AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్ రివీల్..! మనిషి మెదడు ఒకటి కాదా..? రెండు వేర్వేరు మూలాల నుంచి వచ్చిందా?

మానవ మెదడు పుట్టుకపై సంచలన పరిశోధన వెలువడింది. స్టాన్‌ఫోర్డ్ శాస్త్రవేత్తల ప్రకారం, మెదడు ఒకే మూలం నుండి కాకుండా, పూర్వ మెదడు, పశ్చాత్ మెదడు ప్రాంతాలు దాదాపు 500 మిలియన్ సంవత్సరాల క్రితమే స్వతంత్రంగా అభివృద్ధి చెందిన రెండు వేర్వేరు కణ సమూహాల నుండి ఏర్పడ్డాయి. ఈ ఆవిష్కరణ ALS వంటి నాడీ సంబంధిత వ్యాధుల చికిత్సలకు కొత్త ఆశలు కల్పిస్తోంది.

షాకింగ్ రివీల్..! మనిషి మెదడు ఒకటి కాదా..? రెండు వేర్వేరు మూలాల నుంచి వచ్చిందా?
Shocking Brain Discovery
Balaraju Goud
|

Updated on: Sep 19, 2026 | 6:05 AM

Share

శతాబ్దాలుగా మానవ మెదడు ఒకే ప్రారంభ కణ సమూహం నుంచి క్రమంగా అభివృద్ధి చెందిన ఒకే అవయవంగా శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. అయితే స్టాన్‌ఫోర్డ్ పరిశోధకుల నేతృత్వంలోని తాజా అధ్యయనం ఈ అవగాహనకు కొత్త కోణాన్ని చూపిస్తోంది. మెదడు దాదాపు 500 మిలియన్ సంవత్సరాల క్రితమే స్వతంత్రంగా అభివృద్ధి చెందిన రెండు వేర్వేరు వ్యవస్థల నుంచి ఏర్పడినట్లు పరిశోధకులు గుర్తించారు.

మానవ మెదడును ప్రధానంగా పూర్వ మెదడు, మధ్య మెదడు, పశ్చాత్ మెదడు అనే మూడు ప్రాంతాలుగా విభజిస్తారు. భాష, తార్కిక ఆలోచన, చైతన్యం, అమూర్త ఆలోచన వంటి సంక్లిష్ట సామర్థ్యాలకు పూర్వ మెదడు కీలకం. శ్వాస, హృదయ స్పందన, నిద్ర, ఆకలి వంటి ప్రాథమిక శారీరక విధులతో పాటు ముఖ కదలికలు, మాట్లాడటం, మింగడం వంటి చర్యల్లో పశ్చాత్ మెదడు ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ఇప్పటివరకు ఈ మెదడు ప్రాంతాలన్నీ పిండం అభివృద్ధి ప్రారంభ దశలోని ఒకే రకమైన మూల కణాల నుంచి ఉద్భవిస్తాయని భావించారు. కానీ కొత్త పరిశోధన ప్రకారం.. పిండం అభివృద్ధి తొలిదశలోనే ముందు, వెనుక మెదడు ప్రాంతాలు రెండు భిన్నమైన కణ సమూహాల నుంచి అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. ఇవి వేర్వేరు అభివృద్ధి మార్గాలను అనుసరిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

స్టాన్‌ఫోర్డ్ అభివృద్ధి జీవశాస్త్ర పరిశోధకుడు, అధ్యయన సీనియర్ రచయిత కైల్ లోహ్ అధ్యయనాకి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. మెదడు వెనుక భాగంతో పోలిస్తే ముందు భాగం పూర్తిగా భిన్నమైన మూల కణ సమూహం నుంచి ఉద్భవిస్తుందని చూపించడం ఇదే తొలిసారి.

ఈ ఆవిష్కరణకు వైద్యపరంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రయోగశాలలో మానవ పశ్చాత్ మెదడు కణాలను పెంచడం ఎందుకు కష్టంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడవచ్చంటున్నా వైద్య శాస్త్రవేత్తలు. ఈ కొత్త అవగాహన ఆధారంగా స్టాన్‌ఫోర్డ్ బృందం మూలకణాల నుంచి పనిచేసే మానవ హిండ్‌బ్రెయిన్ మోటార్ న్యూరాన్‌లను విజయవంతంగా రూపొందించింది. అవి విద్యుత్ క్రియాశీలతను ప్రదర్శించడంతో పాటు ముఖం, మింగే కండరాలను నియంత్రించే న్యూరాన్‌లకు సంబంధించిన ప్రత్యేక ప్రోటీన్లను ఉత్పత్తి చేశాయంటున్నారు. కోళ్లు, జీబ్రాఫిష్, ఏకార్న్ వార్మ్స్ వంటి వివిధ జీవులను పరిశీలించినప్పుడు కూడా ఇదే రెండు-భాగాల అభివృద్ధి నమూనాకు ఆధారాలు కనిపించాయి. దీంతో ఈ విభజన పరిణామ క్రమంలో చాలా ప్రాచీనమైనదై ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

ముఖ్యంగా ALS, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) వంటి నాడీ సంబంధిత వ్యాధులపై పరిశోధనకు ఈ ఫలితాలు ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రయోగశాలలో సంబంధిత న్యూరాన్‌లను అభివృద్ధి చేయడం ద్వారా వ్యాధుల్లో కణాలు ఎలా దెబ్బతింటున్నాయో అధ్యయనం చేయడంతో పాటు భవిష్యత్తులో కొత్త చికిత్సలను పరీక్షించే అవకాశాలు మెరుగుపడవచ్చంటున్నారు వైద్య నిపుణులు. వెన్నుపాముతో సహా నాడీ వ్యవస్థలోని ఇతర భాగాలకూ ఇలాంటి ప్రాచీన అభివృద్ధి మూలాలు ఉన్నాయా అనే అంశంపై పరిశోధకులు తదుపరి అధ్యయనాలు చేయనున్నారు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us