Parents Ablazed Daughter: రాయచోటిలో మరో పరువ హత్య.. ప్రేమించిన పాపానికి కూతురుపై ఘాతుకం.. చికిత్సపొందుతూ యువతి మృతి!
కడప జిల్లా రాయచోటిలో కుటుంబసభ్యుల ఘాతుకానికి గాయపడ్డ.. యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది.
RayachotiParents Ablazed Daughter: కడప జిల్లా రాయచోటిలో కుటుంబసభ్యుల ఘాతుకానికి గాయపడ్డ.. యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది. మేనమామ కుమారుడిని ప్రేమించిందని ఆగ్రహానికి గురైన అన్న.. ఈనెల 15న యువతిపై పెట్రోల్‌పోసి తగులబెట్టాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచింది.
ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని యువతి తెగేసి చెప్పడంపై తండ్రితో పాటు అన్న ఆగ్రహాం వ్యక్తం చేశారు. చేయి చేసుకోవడమే కాదు.. ఏకంగా పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటనలో ఇప్పటికే ఆ యువతి తల్లిదండ్రులతో పాటు సోదరుడు తాజుద్దీన్‌ను అరెస్టు చేసిన పోలీసులు జైలుకు కూడా తరలించారు.
వైఎస్సార్ కడప జిల్లా రాయచోటిలో.. తల్లిదండ్రుల పరువు అనే ఉన్మాదానికి మరో యువతి బలైంది. బంధవును ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని కుటుంబసభ్యులను ఒప్పించేందుకు ప్రయత్నించింది. ఆ మాటలు ఆమె సోదరుడిని బరితెగించేలా చేసింది. యువతిపై ఇంట్లో వారే పెట్రోల్ పోసి తగులబెట్టారు. యువతి తల్లిదండ్రులు ఈ అరచాకాన్ని దగ్గరుండి మరీ ప్రోత్సహించారు. మంగళవారం రాత్రి రాయచోటి పట్టణంలో ఈ ఘటన సంచలనం రేపింది.
రాయచోటి పట్టణం కొత్తపల్లెలో నివాసం ఉంటున్న పఠాన్ మహమ్మద్, మున్వర్ జాన్‌ల కుమార్తె తహసీన్‌కు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే, తల్లిదండ్రులు చూసిన పెళ్లి సంబంధాలను ఆమె తిరస్కరించింది. తాను ఇమ్రాన్ అనే యువకుడిని ప్రేమించానని.. అతడినే పెళ్లి చేసుకుంటానని కరాఖండిగా చెప్పేసింది. అంతే, కుటుంబ సభ్యుల్లో కోపం కట్టలు తెంచుకుంది. తాము సూచించిన యువకుడినే పెళ్లి చేసుకోవాలని గట్టిగా చెప్పారు.
తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చేసుకునేందుకు ఆమె ససేమిరా ఇంట్లో పెద్ద వాగ్వాదం జరిగింది. ఈ తరుణంలోనే విచక్షణ కోల్పోయిన సోదరుడు ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న తల్లిదండ్రులు కనీసం వారించలేదు. పైగా, కన్నకూతురు మంటల్లో కాలిపోతున్నా తల్లిదండ్రులు చూస్తూ నిలబడిపోయారు.
యువతి కేకలు విన్న ఆమె అక్క, స్థానికులు వచ్చి మంటలు ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడ్డ తహసీన్‌ను కడప రిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రిలో వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచింది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టిన యువతి అన్న పట్టన్ తాజుద్దీన్, తల్లి పట్టన్ మున్వార్ జహాన్, తండ్రి పట్టన్ మహమ్మద్ షరీఫ్‌లు ఇప్పటికే అరెస్టు చేసి కడప జైలుకు తరలించారు.