AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచాన్ని ఏకం చేసేది కృష్ణ చైతన్యమే.. న్యూయార్క్‌ ఇస్కాన్ ఆలయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పూజలు

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న విభేదాలు, ఘర్షణలను రూపుమాపే అద్భుత శక్తి ఒక్క కృష్ణ చైతన్యానికే ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లోని ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించిన ఆయన, నిరాశ్రయులకు స్వయంగా అన్నదానం చేసి ఆధ్యాత్మిక సేవలో పాల్గొన్నారు.

ప్రపంచాన్ని ఏకం చేసేది కృష్ణ చైతన్యమే.. న్యూయార్క్‌ ఇస్కాన్ ఆలయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పూజలు
Rss Chief Mohan Bhagwat Visits New York Iskcon
Krishna S
|

Updated on: Aug 29, 2026 | 8:38 AM

Share

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అమెరికా పర్యటనలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ న్యూయార్క్‌లోని ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, నిరాశ్రయులకు ఆహార పంపిణీ చేసే సేవా కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ భక్తులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. నేటి సమాజంలో విభేదాలు, వైరుధ్యాలు పెరిగిపోతున్న తరుణంలో కృష్ణ చైతన్యమే ప్రపంచాన్ని ఏకం చేయగలదని మోహన్ భగవత్ తెలిపారు. ‘‘ప్రస్తుత ప్రపంచంలో అనేక రకాల వివాదాలు, ద్వంద్వాలు ఉన్నాయి. వాటన్నింటినీ ఏకం చేసే శక్తి ఒక్క చైతన్యానికి మాత్రమే ఉంది. ఆ చైతన్యమే కృష్ణ చైతన్యం. విభేదాలు ఎన్ని ఉన్నా అంతిమంగా అంతా కృష్ణమయమే అనే బలమైన భావన మనలో ఉండాలి. ప్రతి ఒక్కరి హృదయంలో ఈ భావం నిండినప్పుడు ప్రపంచం స్వర్గధామంగా మారుతుంది’’ అని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాల పర్యటనలో భాగంగా న్యూయార్క్ చేరుకున్న మోహన్ భగవత్.. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రఖ్యాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగే యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ వేడుకను బహుళ సంస్కృతులు, భిన్న మతాల కలయికగా నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. అయితే మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమంపై న్యూయార్క్‌లో కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. న్యూయార్క్ నగర మేయర్ జొహ్రాన్ మమ్దానీ ఈ కార్యక్రమానికి తమ మద్దతు లేదని వ్యాఖ్యానించినప్పటికీ, ప్రైవేటుగా నిర్వహించే కార్యక్రమాన్ని రద్దు చేసే అధికారం నగర పరిపాలనకు ఉందో లేదో స్పష్టత లేదన్నారు.

మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరవుతున్న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆచార్య మహామండలేశ్వర్ శ్రీ స్వామి అవధేశానంద గిరి జీ మహారాజ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని, అయితే ఈ సభ ద్వారా వసుధైవ కుటుంబకం అనే భారతీయ సనాతన సిద్ధాంతాన్ని, విశ్వ సౌభ్రాతృత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో హిందూ అమెరికన్ ఫౌండేషన్ పాల్గొనే వారికి భద్రతాపరమైన సూచనలను జారీ చేసింది.

Follow Us