Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద మెగా సునామీ.. కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతున్న చిరంజీవి
రికార్డులు, బాక్సాఫీస్ కలెక్షన్లు, అవార్డులు క్రియేట్ చేయడం వాటిని బ్రేక్ చేయడం మెగాస్టార్‌కు వెన్నతోపెట్టిన విద్య. ఆయన సినిమా విడుదలవుతోందంటే చాలు అభిమానులకే కాదు బాక్సాఫీస్‌కు పండుగే అని చెప్పాలి. సంక్రాంతి కానుకగా విడుదలైన మన శంకరవర ప్రసాద్ గారు సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుని రికార్డులు క్రియేట్ చేస్తోంది.

సంక్రాంతి బరిలో ఎప్పుడు ఎవరున్నా, బాస్ వస్తే ఆ లెక్కలే వేరుగా ఉంటాయని మరోసారి నిరూపితమైంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతి ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSG) బాక్సాఫీస్ వద్ద రౌద్రం చూపిస్తోంది. కేవలం థియేటర్లలో నవ్వులు పూయించడమే కాదు, వసూళ్ల వేటలో దిగ్గజ చిత్రాల రికార్డులను సైతం బద్దలు కొడుతూ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా నెలకొల్పిన ఒక అరుదైన రికార్డ్ ఇప్పుడు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
RRR రికార్డు మటాష్..
సాధారణంగా భారీ ఓపెనింగ్స్ రావడం పెద్ద సినిమాలకు సహజమే. కానీ, ఐదో రోజు కూడా అదే జోరును ప్రదర్శించడం అనేది అసాధారణం. మన శంకర వరప్రసాద్ గారు చిత్రం తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ) ఐదో రోజు ఏకంగా రూ.14.70 కోట్ల షేర్‌ను వసూలు చేసి సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. గతంలో ఈ రికార్డ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం RRR పేరిట ఉండేది. ఆ సినిమా ఐదో రోజు రూ.13 కోట్ల షేర్‌ను సాధించగా, ఇప్పుడు మెగాస్టార్ సినిమా ఒక కోటి రూపాయల మార్జిన్‌తో ఆ రికార్డును అధిగమించి, ఐదో రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది.

Msvg1
బుకింగ్స్‌లో బాస్ జోరు..
ఈ సినిమా క్రేజ్ ఎంతలా ఉందో చెప్పడానికి టికెట్ బుకింగ్స్ ఒక నిదర్శనం. ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మై షోలో కేవలం ఐదు రోజుల్లోనే 2.5 మిలియన్ల టికెట్లు అమ్ముడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల విషయానికి వస్తే, ఐదు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం, ప్రస్తుతం రూ.226 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా వింటేజ్ చిరంజీవిని చూస్తున్నట్లు ఉందని ఫ్యాన్స్ ఖుషీ అవుతుంటే, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తోంది.
సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ కారణంగా సెకండ్ వీకెండ్‌లో కూడా వసూళ్లు స్టడీగా ఉండే అవకాశం ఉంది. సంక్రాంతి సెలవులు ముగిసినా, ఫ్యామిలీ ఆడియన్స్ ఫుట్‌ఫాల్స్ తగ్గకపోవడం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ వీకెండ్‌తో కలెక్షన్లు మరింత పికప్ అవుతాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి మెగాస్టార్ చరిష్మాకు అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ తోడవ్వడంతో, ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజేతగా నిలిచింది.
