Papaya in Winter: చలి కాలంలో బొప్పాయి తింటే ఏమవుతుందో తెలుసా?
బొప్పాయి దాదాపు అందరికీ మేలు చేసే పండు. జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి బరువు నియంత్రణ వరకు బొప్పాయి ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఎముకలు కొరికే శీతాకాలంలో కూడా బొప్పాయి తినడం సురక్షితమేనా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది..

శీతాకాలంలో బొప్పాయి తినడం వల్ల దాని చల్లబరిచే స్వభావం వల్ల శరీరం ఇంకా చల్లబడుతుందని చాలా మంది అనుకుంటారు. అయితే పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు సరైన నియమాలను పాటిస్తే ఈ శీతాకాలంలో కూడా బొప్పాయి ఎంత మేలు చేస్తుంది. ఢిల్లీలోని GTB హాస్పిటల్ మాజీ పోషకాహార నిపుణురాలు డాక్టర్ అనామిక గౌర్ ఏం చెబుతున్నారంటే.. బొప్పాయి స్వభావం రిత్య ఒంటికి చలువ అయినప్పటికీ దానిని ఏ సీజన్‌లోనైనా తినవచ్చు.
శీతాకాలంలో బొప్పాయి ఎందుకు తినాలి?
శీతాకాలంలో శారీరక శ్రమ సాధారణంగా తగ్గుతుందని డాక్టర్ అనామిక అన్నారు. ఫలితంగా మలబద్ధకం, ఆమ్లత్వం, అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి. బొప్పాయిలో ఉండే ‘పపైన్’ అనే ఎంజైమ్ జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ప్రేగులను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనితో పాటు బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ-ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శీతాకాలంలో జలుబు, ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.
బరువు నియంత్రణలో సమర్థత
శీతాకాలంలో రుచికరమైన, కేలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలనే ధోరణి సాధారణంగా పెరుగుతుంది. బొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది అధిక సమయం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా తరచుగా ఆకలి అనిపించదు. ఇది పరోక్షంగా బరువు నియంత్రణలో సహాయపడుతుంది.
ఎప్పుడు, ఎంత తినాలి?
శీతాకాలంలో బొప్పాయి తినేటప్పుడు పరిమాణంపై శ్రద్ధ వహించడం ముఖ్యం. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శీతాకాలంలో ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజుకు 5 నుండి 6 ముక్కలు అంటే గరిష్టంగా 200 గ్రాముల బొప్పాయి తినవచ్చు.
శీతాకాలంలో బొప్పాయి తినేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు
బొప్పాయి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ శీతాకాలంలో కొన్ని విషయాలను పాటించడం ముఖ్యం. అవేంటంటే..
రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన వెంటనే చల్లగా ఉండే బొప్పాయిని తినవద్దు. తినడానికి ముందు కొద్దిసేపు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. అలాగే ఇప్పటికే తీవ్రమైన జలుబు, దగ్గు ఉంటేబొప్పాయిని నివారించడం మంచిది. మీరు తినాలనుకుంటే మాత్రం కాస్త ముందుగా కొద్దిగా గోరువెచ్చని నీళ్లు తాగి ఆపై బొప్పాయి తినవచ్చు. బొప్పాయి మంచిదే గానీ శీతాకాలంలో కాస్త మితంగా తినడమే మంచిది. ముఖ్యంగా శీతాకాలం ఆహారంలో బొప్పాయిని మితంగా చేర్చుకోవడం వల్ల చర్మం మెరుస్తూ ఉండటమే కాకుండా శరీరం లోపలి నుంచి చురుగ్గా ఉండేలా చేస్తుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




