బొత్స కుటుంబానికి మిశ్రమ ఫలితాలు.. కుమార్తె ఓటమి, కోడలికి విజయం.. మేనకోడలుకి భారీ మెజార్టీ!
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు వేదికయ్యాయి. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యుల పోటీపై అందరి దృష్టి నెలకొంది. ఒకే కుటుంబం నుంచి నలుగురు జడ్పీటీసీ స్థానాల కోసం ప్రయత్నించగా, చివరకు ఒకరి నామినేషన్ తిరస్కరణకు గురైంది. పోటీలో నిలిచిన వారిలో కుమార్తె బొత్స అనూష ఓటమి పాలవగా, కోడలు బొత్స పూజిత విజయం సాధించారు. మరోవైపు బొత్సకు దూరమై టీడీపీలో చేరిన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె సిరి సహస్ర భారీ మెజార్టీతో గెలుపొందడం ఈ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు వేదికయ్యాయి. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యుల పోటీపై అందరి దృష్టి నెలకొంది. ఒకే కుటుంబం నుంచి నలుగురు జడ్పీటీసీ స్థానాల కోసం ప్రయత్నించగా, చివరకు ఒకరి నామినేషన్ తిరస్కరణకు గురైంది. పోటీలో నిలిచిన వారిలో కుమార్తె బొత్స అనూష ఓటమి పాలవగా, కోడలు బొత్స పూజిత విజయం సాధించారు. మరోవైపు బొత్సకు దూరమై టీడీపీలో చేరిన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె సిరి సహస్ర భారీ మెజార్టీతో గెలుపొందడం ఈ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అనూషకు 5,136 ఓట్ల తేడాతో ఓటమి
బొండపల్లి జడ్పీటీసీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బొత్స అనూషపై టీడీపీ అభ్యర్థి పాశల నీరజ విజయం సాధించారు. నీరజ ఏకంగా 5,136 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవికి సంబంధించి అనూష పేరు కూడా ప్రచారంలో ఉండటంతో ఈ ఓటమి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన అనూషకు ఈ ఫలితం ఎదురుదెబ్బగా నిలిచింది.
కోడలు పూజితకు 1,599 ఓట్ల మెజార్టీతో విజయం!
గరివిడి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుటుంబానికి ఊరట లభించింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొత్స పూజిత 1,599 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికల్లో బొత్స కుటుంబం తరఫున ఒక కీలక విజయం నమోదైంది. బొండపల్లిలో కుమార్తె ఓటమి ఎదురుకాగా, గరివిడిలో కోడలు గెలవడం కుటుంబానికి మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది.
సోదరి వెంకటలక్ష్మి ఫలితంపై ఉత్కంఠ
గుర్ల జడ్పీటీసీ స్థానం నుంచి బొత్స సోదరి సంగంరెడ్డి వెంకటలక్ష్మి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కౌంటింగ్ ప్రారంభంలో ఆమె ఆధిక్యంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే టీడీపీ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. చివరికి టీడీపీ అభ్యర్థిపై 316 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. దీంతో కొంత బొత్స కుటుంబానికి ఊరట లభించనట్లైంది.
చిన్న శ్రీను కుమార్తెకు 6,651 ఓట్ల భారీ విజయం!
ఈ ఎన్నికల్లో మరో కీలక పరిణామం చిన్న శ్రీను కుమార్తె మజ్జి సిరి సహస్ర విజయం. తెర్లాం జడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె 6,651 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గతంలో బొత్స సత్యనారాయణకు అత్యంత సన్నిహితంగా ఉన్న చిన్న శ్రీను వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరడం, ఇప్పుడు ఆయన కుమార్తె విజయం సాధించడం జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు కారణమైంది.
చైతన్య నామినేషన్ తిరస్కరణ
బొత్స కుటుంబం నుంచి పూసపాటిరేగ జడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాలనుకున్న చైతన్య నామినేషన్ సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైంది. దీంతో కుటుంబం నుంచి నలుగురు బరిలోకి దిగాలన్న ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు.
రాజకీయంగా ప్రాధాన్యత!
ఈ ఫలితాలు చీపురుపల్లి ప్రాంత రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిస్థితిని ఆవిష్కరించాయి. ఒకవైపు బొత్స కుమార్తె ఓటమి, మరోవైపు కోడలు విజయం, ఇంకోవైపు చిన్న శ్రీను కుమార్తె భారీ మెజార్టీతో గెలుపొందడం ప్రత్యేకంగా నిలిచాయి. గరివిడి ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 11, టీడీపీ 8 స్థానాలు గెలుచుకోగా, ఒక స్థానం ఫలితం పెండింగ్‌లో ఉంది. గుర్లలో ప్రకటించిన ఆరు ఎంపీటీసీ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ నాలుగు, టీడీపీ రెండు స్థానాలు గెలుచుకున్నాయి.
మొత్తంగా బొత్స సత్యనారాయణ కుటుంబానికి ఈ పరిషత్ ఎన్నికలు మిశ్రమ ఫలితాలను అందించాయి. కుమార్తె ఓటమి రాజకీయంగా చర్చనీయాంశం కాగా, కోడలు. సోదరి విజయం కుటుంబానికి ఊరటనిచ్చింది. అదే సమయంలో గతంలో బొత్సతో కలిసి పనిచేసిన చిన్న శ్రీను కుమార్తె టీడీపీ తరఫున భారీ మెజార్టీతో గెలవడం విజయనగరం జిల్లా రాజకీయాల్లో మరో ముఖ్యమైన పరిణామంగా నిలిచింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
