చేపలు కాదు.. ప్లాస్టిక్ తింటున్నాం! అధ్యయనంలో బయటపడ్డ భయంకర నిజాలు
విశాఖ తీరంలో పట్టిన నెత్తళ్లు, సావిడాయి చేపల్లో మైక్రోప్లాస్టిక్ కణాలు గుర్తించినట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిశోధనలో వెల్లడైంది. జీర్ణాశయంతో పాటు మొప్పలు, కణజాలాల్లోనూ ప్లాస్టిక్ ఆనవాళ్లు కనిపించాయి. 120 నెత్తళ్లు, 20 సావిడాయిలపై పరిశోధన నిర్వహించారు. ప్రస్తుతం స్థాయిలు ప్రమాదకరం కాకపోయినా, సముద్ర కాలుష్యంపై ఈ ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

విశాఖ తీరంలో పట్టిన కొన్ని చేపల్లో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిశోధనలో వెల్లడైంది. ఇవి ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో లేనప్పటికీ.. చేపల జీర్ణాశయానికే పరిమితం కాకుండా మొప్పలు, కణజాలాల్లోనూ కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. సముద్ర కాలుష్యం ఏ స్థాయికి చేరిందో ఈ పరిశోధన సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
నెత్తళ్లు, సావిడాయిలపై పరిశోధన
ఆంధ్ర విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర విభాగం ప్రొఫెసర్ మంజులత నేతృత్వంలో జి. చంద్రిక ఈ అధ్యయనం చేపట్టారు. విశాఖ హార్బర్‌కు సముద్రం నుంచి తీసుకొచ్చిన నెత్తళ్లు, సావిడాయి (రిబ్బన్ ఫిష్) చేపలను పరిశోధన కోసం ఎంపిక చేశారు. ఈ అధ్యయనం తాజాగా ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్’లో ప్రచురితమైంది. ఒక సీజన్‌లో వేర్వేరు రోజుల్లో లభించిన 120 నెత్తళ్లు, 20 సావిడాయిలను పరిశీలించినట్లు పరిశోధకులు తెలిపారు. ఒక్కో చేపను మూడు సార్లు పరీక్షించగా.. ప్రతి పరీక్షలోనూ మైక్రోప్లాస్టిక్ కణాలు గుర్తించినట్లు వెల్లడించారు.
జీర్ణాశయంలోనే ఎక్కువ
పరిశోధనలో చేపల జీర్ణాశయంలో అత్యధికంగా ప్లాస్టిక్ కణాలు కనిపించాయి. అనంతరం మొప్పలు, కణజాలాల్లోనూ వీటి ఆనవాళ్లు గుర్తించారు. సుమారు 0.5 మిల్లీమీటర్ నుంచి 4.5 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్న మైక్రోప్లాస్టిక్ కణాలను పరిశోధకులు గుర్తించినట్లు తెలిపారు. సాధారణంగా తాజా చేపలను వండే ముందు మొప్పలు, జీర్ణాశయం వంటి కొన్ని భాగాలను తొలగిస్తారు. అయితే సావిడాయిలను ఎండబెట్టి తినే అలవాటు ఉన్నందున వాటిలోని ప్లాస్టిక్ కణాలు అలాగే మిగిలిపోయే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.
ఫుడ్ చైన్ ద్వారా ప్రవేశం
నెత్తళ్లు సముద్రంలోని చిన్న జీవులను ఆహారంగా తీసుకుంటాయి. సహజ ఆహార పరిమాణంలో తేలియాడే ప్లాస్టిక్ కణాలను కూడా అవి పొరపాటున మింగే అవకాశం ఉంది. ఇలా సముద్ర ఆహార గొలుసు ద్వారా మైక్రోప్లాస్టిక్ చేపల శరీరంలోకి చేరుతున్నట్లు పరిశోధకులు వివరించారు. ప్రస్తుతం గుర్తించిన స్థాయిలు ప్రమాదకరంగా లేనప్పటికీ, మైక్రోప్లాస్టిక్ చేపల ఇతర భాగాల్లోకి చేరడం సముద్ర పర్యావరణంపై పెరుగుతున్న ప్లాస్టిక్ కాలుష్యానికి సంకేతమని పరిశోధకులు చెబుతున్నారు. సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం మరోసారి గుర్తుచేస్తోంది.
