కూరగాయలు లేకపోయినా పర్లేదు! అన్నం, చపాతీల్లోకి నోరూరించే వెల్లుల్లి మసాలా కారం.. ఎలా చేయాలంటే?
ఇంట్లో వంట చేయడానికి కూరగాయలు లేనప్పుడు లేదా వేడివేడి అన్నం, చపాతీల్లోకి నోటికి కారంగా, కమ్మగా ఏదైనా తినాలనిపించినప్పుడు వెల్లుల్లి మసాలా కారం అద్భుతమైన ఎంపిక. పొట్టు తీసిన వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి, నూనెలో తాలింపు గింజలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పెరుగు లేదా చింతపండు రసం వేసి చిన్న మంటపై ఉడికించడం ద్వారా ఈ రుచికరమైన వెల్లుల్లి గ్రేవీ కారం తయారవుతుంది. తక్కువ సమయంలోనే తయారయ్యే ఈ మసాలా కారం నోటికి ఎంతో రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

రోజూ ఒకే రకమైన కూరలు తిని బోర్ కొట్టినప్పుడు లేదా ఇంట్లో వంట చేయడానికి కూరగాయలు ఏమీ లేనప్పుడు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాం. అలాంటప్పుడు తక్కువ సమయంలో, ఇంట్లో ఉండే సాధారన దినుసులతో నోటికి ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి మసాలా కారం తయారు చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ కారంతో తింటే కడుపు నిండా భోజనం చేయవచ్చు.
కావాల్సిన పదార్థాలు:
పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు: 20
నూనె: 2 టేబుల్ స్పూన్లు
మినప్పప్పు, శనగపప్పు: టీస్పూన్ చొప్పున
ఆవాలు, జీలకర్ర: అర టీస్పూన్ చొప్పున
కరివేపాకు: 2 రెమ్మలు
పెరుగు: అర కప్పు లేదా చింతపండు రసం
పసుపు: పావు టీస్పూన్
కారము, ఉప్పు: రుచికి సరిపడా
ధనియాల పొడి: 1 టీస్పూన్
తయారుచేసే విధానం:
ముందుగా పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను రోటిలో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి లేదా మిక్సీలో ఒక్క రౌండ్ గ్రైండ్ చేసుకోవచ్చు. స్టవ్‌పై కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. అవి వేగాక కరివేపాకు, దంచిన వెల్లుల్లి వేసి లో-ఫ్లేమ్‌లో పచ్చివాసన పోయేవరకు వేయించాలి. వెల్లుల్లి దోరగా వేగిన తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. మసాలాలు మాడిపోకుండా ఉండేందుకు ఒక టీ గ్లాసు నీళ్లు పోసి 2 నిమిషాలు ఉడికించాలి.
ఇప్పుడు అందులో అర కప్పు పెరుగు లేదా చిక్కటి చింతపండు రసం వేసి గ్రేవీ అంతా బాగా కలిసేలా మిక్స్ చేయాలి. మంటను లో-ఫ్లేమ్‌లోనే ఉంచి 3 నిమిషాల పాటు నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే! ఎంతో ఘుమఘుమలాడే, కారంగా ఉండే వెల్లుల్లి మసాలా కారం సిద్ధం. దీనిని అన్నం, చపాతీ, లేదా దోశల్లోకి కూడా నంజుకుని తినవచ్చు. నోటికి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.




