Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో మాఫియా దందా? సీనియర్ ప్లేయరును చంపేస్తామని బెదిరింపులు
Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్‌లో మునుపెన్నడూ లేని విధంగా ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ బోర్డు తీరుకు వ్యతిరేకంగా గళం విప్పిన సీనియర్ క్రికెటర్ మహ్మద్ మిథున్‌కు ఏకంగా ప్రాణహాని తలపెడుతూ బెదిరింపులు రావడం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో సంచలనం రేపుతోంది.

Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్‌లో మునుపెన్నడూ లేని విధంగా ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ బోర్డు తీరుకు వ్యతిరేకంగా గళం విప్పిన సీనియర్ క్రికెటర్ మహ్మద్ మిథున్‌కు ఏకంగా ప్రాణహాని తలపెడుతూ బెదిరింపులు రావడం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో సంచలనం రేపుతోంది. కేవలం ఆటగాళ్ల హక్కుల గురించి మాట్లాడినందుకు ఒక క్రికెటర్‌ను ఇలా వేధించడం ఆ దేశ క్రికెట్ బోర్డులోని అంతర్గత విభేదాలకు అద్దం పడుతోంది. బంగ్లాదేశ్ క్రికెటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్న మహ్మద్ మిథున్, గత కొద్ది రోజులుగా బోర్డు అధికారుల అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ వాయిస్ నోట్స్ రూపంలో బెదిరింపులు వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “నా జీవితంలో ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు. నేను దేశానికి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు, కేవలం ఆటగాళ్ల ప్రయోజనాల కోసమే పోరాడుతున్నాను. ఇప్పుడు గుర్తు తెలియని నంబర్ల నుండి కాల్స్ వస్తుంటే భయంతో లిఫ్ట్ చేయడం లేదు” అని మిథున్ వాపోయారు.
అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే?
ఈ గొడవకు ప్రధాన కారణం బంగ్లాదేశ్ బోర్డు టాప్ అఫీషియల్ నజ్ముల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలే. ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను పంపేసిన విషయంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య సయోధ్య కుదర్చాలని మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ కోరారు. దీనిపై మండిపడ్డ నజ్ముల్ ఇస్లాం.. తమీమ్ ఇక్బాల్‌ను ఏకంగా భారత ఏజెంట్ అంటూ సంబోధించారు. ఒక దిగ్గజ క్రికెటర్‌ను అలా కించపరచడాన్ని సహించలేక మిథున్ నేతృత్వంలో క్రికెటర్లంతా కలిసి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లను కూడా బహిష్కరించారు. ఈ నిరసనల కారణంగా పలు లీగ్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి.
బోర్డు సీరియస్.. దర్యాప్తుకు ఆదేశం
క్రికెటర్ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు దిద్దుబాటు చర్యలకు దిగింది. మిథున్‌కు వచ్చిన ప్రాణహాని బెదిరింపులపై బోర్డు సెక్యూరిటీ టీమ్ విచారణ జరుపుతుందని బీసీబీ డైరెక్టర్ ఇఫ్తికార్ తెలిపారు. అలాగే తమీమ్ ఇక్బాల్‌ను ఇండియన్ ఏజెంట్ అని విమర్శించిన అధికారి నజ్ముల్ ఇస్లాం వ్యాఖ్యలపై కూడా బోర్డు సమీక్షిస్తోంది. బోర్డు ప్రెసిడెంట్ ఇప్పటికే ఆ సదరు అధికారితో మాట్లాడారని సమాచారం. ఏది ఏమైనా, రాజకీయాల కారణంగా బంగ్లాదేశ్ క్రికెట్ ఇప్పుడు రోడ్డున పడిందని అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
