జి.పి M. మహేందర్ రెడ్డి చెప్పారు. సరైన అనుమతి పత్రాలు ఉంటేనే పశు రవాణాకు అనుమతులు ఉంటాయని ఆయన వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా త్వరలో బక్రీద్, బోనాలు తదితర పండుగలను ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా, శాంతియుతంగా జరిగే విధంగా తగు చర్యలు చేపట్టాలని డి.జి.పి మహేందర్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. త్వరలో జరుగనున్న బక్రీద్, బోనాల పండుగల నిర్వహణపై హైదరాబాద్ లోని డిజిపి కార్యాలయం నుండి పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, పశు సంవర్ధక శాఖ అధికారులతో డీజీపీ మహేందర్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర లు నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అడిషనల్ డీజీ జితేందర్, రేంజ్ ఐ.జి. లు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, ఇంటలిజెన్స్ ఐజి ప్రభాకర్ రావు, పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. లక్ష్మా రెడ్డి లు కూడా పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ పలు అంశాలపై మాట్లాడారు. కొవిడ్ కారణంగా గత సంవత్సరంన్నర కాలంగా రాష్ట్రంలో ప్రధాన పండుగల నిర్వహణ జరగలేదని, లాక్ డౌన్ పూర్తిగా సడలించిన నేపథ్యంలో తిరిగి ఈ పండుగల నిర్వహణ పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ నెలలో గోల్కొండ బోనాలు, బక్రీద్ పండుగ, ఉజ్జాయిని మహంకాళి బోనాలు, వచ్చే నెల పాత బస్తీ బోనాలు జరుగనున్నాయని డిజిపి చెప్పారు.

బోనాలు, బక్రీద్ రెండు పండుగలు ఒకే సారి వస్తున్నందున ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అప్రమత్తతతో ఉండాలని పోలీసు అధికారులను మహేందర్ రెడ్డి ఆదేశించారు. ప్రధానంగా బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల రవాణా విషయంలో అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఆవులు, దూడలను రవాణా చేసేవారిపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను డి.జి.పి ఆదేశించారు. పశువులను రవాణాచేసే ప్రతి వాహనానికి తగు నిర్థారిత ప్రమాణిక పత్రాలు (వాలిడ్ డాక్యుమెంట్స్) ఉండాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో పోలీసు, పశుసంవర్థక శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

పశు రవాణాకు సంబంధించి ప్రతి జిల్లా, ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయాలని డిజిపి సూచించారు. ఇతర రాష్ట్రాల నుండి రవాణా అయ్యే పశువుల విషయంలోనూ నియమ, నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. పశుసంవర్ధక శాఖతో సమన్వయం చేసుకుంటూ గోవుల అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. సరైన పత్రాలు వారి వెంట ఉన్నాయనే విషయాన్ని పరిశీలించి అనుమతించాలని అన్నారు. జిల్లాల సరిహద్దులు, జిల్లా కేంద్రాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని తెలిపారు.

పండుగల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషాలు, రెచ్చగొట్టే పోస్టింగులు పెట్టే వారిని గుర్తించి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిజిపి ఆదేశించారు. ఈ సందర్బంగా పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర మాట్లాడుతూ…ప్రతి చెక్ పోస్ట్ దగ్గర వెటర్నరి అధికారులను ప్రత్యేకంగా నియమిస్తున్నట్లు తెలిపారు. పశువుల రవాణాలో ఆవులు, లేగదూడలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. పశువులను రవాణా చేసే వాహనాల్లో తగు స్థలం, మంచినీటి వసతి, ఫస్ట్ ఎయిడ్ సౌకర్యాలు ఉండాలని పేర్కొన్నారు.

ముఖ్యంగా బోనాల పండుగలలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చే పరిస్థితుల నేపధ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని డిజిపి పోలీస్ అధికారులను అదేశించారు.

Read also:  JC comment : జేసీ కొత్త యాంగిల్ : వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిని దారుణంగా తిడుతుంటే.. ఏపీ మంత్రులు గాజులు తొడుక్కున్నారా?