పైసల కోసం పాడెక్కించాడు..
నాలుగు వేల రూపాయల కోసం స్నేహితున్ని హతమార్చాడో దుష్టుడు. కల్లు తాగిస్తానంటూ పిలిచి ఆ తర్వాత దారుణంగా హత్య చేశాడు.
ఓ వ్యక్తి వద్ద ఉన్న డబ్బులపై కన్నుపడింది. ఎలాగైనా కాజేయాలని ఫ్లాన్ చేశాడు. మంచి కల్లు తాగిస్తానూ రమ్మంటూ తీసుకెళ్లి హతమార్చాడు. మూడో కన్ను సాయంతో పోలీసులు గుట్టురట్టు చేశారు. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హిమాయత్‌సాగర్ సమీపంలో ఈనెల 6న జరిగిన హెచ్‌సీయూ ఉద్యోగి హత్యకేసును పోలీసులు ఛేదించారు. గండిపేట మండలం హైదర్ షా కోటకోట్ లో నివాసం ఉండే సత్యనారాయణ(56) హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. కల్లు తాగే అలవాటు ఉన్న సత్యనారాయణ జూన్ 6వ తేదీన ఉదయం బండ్లగూడలోని ఓ కంపౌండ్ వద్దకు వెళ్లాడు. ఇదే సమయంలో ఖలిస్ఖాన్‌దర్గాకు చెందిన మహ్మద్ అజీమ్(32)తో పరిచయం ఏర్పడింది. దీంతో సత్యనారాయణ వద్ద డబ్బున్నట్లు గమనించిన అజీమ్ మాటల్లో మాటలు కలిపాడు. నగర శివారులో మంచి కల్లు దొరుకుతుందని తాగుదామని నమ్మించి స్కూటీపై హిమాయత్‌సాగర్ చెరువు దగ్గరకు తీసుకువెళ్లాడు. అక్కడ సత్యనారాయణను కింద పడేసి తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. పర్సులోని రూ.4వేలు దొంగలించిన అజీమ్ సత్యనారాయణ స్కూటీని కూడా తీసుకొని పరారయ్యాడు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ల ఆధారంగా కేసును చేధించారు. అజీమ్‌ను అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. సత్యనారాయణ వద్ద ఉన్న డబ్బులను దొంగిలించేందుకే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అజీమ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు.