AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయవాడ ఉగ్రవాద కుట్ర కేసులో NIA ఛార్జిషీట్.. తొమ్మిది మందిపై అభియోగాలు..

విజయవాడ ఉగ్రవాద కుట్ర కేసులో కీలక పరిణామం చోటు కేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న తొమ్మిది మందిపై అభియోలను మోపుతూ NIA కీలక ఛార్జిషీట్ దాఖలు చేసింది. సోషల్ మీడియా ద్వారా యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు కుట్ర చేశారన్నట్లు ఛార్జ్‌ షీట్‌లో పేర్కొంది.

విజయవాడ ఉగ్రవాద కుట్ర కేసులో NIA ఛార్జిషీట్.. తొమ్మిది మందిపై అభియోగాలు..
Vijayawada Isis Radicalization
M Sivakumar
| Edited By: |

Updated on: Sep 19, 2026 | 3:14 PM

Share

విజయవాడ కేంద్రంగా నమోదైన ఆన్‌లైన్ రాడికలైజేషన్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక చర్య తీసుకుంది. కేసులో తొమ్మిది మంది నిందితులపై విజయవాడలోని ప్రత్యేక NIA కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ISISతో సంబంధాలు కొనసాగిస్తూ, సోషల్ మీడియా వేదికగా యువతను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారనేది దర్యాప్తు సంస్థ ఆరోపణ.

మార్చి 23న పోలీసుల కేసు

ఈ వ్యవహారంపై 2026 మార్చి 23న విజయవాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసుకు వివిధ రాష్ట్రాలతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి కేసు NIAకి బదిలీ అయింది. ప్రస్తుతం ఈ కేసులో 11 మంది నిందితులు, ఒక బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు NIA తెలిపింది.

తొమ్మిది మందిపై అభియోగాలు

NIA ఛార్జిషీట్‌లో మహ్మద్ రెహ్మతుల్లా షరీఫ్, మహ్మద్ డానిష్, మీర్జా సొహైల్ బేగ్, లక్కీ అహ్మద్, జిషాన్ అబ్దుల్ మజీద్, మీర్ ఆసిఫ్ అలీ, అబ్దుల్ సలాం, షారుఖ్ ఖాన్, షేక్ ఫైజ్ ఉర్ రెహ్మాన్ పేర్లను చేర్చింది. వీరిపై BNS, UAPAలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్లు NIA తెలిపింది.

ఇన్‌స్టా ద్వారా యువతను ప్రభావితం?

NIA ప్రకారం.. నిందితులు Instagramతో పాటు ఇతర సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి యువతను ప్రభావితం చేసి, ఉగ్రవాద కార్యకలాపాల వైపు ఆకర్షించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ISIS కార్యకలాపాలకు మద్దతుగా పనిచేస్తూ, భారత్‌లో హింసాత్మక మార్గాల ద్వారా తమ లక్ష్యాలను సాధించేందుకు కుట్ర పన్నారనేది ఏజెన్సీ ఆరోపణ.

ఆయుధ శిక్షణ, పేలుడు పదార్థాల తయారీపై దర్యాప్తు

యువతను ఉగ్రవాద కార్యకలాపాల్లోకి తీసుకురావడంతో పాటు ఆయుధాల వినియోగంలో శిక్షణ, పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసినట్లు NIA పేర్కొంది. అయితే ఇవన్నీ దర్యాప్తు సంస్థ ఛార్జిషీట్‌లో చేసిన ఆరోపణలు; కేసులో తుది న్యాయ నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.

రహస్య కమ్యూనికేషన్ కోసం ప్రత్యేక యాప్

నిందితులు ఒకరితో ఒకరు రహస్యంగా సంప్రదింపులు జరుపుకునేందుకు ప్రత్యేకమైన సురక్షిత కమ్యూనికేషన్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసి, పరీక్షించినట్లు NIA తెలిపింది. తమ కార్యకలాపాల్లో ఈ వ్యవస్థను ఉపయోగించుకునేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది.

దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది

ప్రస్తుతం తొమ్మిది మందిపై ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ.. కేసులోని ఇతర అనుబంధాలు, నిందితుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. తదుపరి దశలో మరిన్ని అభియోగాలు లేదా ఛార్జిషీట్లు దాఖలయ్యే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us