Telangana: తెలంగాణ చరిత్రలో తొలిసారి.. వన దేవతల సాక్షిగా సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్..
దశాబ్దాల సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ, సచివాలయపు గోడల మధ్య జరగాల్సిన కేబినెట్ భేటీ.. నేడు వనదేవతలు కొలువైన మేడారం గడ్డపై జరగనుంది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, హైదరాబాద్ వెలుపల తొలిసారిగా జరుగుతున్న ఈ మేడారం కేబినెట్ సమావేశంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

జనవరి 18.. తెలంగాణ చరిత్రలో గుర్తుండిపోయే తేదీ ఇది. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం యావత్తూ మేడారంలో కొలువు దీరనుంది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో హైదరాబాద్ వెలుపల కేబినెట్ భేటీ జరగడం ఇదే ఫస్ట్‌టైమ్. మరి మేడారం కేబినెట్ సమావేశం ఏమేం తీర్మానాలు చెయ్యబోతున్నట్టు..? మిగతా భేటీలతో పోలిస్తే ఈ భేటీ ఎంత కీలకం కాబోతోంది..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణ సర్కార్ ఛలో మేడారం అంటోంది. వనదేవతల సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు హరిత హోటల్ వేదికగా కేబినెట్ కీలక సమావేశం జరగబోతోంది. సీఎం, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు.. మొత్తం కలిపి దాదాపు 3 వందల మంది బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగాయి. 90 శాతం మంది మంత్రులు గ్యారంటీగా హాజరుకానున్నారు..హరిత హోటల్ పరిసరాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మంత్రి సీతక్క శనివారం ఉదయం నుంచి ఇక్కడే మకాం వేసి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.
హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ జరగడం ఆనవాయితీ. ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ఒక మారుమూల గ్రామంలో క్యాబినెట్ కొలువు దీరడం.. ఒక చరిత్రాత్మకఘట్టం. పైగా జనవరి 28 నుంచి సమ్మక్క, సారలమ్మ జాతర జరగనున్న క్రమంలో మేడారంలోనే కేబినెట్ మీటింగ్ జరగాలని సీఎం ప్లాన్ చేయడంపై ఆసక్తి పెరిగింది. రైతు భరోసా, హ్యామ్ రోడ్ల నిర్మాణం లాంటి అనేక అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. మేడారంలో అభివృద్ధి కోసం మరిన్ని నిధులు ప్రకటిస్తారా..? లేక చరిత్రలో గుర్తుండిపోయేలా ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా? అని ప్రభుత్వ, ప్రభుత్వేతర వర్గాల్లో టాక్ నడుస్తోంది.
పైగా మరో నెలరోజుల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా టూర్‌తో సీఎం రేవంత్ ప్రచారం మొదలు పెట్టేశారు. పట్టణ ఓటరును ఫిదా చేయడం కోసం వరాలేమైనా ప్రకటించవచ్చని కూడా అంచనాలున్నాయి. క్యాబినెట్ సమావేశం తర్వాత కూడా మంత్రులతో కలిసి మరో రెండురోజులు మేడారంలోనే బస చేయనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. గద్దెల ప్రారంభం, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమ్మక్క సాక్షిగా సీఎం చెయ్యబోయే ప్రకటనపైనే తెలంగాణ అంతటా అంతులేని ఆసక్తి నెలకొంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
