కాకరేపిన బాబు లేఖ.. మంత్రుల రివర్స్ అటాక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రాజకీయం మితిమీరుతోంది. పాలక ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయి మాటల యుద్ధానికి దారితీస్తుంది. పాలకుల వైఫల్యం అధికార పార్టీ నేతల నిర్లక్ష్యం కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోయిందని విపక్షనేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

కాకరేపిన బాబు లేఖ.. మంత్రుల రివర్స్ అటాక్
Rajesh Sharma

| Edited By: Anil kumar poka

Apr 28, 2020 | 1:28 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రాజకీయం మితిమీరుతోంది. పాలక ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయి మాటల యుద్ధానికి దారితీస్తుంది. పాలకుల వైఫల్యం అధికార పార్టీ నేతల నిర్లక్ష్యం కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోయిందని విపక్షనేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు లేఖపై మండిపడిన వైసీపీ నాయకులు.. పక్క రాష్ట్రంలో కూర్చున్న చంద్రబాబుకు ఏపీలో వాస్తవ పరిస్థితి తెలియదంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

మంగళవారం ఉదయం రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాసిన చంద్రబాబు.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్‌పై నిర్లక్ష్యపు కామెంట్లు చేసి ప్రజల్లో అయోమయాన్ని సృష్టించారని చంద్రబాబు ఆరోపించారు. దానికి తోడుగా వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు భౌతిక దూరం నిబంధనలను పక్కన పెట్టి మరీ.. ర్యాలీలు, ప్రారంభోత్సవాలు నిర్వహించి కరోనా వైరస్ మరింత ప్రబలడానికి కారకులయ్యారని ఆయన ఆరోపించారు. రాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోళ్లలో అక్రమాలకు ప్రభుత్వాధినేతలు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు.

చంద్రబాబు లేఖపై మండిపడిన వైసీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి.. విపక్షనేతపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రంలో కూర్చున్న చంద్రబాబుకు ఏపీలో వాస్తవ పరిస్థితులు తెలియని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు దిగజారిన వ్యాఖ్యలతో ప్రతిపక్ష నాయకుడి హోదాను కించపరుస్తూ ఉన్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరింత తీవ్రమైన పదజాలంతో చంద్రబాబుపై ధ్వజమెత్తారు. జాతీయ సగటుతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉందని, డెత్ డేట్ కూడా తక్కువగానే ఉందని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు గవర్నర్ బంగ్లాలో కరోనా వచ్చిందంటూ విమర్శలు చేస్తున్న చంద్రబాబుకు.. లండన్ రాజ కుటుంబీకులకు, ఏకంగా బ్రిటన్ ప్రధానమంత్రికి కరోనా వైరస్ సోకిన విషయం తెలియదా అని ప్రశ్నించారు అనిల్ కుమార్ యాదవ్. కరోనా వైరస్ పేదవారికి వస్తుంది.. గొప్ప వాళ్లకు రాదు అన్న నిబంధన ఏమీ లేదన్న విషయం చంద్రబాబుకు తెలియదా అని ఎద్దేవా చేశారు. ఏపీలో కేవలం 10 శాతం మండలాలు మాత్రమే రెడ్ జోన్‌లో ఉన్నాయని, దేశంలో అత్యధికంగా రోజుకు 7000 కరోనా వైరస్ పరీక్షలు చేస్తున్న రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకవైపు కరోనా వైరస్ కుదిపేస్తుంటే.. ఇంకోవైపు రాజకీయ పరమైన విమర్శలు, ఆరోపణలు రాష్ట్రాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో రాజకీయాలు పక్కనపెట్టి కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు పాలక-ప్రతిపక్షాలు ప్రయత్నం చేయాలని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu