Stock Market: వార్ ఎఫెక్ట్.. భారీగా కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో భారత స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ దేశీయ సూచీలపై పడింది. పశ్చిమాసియాలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్లకుపైగా పతనమైంది. దీంతో ఇన్వెస్టర్లు నష్టాలను మూటకట్టుకుంటున్నారు.

ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లు కుల్పకూలాయి. మార్కెట్లు ఉదయం ప్రారంభం కాగానే.. జెడ్ స్పీడ్‌లో సూచీలు పతనమయ్యాయి. ఇరాన్, ఇజ్రాయెల్‌లోనే కాకుండా దుబాయ్, ఖతార్ లాంటి దేశాల్లో కూడా ఈ యుద్దంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడంతో అస్థిరతతో కొనసాగుతున్నాయి. భారత సూచీలపై వార్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉదయం స్టాక్ మార్కెట్లు ప్రారంభం సమయానికే సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్లకుపైగా కుప్పకూలింది. సెన్సెక్స్ 1004 పాయింట్లు కోల్పోయి 80,294 వద్ద ట్రేడవుతోంది.
తగ్గిన రూపాయి విలువ
ఇక నిఫ్టీ ప్రారంభంతోనే 283 పాయింట్లు నష్టపోయి 24,886 వద్ద కొనసాగుతోంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే 24 పైసలు తగ్గి 91.32 వద్ద కొనసాగుతోంది. ఇక ప్రీ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 2700, నిఫ్టీ 530 పాయింట్లు క్షీణించడంతో ఇన్వెస్టర్లు ఆందోళన పడ్డారు. ఆ తర్వాత కాస్త కోలుకోగా.. భారీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముడి చమురు ధరలు భగ్గుమనడంతో వాటి షేర్లు పడిపోయాయి. ముడి చమురు ధర 80 డాలర్లపైనే ప్రస్తుతం ట్రేడవుతోంది. క్రిందటి సెషన్‌లో ఇన్వెస్టర్ల నుంచి అమ్మకాల జోరు మొదలైంది. దీంతో నేటి సెషన్‌పై ఇది తీవ్ర ప్రభావం చూపింది. అటు ఆదివారం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందడంతో ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరిగాయి. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. దుబాయ్, ఖతార్ లాంటి దేశాలపై ప్రతీకార దాడులకు దిగింది. ఈ క్రమంలో భారత స్టాక్ మార్కెట్లపై కూడా ప్రభావం పడింది.
