AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జార్జియాలో 10 రోజులు కార్ డ్రైవర్‌గా పని చేసిన వ్యక్తి కోసం.. తెలుగు హీరోయిన్ చేసిన పనికి..

శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఓ కార్కక్రమంలో నటి అనుష్క మనసు ఎంత గొప్పదో తెలిపే ఓ సంఘటన గురించి తెలిపారు. ఆమె కుడి చేత్తో సాయం చేసి ఎడమ చేతికి కూడా తెలియనివ్వదని అన్నారు. అలాంటి పర్సన్స్ చాలా అరుదుగా ఉంటారని ఆయన ప్రశంసించారు.

జార్జియాలో 10 రోజులు కార్ డ్రైవర్‌గా పని చేసిన వ్యక్తి కోసం.. తెలుగు హీరోయిన్ చేసిన పనికి..
Heroine
Ram Naramaneni
|

Updated on: Apr 16, 2026 | 5:02 PM

Share

అనుష్క శెట్టి గురించి ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అరుదైన విషయాలను వెల్లడించారు. అనుష్క ఎందరి జీవితాలలోనో మార్పు తీసుకొచ్చిందని చెబుతూనే, నిజానికి అనుష్క తన జీవితంలోనే ఎంతో మార్పును తెచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనుష్క మానవత్వం, నిరాడంబరతను చాటి చెప్పే ఒక మర్చిపోలేని సంఘటనను ఆయన పంచుకున్నారు. గతంలో ఒక వారం బ్రేక్ కోసం జార్జియా వెళ్లిన శ్యామ్ ప్రసాద్ రెడ్డికి అక్కడ జాజా అనే ఒక రష్యన్ డ్రైవర్ పరిచయమయ్యాడు. జాజా మొదట శ్యామ్ ప్రసాద్ రెడ్డిని.. ఇండియాలోని ఏ ప్రాంతం నుంచి వచ్చారు అని అడిగి.. హైదరాబాద్ అని చెప్పగానే అతని ముఖంలో సంతోషం కనిపించిందని ఆయన అన్నారు. “మీరు హైదరాబాద్‌లో ఏమి చేస్తారు?” అని అడిగినప్పుడు, “నేను సినిమాలు తీస్తాను” అని చెప్పగానే, జాజా ఆశ్చర్యపోయి, “మీకు స్వీటీ తెలుసా?” అని అడిగాడట.

ఒక రష్యన్, జార్జియాలో “స్వీటీ” గురించి అడగడం శ్యామ్ ప్రసాద్ రెడ్డిని విస్మయానికి గురి చేసింది. “మీరు అనుష్క గురించి మాట్లాడుతున్నారా?” అని ఆయన అడగగానే, “అవును, సినిమా నటి అనుష్క” అని జాజా చెప్పాడని, అప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి తనకు అనుష్క బాగా తెలుసు అని సమాధానం ఇచ్చారని వివరించారు. ఆ తర్వాత జాజా అనుష్క గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. అనుష్క ఒక తమిళ సినిమా షూటింగ్ కోసం రెండు, మూడు నెలల పాటు జార్జియాలో ఉన్నప్పుడు, జాజా ఆమెకు డ్రైవర్‌గా, కేర్ టేకర్‌గా పనిచేశాడట. మూడు వారాలు గడిచిన తర్వాత ఒక రోజు, జాజా బదులు కొత్త డ్రైవర్, కొత్త కారు కనిపించడంతో అనుష్క తన మేనేజర్‌ని పిలిచి జాజా ఎక్కడ అని అడిగారట. జాజా తన కారుకు ఫైనాన్షియల్ ఇన్‌స్టాల్‌మెంట్‌లు కట్టలేక, ఫైనాన్షియర్స్ కారును లాక్కుపోయారని, కారు లేకపోవడంతో పని కూడా కోల్పోయాడని మేనేజర్ చెప్పారట. ఇది విన్న అనుష్క బాధపడి, సాయంత్రం జాజాను తనను కలవమని చెప్పారట.

జాజా సాయంత్రం వచ్చాక, అనుష్క అతడిని ఒక షోరూమ్‌కి తీసుకెళ్లి, తన సొంత డబ్బులతో ఒక కొత్త కారును కొనిచ్చారని జాజా వెల్లడించాడు. ఆ రాత్రి జాజా, అతని భార్య, ఇద్దరు పిల్లలు, అతని తల్లి ఎంతో సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారని, అనుష్క తమ కుటుంబ సభ్యురాలిగా భావించారని శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ సంఘటన విన్నప్పుడు తాను ఆశ్చర్యపోయానని, ఎంతమంది ఇలాంటి గొప్ప పనులు చేస్తారని ఆయన ప్రశ్నించారు. జార్జియా నుంచి తిరిగి వచ్చేటప్పుడు, జాజా.. శ్యామ్ ప్రసాద్ రెడ్డికి తమ ఇంట్లో తయారుచేసిన వైన్ బాటిల్‌ను బహుమతిగా ఇచ్చి, “మీరు అనుష్క స్నేహితులు.. అందుకు ఇది ఇస్తున్నాను” అని చెప్పాడట. అనుష్కకు తాను స్నేహితుడినని తెలిసినందుకే జాజా తనతో అంత ఆత్మీయంగా ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన గురించి తాను అనుష్కతో ప్రస్తావించినప్పుడు, ఆమె కేవలం చిరునవ్వు నవ్వి ఊరుకున్నారని, దీని గురించి మాట్లాడలేదని శ్యామ్ ప్రసాద్ రెడ్డి వివరించారు.

అనుష్క వ్యక్తిత్వంలోని నిరాడంబరత, మంచి పనులు ఎవ్వరికీ తెలియకుండా చూసుకోవడం ఆమె గొప్పదనమని ఆయన ప్రశంసించారు. ఆమె ఒక స్నేహితురాలిగా నిజంగా అద్భుతమని, ఎల్లప్పుడూ ఇతరుల కష్టాలలో పాలుపంచుకోవడానికి, విజయాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉంటుందని ఆయన అన్నారు. అనుష్క శెట్టికి శుభప్రదమైన భవిష్యత్తు ఉండాలని, ఒక కుటుంబాన్ని ప్రారంభించాలని ఆయన ఆశీర్వదించారు. ఆమె మంచితనం, మానవత్వం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని ఆయన కోరుకున్నారు.

Also Read: నా భార్యకు అబార్షన్ అయినప్పుడు ఆ హీరో ఫోన్ చేసి చెప్పిన మాటకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. 

Follow Us