Andhra Pradesh: అయ్యో పాపం.. పసిపిల్లల ఉసురు తీసిన పెద్దల కయ్యం..
నంద్యాల లలితా నగర్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి మల్లికా సుధా తన ఐదేళ్ల కుమారుడు ఇసాంత్ సాయి, ఏడు నెలల కుమార్తె పర్నికకు విషమిచ్చి, ఆపై తానూ ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో మృతి చెందింది. ఈ ఘటన అనంతరం భర్త ఉదయ్ కిరణ్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నంద్యాల పట్టణంలోని లలితా నగర్‌లో ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇద్దరు పిల్లకు విషం ఇచ్చి తల్లి ఉరేసుకొని అత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. గత ఇరవై రోజుల క్రితం జిల్లాలోని గడివేముల శివారులో ఓ తల్లి ఇద్దరు పిల్లలను కాల్వలో పడేసి అత్మహత్యకు పాల్పడిన ఘటన మరవక ముందే జిల్లాలో మరో ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు సంఘటనలలో కూడా కుటుంబ కలహాలే తల్లి, పిల్లలు మృతి చెందడానికి కారణం కావటం అందరినీ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. పోలీసులు మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు…
నంద్యాల ఎస్బీఐ కాలనికి చెందిన మల్లికా సుధాతో లలితా నగర్‌కు చెందిన ఉదయ్ కిరణ్‌తో ఏడేళ్ళ క్రితం వివాహం జరిపించారు. గత కొంతకాలంగా భార్య భర్తల మద్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి భార్య, భర్తల మద్య జరిగిన ఘర్షణలో తీవ్ర మనస్తాపం చెందింది. జీవితం పై విరక్తి చెందిన తల్లి మల్లికా సుధా పిల్లలను చంపి తాను మరణించాలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న పురుగుల మందును పిల్లలు ఇద్దరికి తాపించింది. తాను ఇంట్లోని ఫ్యాన్ కు ఉరేసుకొని అత్మహత్యకు ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న భర్త బంధువులు మృతురాలు బంధువులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వచ్చిన మృతురాలి తమ్ముడు కార్తీక్ తలుపులు పగలగొట్టి కొన ఊపిరితో ఉన్న సుధా మల్లికను ఐదేళ్ళ ఇసాంత్ సాయిని,ఏడునెలల పర్నికను హుటా హుటిన కారులో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ, దురదృష్టవశాత్తు, అసుపత్రికి తరలించే సమయానికి పిల్లలు ఇద్దరు మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న సుధా మల్లికను బ్రతికించడానికి డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించిన సుధా మల్లిక కోలుకోలేక మృతి చెందింది.
సమాచారం అందుకున్న టుటౌన్ సిఐ అస్రర్ భాషా లలితానగర్ లోని మృతురాలి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. సుధా మల్లిక మృతదేహాం పై పలు గాయాలను పోలీసులు గుర్తించారు. రెండు పురుగుల మందు డబ్బాలను పోలిసులు సీజ్ చేసి బాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోస్ట్ మార్టం గదికి తరలించారు. భర్త ఉదయ్ కిరణ్ ఘటన జరిగిన వెంటనే పరార్ అయ్యాడు. అత్మహత్యలకు కారణం అయిన ఉదయ్ కిరణ్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
గత నెల 29వ తేదీన గడివేముల మండలానికి చెందిన కుటుంబ కలహాల నేపధ్యంలో తల్లి లక్ష్మీ దేవి తన ఇద్దరు కూతుళ్లను ఎస్అర్బీసి కాల్వలో తోసి తాను అత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జరిగిన దాదాపు ఇరవై రోజుల్లో మరో ఘటన జిల్లాలో జరగడం తీవ్ర కలకలం రేపుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




