AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఏడాది చివరికల్లా ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌..!

కరోనా నుంచి విముక్తి కలిగించేందుకు టీకా ఎప్పడొస్తుందా..? ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తుంది. మొదటి నుంచి వ్యాక్సిన్ తయారీలో తలమునకలైన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శుభవార్త తీసుకువచ్చింది.

ఈ ఏడాది చివరికల్లా ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌..!
Balaraju Goud
|

Updated on: Oct 04, 2020 | 10:55 AM

Share

కరోనా నుంచి విముక్తి కలిగించేందుకు టీకా ఎప్పడొస్తుందా..? ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తుంది. మొదటి నుంచి వ్యాక్సిన్ తయారీలో తలమునకలైన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శుభవార్త తీసుకువచ్చింది. ఈ యేడాది చివరి నాటికి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌కి అనుమతులొచ్చే అవకాశం ఉందని బ్రిటన్‌ మీడియా తెలిపింది. ఆరు నెలల్లోపు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రముఖ ఔషధ కంపెనీ ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రయోగాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ సత్పలితాలిస్తుండటంతో.. క్రిస్మస్‌నాటికి అనుమతులొచ్చే అవకాశం ఉందని మీడియా తెలిపింది. వ్యాక్సిన్‌కి అనుమతులొచ్చిన తరువాత మొదటగా వృద్ధులకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆరు నెలల లోపు అమలు చేయనున్నట్లు ఆ నివేదికలో పేర్కొంది.

మరోవైపు, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆరు నెలల్లోపు, లేదా అంతకంటే ముందే ప్రారంభించడానికి ప్రయత్నించేలా చూస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొదటిగా 65 సంవత్సరాలు పైబడిన వారికి, తరువాత హైరిస్క్, ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న యువతరానికి ఈ వ్యాక్సిన్‌ని ఇస్తామని వివరించింది. ఆ తర్వాత క్రమంలో 50 ఏళ్ళు పైబడిన వారికీ, అలాగే యువతకు వ్యాక్సిన్‌ ఇస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బ్రిటిష్‌ ప్రభుత్వం పది కోట్ల ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సి న్‌ డోస్‌ల కొనుగోలుకి ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు.

ఇక, రష్యాకు చెందిన స్పుత్నిక్‌–వీ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాను కోరింది. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ను భారత్‌లో ప్రయోగించేందుకు, ఉత్పత్తి చేసేందుకు రెడ్డీస్‌ ల్యాబొరేటరీ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇదిలావుంటే, కోవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన వారి శరీరంలో కోవిడ్‌ నుంచి కోలుకున్న 90 రోజుల తర్వాత కూడా వైరస్‌ ఉంటుందని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రవెన్షన్‌ ఇన్‌ అట్లాంటా అనే సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని వివిధ ఆసుపత్రుల నుంచి రోగుల సమాచారాన్ని సేకరించి సంస్థ విశ్లేషించి చూడగా ఈ విషయం బయటపడిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. వారి ద్వారా ఈ వైరస్‌ అత్యంత వేగంగా ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నదని ఆ అధ్యయనంలో వెల్లడైందని వివరించారు.