AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచాన్ని భయపెడుతోన్న కరోనా సెకండ్‌వేవ్‌!

కరోనావైరస్‌ మన మీద పగబట్టినట్టుంది.. ఇప్పటికే సమస్త దేశాలను వణికిస్తూ .. మనుషుల ప్రాణాలు తీస్తూ ఆగమాగం చేస్తున్న కరోనా ఇప్పుడు శరవేగంగా సెకండ్‌ వేవ్‌కు సంసిద్ధమవుతున్నట్టుగా వస్తున్న సంకేతాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి..

ప్రపంచాన్ని భయపెడుతోన్న కరోనా సెకండ్‌వేవ్‌!
Rajesh Sharma
|

Updated on: Jun 16, 2020 | 1:12 PM

Share

కరోనావైరస్‌ మన మీద పగబట్టినట్టుంది.. ఇప్పటికే సమస్త దేశాలను వణికిస్తూ .. మనుషుల ప్రాణాలు తీస్తూ ఆగమాగం చేస్తున్న కరోనా ఇప్పుడు శరవేగంగా సెకండ్‌ వేవ్‌కు సంసిద్ధమవుతున్నట్టుగా వస్తున్న సంకేతాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి.. మొన్నటి వరకు లాక్‌డౌన్‌తో కాసింత కట్టడి చేయగలిగామన్న ఒకింత ఊరట సెకండ్‌వేవ్‌తో చెదిరిపోనుంది.. ఇప్పటికే చైనాలోని బీజింగ్‌తో పాటు కొన్ని ప్రధాన నగరాలు మళ్లీ లాక్‌డౌన్‌ను విధించుకున్నాయి.. కారణం అక్కడ కరోనా మళ్లీ బుసలు కొడుతుండటమే! అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా స్టే ఎట్‌ హోమ్‌ నిబంధనలు సడలించడంతో పాజిటివ్‌ కేసులు ఒక్కసారిగా పెరగడం మొదలు పెట్టాయి.. దీని ప్రభావం కచ్చితంగా స్టాక్‌మార్కెట్లపై పడుతుంది.. పర్యవసానంగా ఆర్ధిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ఆర్ధికవ్యవస్థ దెబ్బతింటే ఉద్యోగాలకు ఎసరు వచ్చే ప్రమాదమూ ఉంది..

మనదేశంలో కూడా లాక్‌డౌన్‌ సమయంలో కరోనాను కాసింత కట్టడి చేయగలిగాం.. పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా తగ్గాయి.. ఎప్పుడైతే లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించారో అప్పట్నుంచి పాజిటివ్‌ కేసులు పెరగడం మొదలయ్యాయి. నిజంగానే ఇదో విషమ పరీక్ష.. రోజురోజుకీ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో మరోసారి లాక్‌డౌన్‌ను విధించింది.. విధించాల్సిన పరిస్థితి తలెత్తింది.. అలాగని దేశమంతటా లాక్‌డౌన్‌ను విధించే పరిస్థితి ఇప్పుడు లేదు.. ఇప్పటికే చిన్నచిన్న వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.. ఆర్ధిక పరిస్థితి తలకిందులయ్యింది… నిజంగానే ప్రపంచం ఇప్పుడు గడ్డు పరిస్థితుల్లో పడింది..

కరోనా వైరస్‌ అంటుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలోకి వెళుతోంది ప్రపంచం. ఏ ప్రమాదకరమైన వ్యాధి అయినా రెండో సారి ప్రబలినప్పుడే భయంకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయన్నది నిపుణులు చెబుతున్న మాట! గతంలో జరిగింది కూడా ఇదే.. సాధారణంగా కొత్తరకం వైరస్‌లు మానవులకు అంటినప్పుడు వాటిని ఎదుర్కోగల రోగనిరోధకశక్తి శరీరంలో ఉండదు.. మనుషులు పిట్టల్లా రాలిపోతారు.. లక్షలాది మంది ఉసురు తీసుకుంటే కానీ వైరస్‌లు శాంతించవు..

స్వైన్‌ఫ్లూ, స్పానిష్‌ ఫ్లూలు ప్రపంచాన్ని కమ్ముకున్నప్పుడు ఇదే జరిగింది. మొదటిసారి ఈ రోగాలు వ్యాపించినప్పుడు పెద్దగా నష్టమేమీ జరగలేదు.. ఇలాంటి వైరస్‌లు విజృంభిస్తున్న విషయాన్ని గుర్తించి భౌతికదూరాన్ని పాటించడం మొదలుపెడతాం.. కొన్ని ఆంక్షలను పెట్టుకుంటాం. అలా వైరస్‌ వ్యాప్తిని నిరోధించగలుగుతాం.. ఎప్పుడైతే లాక్‌డౌన్‌ నిబంధనలను తొలగించి కాసింత నిర్లక్షంగా వ్యవహరించడం మొదలు పెడతామో అప్పుడు వైరస్‌ విజృంభణ మళ్లీ మొదలవుతుంది.. ఈసారి మాత్రం చాలా స్వైరవిహారం చేస్తుంది.. వాతావరణ మార్పులు వైరస్‌కు కలిసొస్తాయి.. దాంతో పాటు అవి మరింత బలోపేతమవుతాయి.. చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి..

1918లో స్పానిష్‌ ఫ్లూ ప్రపంచాన్ని అంటుకున్నప్పుడు ఇదే జరిగింది.. మొదటిసారి వ్యాపించిన దాని కంటే రెండోసారి విస్తరించినప్పుడే ఎక్కువ మందిని పొట్టనపెట్టుకుంది.. సెకండ్‌వేవ్‌లో కరోనా వైరస్‌ కూడా ఎక్కువ మంది బలితీసుకునే అవకాశం ఉందనేది పరిశోధకుల భయం. కరోనా వైరస్‌ రెండోసారి విజృంభించవచ్చని ఊరికే చెప్పడం లేదు.. రానున్న రోజుల్లో నిజంగా జరగబోయేది అదేనంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.. జాగ్రత్త పడాల్సిందిగా సూచిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనేక దేశాలు కరోనా కాటుతో విలవిలలాడుతున్నాయి. చాలా దేశాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సెకండ్‌ వేవ్‌ ప్రారంభమయ్యిందనడానికి ఇదే నిదర్శనమంటున్నారు వైద్య నిపుణులు. రెండోసారి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందితే మాత్రం గ్లోబల్‌ జీడీపీ 7.5 శాతం పతనమవుతుందని ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ కో ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌- ఓఈసీడీ ఇప్పటికే ఓ హెచ్చరిక చేసింది. అదే జరిగితే సుమారు నాలుగు కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారు.. రోడ్డున పడతారు.. కరోనా వైరస్‌ కనికరించి తగ్గిపోయినా ప్రపంచ జీడీపీ ఆరు శాతం మేర తగ్గే ఛాన్సుంది.. ఏ రకంగా చూసినా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తలకిందులు కావడం ఖాయంగా కనిపిస్తోంది.. దీన్నుంచి బయటపడటానికి కొన్నేళ్లు పట్టవచ్చు.